No Water Supply! పూడిక తొలగించినా .. నీరందట్లే!
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:59 PM
Desilted, Yet No Water Supply! జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని కాలువలో పూడిక తొలగించినా సాగునీరు సరఫరా కావడం లేదు. ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. దీంతో శివారు ప్రాంత ఆయకట్టుదారులు తలలు పట్టుకుంటున్నారు.
శివారు ప్రాంత భూములకు అందని సాగునీరు
ఖరీఫ్ రైతులకు తప్పని అగచాట్లు
గరుగుబిల్లి, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని కాలువలో పూడిక తొలగించినా సాగునీరు సరఫరా కావడం లేదు. ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. దీంతో శివారు ప్రాంత ఆయకట్టుదారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో అడపాదడపా కురిసిన వర్షాలకు పార్వతీపురం మండలం అడ్డాపుశీల పరిధిలోని కాలువలో అధికంగా ఇసుక నిల్వలు పేరుకుపోయాయి. దీంతో కొద్దిరోజుల పాటు దిగువకు నీరు సరఫరా కాలేదు. రైతుల ఆందోళనల నేపథ్యంలో అధికారులు సిల్ట్ తొలగించినా.. ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. జంఝావతి ప్రాజెక్టులో 150 క్యూసెక్కులే ఉండగా.. కాలువల గుండా తక్కువ స్థాయిలోనే నీటి సరఫరా అవుతుంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగు ఎలా చేపట్టాలో తెలియక టెన్షన్ పడుతున్నారు. జంఝావతి నుంచి పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి, మక్కువ మండలాల పరిధిలో 24,425 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు పరిధిలోని ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో 9 వేల ఎకరాలకు కూడా అంతంత మాత్రంగానే నీరు సరఫరా అవుతుంది. గరుగుబిల్లి మండలానికి పూర్తిస్థాయిలో నీరందడం లేదు. మరోవైపు ఆశించినస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఉబాలు చేయలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు.
తక్కువ స్థాయి నీటి నిల్వలు
జంఝావతి ప్రాజెక్టులో తక్కువ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. పైప్రాంతాల్లో వర్షాలు కురిస్తే నిల్వలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 150 క్యూసెక్కులే ఉండడంతో శివారు ప్రాంత భూములకు సాగునీటి సరఫరాలో ఆటంకం నెలకొంది.
- పి.పవన్‌కుమార్, ఏఈఈ, జంఝావతి ప్రాజెక్టు