Share News

Deputy Chief Minister 24న జిల్లాకు డిప్యూటీ సీఎం రాక

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:02 AM

Deputy Chief Minister to Visit the District on the 24th బలిజిపేట మండలం పెదపెంకిలో ఈ నెల 24న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో సమీక్షించారు. బోదకాలు వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు.

Deputy Chief Minister  24న జిల్లాకు డిప్యూటీ సీఎం రాక
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తదితరులు

  • ఆ గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష

పార్వతీపురం,జూన్‌6(ఆంధ్రజ్యోతి): బలిజిపేట మండలం పెదపెంకిలో ఈ నెల 24న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో సమీక్షించారు. బోదకాలు వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. పెదపెంకిలో గతంలో పైలేరియా కేసులు అధికంగా నమోదవడం, తరచూ ప్రజలు జ్వరాల బారిన పడడంతో డిప్యూటీ సీఎం ఆ గ్రామంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో బోదకాలు వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 195 మంది బోదకాలు వ్యాధిగ్రస్థులు గ్రామంలో ఉన్నారు. ఏడాది నుంచి కేసుల సంఖ్య పెరగకపోయినప్పటికీ .. అనేక మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా సుమారు రూ.ఆరు కోట్ల పైబడి ఉపాధి హామీ పథకం నిధులతో ఆ గ్రామంలో మ్యాజిక్‌ డ్రైన్స్‌తో పాటు అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు కలెక్టర్‌ వివరించారు. పారిశుధ్యం మెరుగుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఆక్రమణలు తొలగించి మ్యాజిక్‌ మురుగు కాలువలు నిర్మించామన్నారు. ఈ కాలువల్లో మురుగునీరు ఇంకిపోవడంతో పాటు ఎటువంటి దుర్వాసన ఉండదని, దీనివల్ల దోమలు వ్యాపించవని కలెక్టర్‌ చెప్పారు. జిల్లాలో తొలిసారిగా పెదపెంకిలో మ్యాజిక్‌ డ్రైన్లు నిర్మించినట్లు తెలిపారు. అంతేకాకుండా సీసీ రహదారుల నిర్మాణాలు, చెరువుల శుభ్రత తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ విషయాలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌.. కలెక్టర్‌తో పాటు ఇతర శాఖల అధికారులను అభినందించారు. ఈనెల 24న పెదపెంకి గ్రామంలో మ్యాజిక్‌ డ్రైన్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. కలెక్టర్‌లో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డ్వామా పీడీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

పెదపెంకిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్‌

పెదపెంకి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ నెలలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో పర్యటిం చనున్న నేపధ్యంలో సంబంధిత అభివృద్ధి పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలోని పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య సేవలకు సంబంధించిన పనులపై దృష్టిసారించాలన్నారు. పెదపెంకి గ్రామంలో పైలేరియా నియంత్రణకు కృషి చేసిన అధికారులను కలెక్టర్‌ అభినందించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గ, డీఎంహెచ్‌వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

అంకితభావంతో పనిచేయాలి..

ఉపాధ్యాయులు వృత్తిని ప్రేమించి పని చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. ఉపాధ్యాయులు, అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. ఒకే క్లాస్‌రూమ్‌కు పరిమితం కాకుండా బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని ఆదేశించారు. మొక్కలు నాటడం, పూలు కోయడం, తరగతి గదులు, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడంపై పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ తరం పిల్లలకు సాంకేతికతపై ఎంతో అవగాహన ఉందని, కాబట్టి ఉపాధ్యాయులు కూడా అప్‌డేట్‌ కావాలని విద్యాశాఖాధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Updated Date - Jun 07 , 2026 | 12:02 AM