It Remains Unchecked! ప్రత్యేక విభాగం ఉన్నా..అదుపులోకి రావట్లే!
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:04 AM
Despite a Special Wing, It Remains Unchecked! పార్వతీపురం, సీతంపేట ఐటీడీల పరిధిలో రెండు ప్రత్యేక మలేరియా నివారణ విభాగాలు ఉన్నా.. జ్వరాలు అదుపులోకి రావడం లేదు. రోజురోజుకూ మలేరియా విజృంభిస్తోంది.
దోనుబాయి, కుశిమి పీహెచ్‌సీల పరిధిలో అధికంగా పాజిటివ్ కేసులు
నివారణ చర్యలపై ఆరోపణలు.. కొరవడిన అధికారుల పర్యవేక్షణ
పార్వతీపురం, జూన్30(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం, సీతంపేట ఐటీడీల పరిధిలో రెండు ప్రత్యేక మలేరియా నివారణ విభాగాలు ఉన్నా.. జ్వరాలు అదుపులోకి రావడం లేదు. రోజురోజుకూ మలేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మలేరియాతో మృత్యువాత పడ్డారు. గిరిజన ప్రాంతాల్లో ఎంతోమంది జ్వరాలతో మంచం పట్టారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ మలేరియా అదుపులోకి రావడం లేదు. పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం , కొమరాడ, జియ్యమ్మవలస ప్రాంతాల్లో గతంలో పోలిస్తే మలేరియా తగ్గుముఖం పడుతోంది. కానీ సీతంపేట పరిధిలో ఆ పరిస్థితి లేదు. ఏటా ఈ ప్రాంతాల్లోనే అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. స్ర్పేయింగ్ వంటి చర్యలు సక్రమంగా చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో దోనుబాయి, కుశిమి, మర్రిపాడు, భామిని, బత్తిలి, బాలేరు, వీరఘట్టం, అన్నవరం, ఎం.సింగుపురం, బిటివాడ పీహెచ్‌సీలు ఉన్నాయి. వాటిలో అత్యధికంగా దోనుబాయి, కుశిమి పీహెచ్‌సీల పరిధిలో మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోద వుతున్నాయి. ఈ ఏడాది జూన్ 27 వరకు దోనుబాయి పరిధిలో 23 కేసులు, కుశిమిలో 12 మలేరియా కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో రోగుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సీతంపేట ఐటీడీఏ కేంద్రంగా ఒక మలేరియా అధికారితో పాటు ఏఎంవో, నలుగురు హెల్త్ అసిస్టెంట్లు ఉన్నా.. మలేరియా నివారణ చర్యలపై పర్యవేక్షణ కొరవడింది. జిల్లా కేంద్రం పార్వతీపురంలోనే మలేరియా అధికారితో పాటు ఇతర సిబ్బంది ఉంటున్నారు. కానీ సీతంపేటలో అధికారులు అలా ఉండడం లేదని తెలిసింది. దీంతో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీనిపై డీఎంహెచ్‌వో భాస్కరరావును వివరణ కోరగా... ‘పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని జిల్లా మలేరియా అధికారులు ఎప్పటి కప్పుడు వ్యాధి నివారణ చర్యలను పర్యవేక్షించాలి. స్థానికంగా వారు ఉండాలి. లేకపోతే చర్యలు తప్పవు’ అని తెలిపారు.
మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు..
గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుకళ్లుకు చెందిన పాలక జస్టిన్(14) జ్వరంతో మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడారు. తమ బిడ్డ జస్టిన్‌ను బొబ్బిలి సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల ఆశ్రమ పాఠశాల నిర్వా హకులే పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు.విద్యార్థికి జ్వరం వచ్చిన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించలేదన్నారు. కేవలం పారాసిటమాల్ మాత్ర వేసి.. సెలవు చీటి రాయించి.. ఇంటికి పంపించేశారని తెలిపారు. సకాలంలో వైద్య సేవలు అందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేవాడని రోదించారు.
మలేరియా రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్
మలేరియా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యాధికారులను కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం వారితో ఆయన మాట్లాడుతూ.. మలేరియా కేసులు ఎక్కువగా నమోదైన హైరిస్క్ గ్రామాలను గుర్తించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆశా, ఏన్‌ఎం, హెల్త్ అసిస్టెంట్ సీహెచ్‌వోల సమన్వయంతో మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. టీమ్-1 ఏఎన్‌ఎం, ఆశ, టీమ్-2 హెల్త్ అసిస్టెంట్, ఆశా, టీమ్-3 ఎంఎల్‌హెచ్‌పీ, ఆశా బృందాలు ప్రతీ ఇంటిని సందర్శించి జ్వర లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణమే మలేరియా రక్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పాజిటివ్‌గా తేలిన వారికి అక్కడికక్కడే ఉచితంగా చికిత్స ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఈ శిబిరాలను హెల్త్ సూపర్‌వైజర్లు పర్యవేక్షించాలన్నారు. రోజూ సాయంత్రం ఐదు గంటల లోపు డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయానికి నివేదికలు పంపించాలన్నారు.