Deputation for Swarna employees స్వర్ణ ఉద్యోగులకు డిప్యుటేషన్
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:04 AM
Deputation for Swarna employees స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో (సచివాలయాలు)అదనంగా ఉన్నారని ప్రభుత్వం భావిస్తున్న పలువురు ఉద్యోగులను వేరే విభాగాలకు పంపించేందుకు రంగం సిద్ధమైంది.
స్వర్ణ ఉద్యోగులకు డిప్యుటేషన్
ఇతర విభాగాలకు తరలింపు
జిల్లాలో 194 మంది ఎంపిక
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా అధికారి
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో (సచివాలయాలు)అదనంగా ఉన్నారని ప్రభుత్వం భావిస్తున్న పలువురు ఉద్యోగులను వేరే విభాగాలకు పంపించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో పనిచేస్తున్న ఏయే విభాగాలగు చెందిన ఎంతమందిని ఏ విభాగాలకు పంపించాలన్న విషయంపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లును దాదాపు పూర్తిచేశారు.
నెల్లిమర్ల, జూన్ 25(ఆంధ్రజ్యోతి):
జిల్లాకు సంబంధించి 194 మంది స్వర్ణ ఉద్యోగులను డిప్యుటేషన్ ప్రాతిపదికన వేరే విభాగాలకు పంపించాలని అధికారులు నిర్ణయించారు. కొత్తగా చేరనున్న విభాగాల్లో ఎలాంటి విధులు నిర్వహించాలి, అవసరమైన శిక్షణ తదితర అంశాలకు సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిలో 107 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులను (మహిళా పోలీసులు), 40 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, 13 మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, 16 మంది వీఆర్వోలు, 18 మంది వార్డు ఎమినిటీ కార్యదర్శులు కలిపి మొత్తం 194 మందిని డిప్యుటేషన్ ప్రాతిపదికపై వేరే విభాగాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా పోలీసుల్లో సెర్ప్(వెలుగు) విభాగానికి నలుగురు, బీసీ సంక్షేమశాఖకు నలుగురు, హోమ్ డిపార్ట్‌మెంట్‌కు 62, మెప్మా విభాగానికి ఆరుగురు, ఐసీడీఎస్‌కు 31 మందిని మొత్తం 107 మందిని కేటాయిస్తూ జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణవార్డు శాఖాధికారి రోజారాణి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంజినీరింగ్ అసిస్టెంట్లలో కాలుష్య నియంత్రణ మండలికి ఒకరు, ఎంఎస్‌ఐడీసీ విభాగానికి నలుగురు, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ విభాగానికి ముగ్గురు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్‌కు 16 మంది, ఆర్‌అండ్‌బి శాఖకు నలుగురు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఆరుగురు, సర్వశిక్ష విభాగానికి ఆరుగురు మొత్తం 40 మందిని కేటాయించారు. 13 మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులను మున్సిపల్ పరిపాలనా శాఖకు కేటాయించారు. వీఆర్వోలలో బీసీ సంక్షేమశాఖకు 8 మందిని, ఏపీ ఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్ విభాగానికి 8 మందిని పంపుతున్నారు. 18 మంది వార్డు ఎమినిటీ కార్యదర్శులను కూడా మున్సిపల్ పరిపాలనా పట్టణ అభివృద్ధి శాఖకు పంపాలని నిర్ణయించారు. అన్ని విభాగాలకు సంబంధించి విజయనగరం జిల్లాలో 194 మందిని ప్రస్తుతానికి ఎంపిక చేశారు. వేరే విభాగాలకు పంపించి వారితో ఆ విభాగాలకు చెందిన విధులను నిర్వర్తింపచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డిప్యుటేషన్‌కు కేటాయించిన ఉద్యోగులను త్వరితగతిన రిలీవ్ చేసేందుకు స్థానిక అధికారులు చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో జిల్లా అధికారి పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయాల ఉద్యోగుల నియామకాలు అనాలోచితంగా జరిగాయని, అవసరానికి మించి నియామకాలు చేపట్టారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు, నిపుణుల సలహాలు తీసుకొన్న కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను ప్రక్షాళన చేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. వారి సేవలను అర్హతలకు అనుగుణంగా వేరే విభాగాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలకు అవకాశం సన్నగిల్లుతుందనే ఆందోళన నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. ఒకపక్క సచివాలయాలు, మరోపక్క ఇతర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వీరితో సర్దుబాటు చేయడం ద్వారా రెండు విధాలా నిరుద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.