Drinking Water! నది చెంతనే ఉన్నా.. తాగునీటికి అవస్థే!
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:47 AM
Despite Being Near a River… Struggle for Drinking Water! వీరఘట్టం మండలంలో నదితీర గ్రామాల ప్రజల గొంతెండుతోంది. నాగావళి చెంతనే ఉన్నా.. వారికి తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఏటా వేసవిలో వారు ఈ సమస్య ఎదుర్కొంటున్నా స్పందించే వారే కరువయ్యారు.
నేటికీ పూర్తికాని జలజీవన్‌మిషన్ పనులు
నాగావళి తీర ప్రాంత గ్రామస్థులకు తప్పని ఇబ్బందులు
వీరఘట్టం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): వీరఘట్టం మండలంలో నదితీర గ్రామాల ప్రజల గొంతెండుతోంది. నాగావళి చెంతనే ఉన్నా.. వారికి తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఏటా వేసవిలో వారు ఈ సమస్య ఎదుర్కొంటున్నా స్పందించే వారే కరువయ్యారు. ప్రస్తుతం ఆయా గ్రామస్థులు చలమల నీటిపైనే ఆధారపడుతున్నారు. బిందెడు నీటి కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. వేసవి ఆరంభంలోనే ఇలా ఉంటే. ఇక మున్ముందు పరిస్థితేమిటోనని నదీతీర ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
వీరఘట్టం మండల కేంద్రానికి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న కడకెల్ల, కిమ్మి, గడగమ్మ తదితర గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఆ మూడు నాగావళి నదీ తీర ప్రాంతాల్లో సుమారు 3,500 మంది జనాభా ఉన్నా తాగునీటి సదుపాయం లేదు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. బోర్లు ఉన్నప్పటికీ తాగేందుకు ఈ నీరు పనికిరావడం లేదు. ఇక కిమ్మిలో రక్షి నీటి పథకం ఉన్నా.. ఇంటింటికీ కుళాయిలు లేవు. మరోవైపు జల్ జీవన్‌మిషన్ పథకం కింద చేపట్టిన పనులు నేటికీ పూర్తికాలేదు. బిల్లులు సకాలంలో అందకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. మొత్తంగా నదీతీర గ్రామాలైన కడకెల్ల, కిమ్మి, గడగమ్మ మహిళలు సురక్షిత నీటి కోసం బిందెలు పట్టుకుని నాగావళికి చేరుకోవాల్సి వస్తోంది. నదిలో చలమల నీటిని తోడుకుని ఇళ్లకు తెచ్చుకోవాల్సి వస్తోంది. కాగా ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన కుళాయిలు ద్వారా తాగునీరు సరఫరా కాకపోవడంతో ఆయా ప్రాంతవాసులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ కావ్యశ్రీని వివరణ కోరగా.. ‘కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున పనులు నిలిచాయి. బిల్లులు మంజరైన వెంటనే పనులు పూర్తి చేస్తాం.’ అని తెలిపారు.