వాయు‘గండం’
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:54 PM
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తరాంధ్ర తీరం వైపు దూసుకొస్తోంది.
- జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు
- 585 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
- మరో మూడు రోజులు భారీ వర్షసూచన
- జిల్లా యంత్రాంగం అప్రమత్తం
- అన్ని శాఖలను అలెర్ట్ చేసిన కలెక్టర్
- నేడు విద్యాసంస్థలకు సెలవు
- ప్రాజెక్టులకు జలకళ
పార్వతీపురం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తరాంధ్ర తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి నుంచే చిరుజల్లులు మొదలయ్యాయి. మంగళవారం అంతా వర్షం పడుతూనే ఉంది. కాగా బుధ, గురు, శుక్రవారాల్లో వర్షతీవ్రత అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలతో పాటు గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, గెడ్డలు, చెరువులు, వరదముంపు పాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఎలాంటి ప్రాణ, పశు, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు వాగులు, చెరువులు దాటకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఈ మూడు రోజులు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించాలన్నారు. బలహీన భవనాలు, ప్రమాదకర నిర్మాణాలు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను ముందుగానే గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
కంట్రోల్ రూం ఏర్పాటు..
కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ను 08963450347 నెంబర్‌తో ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఆర్డీవో, మున్సిపల్, మండల కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, జిల్లా కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నా, రాకపోకలకు అంతరాయం ఏర్పడినా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైన చోట్ల ఎక్స్‌కవేటర్లు, ఇతర యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వైద్య, పారిశుధ్య శాఖలు సమన్వయంతో పనిచేసి అత్యవసర మందులు, పాముకాటు మందులు, వైద్య సామగ్రిని సిద్ధంగా ఉంచాలని అన్నారు. మత్స్యకారులు సము ద్రంలోకి వెళ్లకుండా అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారుల పడవల వివరాలు సేకరించాలని అన్నారు. ఈ సమావేశంలో జేసీ ఆర్.వైశాలి, డీఆర్వో హేమలత, పీవో పవర్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీవో మాధురి తదితరులు పాల్గొన్నారు.
నేడు పాఠశాలలకు సెలవు
పార్వతీపురం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):తుఫాన్ నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా బుధవారం అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు పరిహార సెలవు ప్రకటించినట్టు డీఈవో బ్రహ్మాజీ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఉత్తర్వులను అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 585 మిల్లీమీటర్ల వర్షపాతం..
జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి 7 గంటల వరకు 585.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాచిపెంట మండలంలో అత్యధికంగా 61.2 మి.మీ, కురుపాం మండలంలో 24.2మి.మీ వర్షపాతం నమోదైంది. పాలకొండ మండలంలో 39.2 మి.మీ, సీతంపేట 30.6, భామిని 27.6, గుమ్మలక్ష్మీపురం 24.8, జియ్యమ్మవలస 32.4, వీరఘట్టం 57.6, పార్వతీపురం 36.8, గరుగుబిల్లి 47.6, కొమరాడ 30, మక్కువ 37.4, సీతానగరం 31.2, సాలూరులో 45.4, బలిజిపేట మండలంలో 59.2 మి.మీ వర్షం కురిసింది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సంధ్యారాణి
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒక ప్రకటనలో జిల్లా అధికారులను ఆదేశించారు. వర్షంతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు తుఫాన్‌పై సమాచారాన్ని అందించాలన్నారు. ప్రజలు చెట్లు, శిథిల భవనాల కింద నిలబడి ఉండవద్దన్నారు రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, వాగులు, వంకలు దాటుతూ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు దాటాల్సిన పరిస్థితి ఉంటే ఆ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని మంత్రి ఆదేశించారు.
ప్రాజెక్టులకు జలకళ
వాయుగుండం ప్రభావంతో జిల్లాతో పాటు ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. తోటపల్లి ప్రాజెక్టులో ఎఫ్‌ఆర్‌ఎల్ 105 మీటర్లకు గాను, ప్రస్తుతం 104.30 మీటర్లు నీటి నిల్వలు ఉన్నాయి. పెద్దగెడ్డ జలాశయంలో 213.8 మీటర్లకు గాను 206.46 మీటర్ల నీరు ఉంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు 200 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఒట్టిగెడ్డ ప్రాజెక్టులో ఎఫ్‌ఆర్‌ఎల్ 399.5 అడుగులకు గాను ప్రస్తుతం 388 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి.
పంటలకు ఊపిరి
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరి పంటకు ఊపిరిపోసినట్లు అయింది. ఎల్‌నినో కారణంగా జిల్లాలో సరైన వర్షాలు పడలేదు. ప్రతినెలా లోటు వర్షపాతం నెలకొనేది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌పై ప్రభావం చూపాయి. ఈ ఏడాది వరి సాగు సగానికి తగ్గిపోయింది. ఈ నెలలో మొదటి మూడు వారాలు చినుకు జాడ లేదు. ఇప్పుడు వాయుగుండం ప్రభావంతో వర్షాలు పడుతుండడంతో పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు గండి
పాలకొండ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి పాత ఎడమ ప్రధాన కాలువకు ఓని గ్రామం వద్ద భారీ గండి పడింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కాలువలో అధిక నీరు చేరింది. దీంతో ఓని గెడ్డపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆక్వాడెక్ట్‌కు ఆనుకొని ఉన్న కాలువ మట్టికట్ట కోతకు గురైంది. సుమారు 30 నుంచి 40 అడుగుల లోతులో కాలువకు గండి పడింది. ఇప్పటికే తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ద్వారా శివారు గ్రామాలైన ఓని, సింగన్నవలస, పరశురాంపురం, వెలగవాడ, పాలకొండ, వడమ, ఎన్‌కేరాజపురం తదితర గ్రామాల్లో వందలాది ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. ఇప్పుడు పడిన గండితో ఆయా గ్రామాలకు పూర్తిగా సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన కాలువ గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నారు.