Share News

నిధులున్నా.. నిర్మాణాలు సాగట్లే!

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:48 PM

జిల్లాలో ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులకు మోక్షం కలగడం లేదు.

నిధులున్నా.. నిర్మాణాలు సాగట్లే!
కురపాం ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో మధ్యలో నిలిచిపోయిన భవన నిర్మాణాలు పనులు

-‘ఏకలవ్య’లో మౌలిక వసతుల కల్పన పనులు ప్రారంభం కావట్లే..

-కేంద్రం నిధులు మంజూరు చేసి నాలుగేళ్లు..

-పెండింగ్‌ బిల్లుల సాకుతో అగ్రిమెంట్‌కు ముందుకు రాని కాంట్రాక్టర్లు

-విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బందికి తప్పని అవస్థలు

పార్వతీపురం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులకు మోక్షం కలగడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఏళ్లు గడుస్తున్నా.. కాంట్రాక్టర్లు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో నిర్మాణాలు ప్రారంభం కావడం లేదు. మరోవైపు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ఇక్కట్లు తప్పడం లేదు. వాస్తవంగా ఏకవల్య పాఠశాలలు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలంటే రూ.40 కోట్ల చొప్పున మంజూరు చేయాల్సి ఉంది. కానీ గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు రూ.12 కోట్లు కేటాయించింది. 2022 తర్వాత అదనపు నిధులను కూడా మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు ఈఎండీ చెల్లించి పనులకు అగ్రిమెంట్‌ కుదుర్చుకోవాలి. కానీ పెండింగ్‌ బిల్లులు సాకుగా చూపుతూ వారు నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. మరోవైపు నిబంధనల మేరకు వారిని మార్చే పరిస్థితి లేకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి

.

- జిల్లాలో పాచిపెంట మండలం కోటికిపెంట, భామిని, కురుపాం, మక్కువ మండలం అనసభద్రలో ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో కోటికపెంట మినహా మిగిలిన పాఠ శాలలను సొంత భవనాల్లో ప్రారంభించారు.

- ప్రతి పాఠశాలకు మూడు అంతస్థుల భవనాలతో పాటు విద్యార్థులకు ప్రత్యేకంగా డార్మెటరీ గదులు ఉండాలి. 28 స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. వాటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం మొదట్లో విడుదల చేసిన రూ.12 కోట్ల నిధులు సరిపోలేదు. దీంతో అదనంగా ప్రతి పాఠశాలకు అదనంగా రూ.ఐదు కోట్ల చొప్పున మంజూరు చేసింది. ఈ నిధులతో భవన నిర్మాణాలు పూర్తయినా పాఠశాలలో అదనపు మౌలిక వసతులను కల్పించాల్సి ఉంది. జిల్లాలోని ఇప్పటికే ప్రారంభమైన అనసభద్ర, కురుపాం, భామిని పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక డార్మెటరీ సదుపాయం లేదు. అదే విధంగా వారంతా ఒకే బ్లాకులో ఉండాల్సి వస్తోంది.. స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణం జరగకపోవడంతో ఉపాధ్యాయులతో పాటు సిబ్బందికి కూడా అవస్థలు తప్పడం లేదు.

- ఈ ఏడాది మార్చిలో బిల్లులు అప్‌లోడ్‌ అయినా.. ఆర్థికశాఖ నుంచి తిరస్కరణకు గురయ్యాయి. దీంతో రూ.మూడున్నర కోట్ల చొప్పున బిల్లులు చెల్లింపు కాలేదు. ఈ ప్రభావం మిగిలిన పనులపై పడింది. కాంట్రాక్టర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి.

నిధుల మంజూరు మాట వాస్తవమే...

జిల్లాలోని నాలుగు ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.5 కోట్ల చొప్పున అదనంగా నిధులు మంజూరైన మాట వాస్తవమే. కానీ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో పనులు ప్రారంభం కాలేదు. ఒక్కో పాఠశాలకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులను అప్‌లోడ్‌ చేశాం.

- మణిరాజా, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, గిరిజన ఇంజనీరింగ్‌ శాఖ, పార్వతీపురం

Updated Date - Jul 10 , 2026 | 11:48 PM