Depreciation in ration rice రేషన్ బియ్యంలో తరుగు
ABN , Publish Date - Apr 16 , 2026 | 01:27 AM
Depreciation in ration rice బియ్యం తరుగు లేకుండా చూడండి అంటూ ప్రతినెలా జిల్లాలోని ఏదో మండలంలో డీలర్లు వినతిపత్రం అందిస్తూనే ఉన్నారు. కొన్ని మండలాల్లో అయితే బస్తా వద్ద ఏకంగా 5 నుంచి 6 కిలోల వరకూ తరుగు వస్తోందని వాపోతున్నారు.
రేషన్ బియ్యంలో తరుగు
బస్తా వద్ద 2 నుంచి 5 కిలోల వ్యత్యాసం
ప్రతినెలా డీలర్ల ఫిర్యాదులు
పరిష్కారిస్తామని చెబుతున్న అధికారులు
కానీ సమస్య యథాతథం
రేషన్ సరఫరాపై తీవ్ర ప్రభావం
రాజాం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి):
బియ్యం తరుగు లేకుండా చూడండి అంటూ ప్రతినెలా జిల్లాలోని ఏదో మండలంలో డీలర్లు వినతిపత్రం అందిస్తూనే ఉన్నారు. కొన్ని మండలాల్లో అయితే బస్తా వద్ద ఏకంగా 5 నుంచి 6 కిలోల వరకూ తరుగు వస్తోందని వాపోతున్నారు. కానీ అధికారులు చేస్తాం.. చూస్తామంటున్నారే తప్ప ఈ సమస్యకు పరిష్కారం చూపడం లేదు. అసలు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వస్తున్న బియ్యంలో వ్యత్యాసం కనిపిస్తుందో? లేక గోదాముల వద్ద గోల్‌మాల్ జరుగుతుందో? తెలియదు కానీ.. ప్రతీ 50 కిలోల బస్తా వద్ద మాత్రం 2 నుంచి 3 కిలోల బియ్యం తరుగు వస్తోందని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు.
గోనెసంచి బరువు 580 గ్రాముల వరకూ ఉంటుంది. ఈ తరుణంలో అదనంగా అరకిలో బియ్యం ఇవ్వాల్సింది పోయి.. రెండు కిలోల బియ్యం తగ్గించి ఇస్తున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతినెలా చివరి వారంలో రేషన్‌కు సంబంధించి డీడీలు తీస్తారు. కానీ తరుగు సమస్య తేల్చనిదే ఈ నెల రేషన్ ఇవ్వలేమని డీలర్లు తెగేసి చెబుతున్నారు. జిల్లాలో కొన్ని ఎంఎల్‌ఎస్ గోదాముల నుంచి రేషన్ డిపోలకు వస్తున్న బస్తాల్లో 2 నుంచి 3 కిలోల తరుగు వస్తోంది. సాధారణంగా 50 కిలోలు చొప్పున బస్తాల్లో బియ్యం సరఫరా ఉంటుంది. గన్నీ సంచి బరువు 580 గ్రాములు. బియ్యం బరువు 49.420 కిలోలు ఉండాలి. మొత్తం 50 కిలోలు తూకం వేసి రేషన్ డిపోలకు పంపిస్తుంటారు. అయితే కొన్ని డిపోల నుంచి వచ్చే బరువు కేవలం 47 కిలోలు మాత్రమే ఉంటున్నాయి. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో క్వింటాళ్ల లెక్క తూకం వేయడంతో సంచుల్లో కోత వస్తోంది. దాదాపు అన్ని గోదాముల్లోనూ ఇదే పరిస్థితి. అయితే ఈ బియ్యం తరుగు ప్రభావం లేకుండా చూసుకునేందుకు కొందరు డీలర్లు వినియోగదారులకు తక్కువగా తూస్తున్నారు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. కొన్ని మండలాల్లో డీలర్లు ఫిర్యాదుచేస్తుండడంతో అధికారులు విచారణ చేపడుతున్నారు. గోదాముల వద్ద సిబ్బంది చేతవాటాన్ని గుర్తిస్తున్నారు.
జిల్లాలో 5.81 లక్షల మంది కార్డుదారులున్నారు. 9,159 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు కేటాయిస్తోంది. ఇందులో అంత్యోదయ అన్నయోజన కార్డులు 37,687 ఉన్నాయి. వీరికి 35 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. వీరికి 1319.5 టన్నుల బియ్యం అందుతోంది. 50 కిలోల వద్ద మూడు కిలోల వరకూ తరుగు వస్తుంటే ఏ స్థాయిలో పక్కదారి పడుతోందో అర్థం చేసుకోవచ్చు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద ఈ పరిస్థితి ఉంటే అసలు ఇలా తరుగు తీసిన బియ్యాన్ని ఏం చేస్తున్నారనేది మరోప్రశ్న.
ఫ గత ఏడాది వేసవిలో విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో రెండు రైస్‌మిల్లులను అక్కడి అధికారులు ఆకస్మికంగా పరిశీలించారు. 82.4 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అవి విజయనగరం పౌరసరఫరా గోదాముల నుంచి వచ్చిన సరుకుగా నిర్థారించారు. బియ్యం సంచులపై ఉన్న లేబుళ్ల బట్టి ఈ నిర్థారణకు వచ్చారు. అయితే గోదాముల నుంచి వచ్చిన బస్తాల సీల్ విప్పకుండానే తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. అంటే ఇదంతా ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద నుంచి తరలుతున్న బియ్యంగా తెలుస్తోంది. దీనిని బట్టి ప్రతి నెలా ఏ స్థాయిలో బియ్యం పక్కదారి పడుతుందో అర్థమవుతోంది.
ఫిర్యాదులు వస్తున్నాయి
బియ్యంలో తరుగు వస్తున్నట్టు రేషన్ డీలర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఎల్‌ఎస్ గోదాములపై నిఘా పెట్టాం. బియ్యంలో తరుగు వస్తే ఊరుకునేది లేదు. ఒక వేళ ఎఫ్‌సీఐ గోదాముల నుంచి వస్తే తిప్పి పంపిస్తాం. ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తాం. రేషన్ బియ్యం పక్కదారి పట్టించడం నేరం. ఈ విషయంలో కఠినంగా ఉంటాం. కేసులు నమోదు చేస్తాం.
- మధుసూదనరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి, విజయనగరం
---------------------