Desperation for urban farmers? పట్టణ రైతులకు నిరాశేనా?
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:18 AM
Desperation for urban farmers? పట్టణాలకు సమీపంలో భూములున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. ఉపాధి హామీతో సహా ఏ పథకమూ వర్తించడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో పట్టణ రైతులకు స్థానం లేని పరిస్థితి నెలకొంది. దీనిపై వారు అధికారులకు, నేతలకు విన్నపాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు.
పట్టణ రైతులకు
నిరాశేనా?
బొబ్బిలిలో 2700 హెక్టార్ల పంట భూములు
ఉపాధితో సహా ఏ పథకమూ వర్తించని వైనం
రైతు భరోసా కేంద్రాల్లో పట్టణ రైతులకు స్థానం కరువు
బొబ్బిలి, జనవరి 11(ఆంధ్రజ్యోతి):
పట్టణాలకు సమీపంలో భూములున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. ఉపాధి హామీతో సహా ఏ పథకమూ వర్తించడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో పట్టణ రైతులకు స్థానం లేని పరిస్థితి నెలకొంది. దీనిపై వారు అధికారులకు, నేతలకు విన్నపాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు.
బొబ్బిలి మునిసిపల్ పరిధిలోని పాతబొబ్బిలి, మల్లమ్మపేట, గొల్లపల్లి, అప్పయ్యపేట, రామన్నదొరవలస గ్రామాలున్నాయి. ఇవన్నీ మునిసిపాలిటీ పరిధిలోకి వస్తాయి. వీటిల్లో సుమారు రెండువేల మంది రైతులు 2700 హెక్టార్లలో పంటలను సాగు చేసుకుంటున్నారు. అలాగే 15 పంట చెరువులున్నాయి. ఉపాధి హామీ పథకం పట్టణాలకు వర్తించదన్న నిబంధన కారణంగా ఈ రైతులంతా ఎంతగానో నష్టపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రైతు సేవా కేం ద్రాల నుంచి పట్టణ రైతులకు ఏ సేవలూ అందకపోవడం గమనార్హం. పట్టణంలో ఏర్పాటు చేసిన సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లను కేటాయించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు సేవా కేంద్రాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కోసం ఇండెంట్ పెట్టుకునే వెసులుబాటును కేవలం గ్రామీణ రైతులకు మాత్రమే కల్పించారు. పట్టణాలకు చెందిన రైతులను పట్టించుకోకపోవడంపై వారంతా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ కార్యాలయానికి వచ్చే పట్టణ రైతులకు అధికారులు మానవతాదృక్పథంతో సేవలు అందిస్తున్నారు.
పట్టణాల రైతులు శాపగ్రస్తులా ?
ఎస్.గోపాలం, రైతు, బొబ్బిలి
పట్టణాలకు చెందిన రైతులను శాపగ్రస్తుల్లా ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయి. గ్రామాల్లో కోట్లాది రూపాయలతో ఉపాధిహామీ పనులు చేస్తున్నారు కానీ పట్టణాలకు ఆ పథకం వర్తించకుండా వ్యవహరిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పట్టణ ప్రాంతానికి, అందులో వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నప్పటికీ ఆ వినతులన్నీ బుట్టదాఖలవుతున్నాయి.
పట్టణాలకు వర్తింపజేయాలి
కె.పుణ్యవతి శ్రామికమహిళాసంఘం నేత
పట్టణాలకు ప్రత్యేకించి గ్రామీణ ఉపాధిహామీపథకం మాదిరిగా పథకాన్ని కచ్చితంగా ప్రవేశపెట్టాల్సిందే. యువత, మహిళలు, చేతివృత్తులవారు వేలాదిమంది ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ధికనిపుణులు సూచించిన మేరకు పట్టణ ఉపాధి పథకాన్ని అత్యవసరంగా ప్రవేశపెట్టవలసిందే.
పట్టణాల్లోనూ పంటల సాగు
మజ్జి శ్యామ్‌సుందర్, వ్యవసాయశాఖాధికారి, బొబ్బిలి
పట్టణ పరిధిలోని పాతబొబ్బిలి, మల్లమ్మపేట, గొల్లపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతులు ఆధునిక వ్యవసాయ సాగుపద్ధతులను అవలంభిస్తున్నారు. అలాంటి రైతులకు ఉపాధిహామీ పథకం వర్తిస్తే వారికి చేదోడువాదోడుగా నిలుస్తుంది. రైతు సేవా కేంద్రాల నుంచి పట్టణ రైతులకు సేవలు అందకపోవడం నిజమే.
వారికీ సేవలు అందేలా కృషి
బేబీనాయన, ఎమ్మెల్యే
పట్టణ రైతులకు కూడా గ్రామీణ ప్రాంతాలకు వర్తించే అన్ని రకాల సేవలు, పథకాలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతాను. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వ్యవసాయరంగానికి, పట్టణ రైతాంగానికి వర్తింపజేయాలని తాను చాలా ఏళ్ల నుంచి కోరుతున్నాను.