Share News

Depleting Water Levels అడుగంటుతున్న జలం

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:50 PM

Depleting Water Levels వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌) జలాశయంలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ప్రాజెక్టులో 1.405 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.606 టీఎంసీలే ఉన్నాయి. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవేమోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Depleting Water Levels అడుగంటుతున్న జలం
వెంగళరాయసాగర్‌లో నీటినిల్వలు ఇలా..

  • ఆందోళనలో మూడు మండలాల రైతులు

  • ఖరీఫ్‌ సాగుకు ఇబ్బందులు తప్పవా?

మక్కువ రూరల్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌) జలాశయంలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ప్రాజెక్టులో 1.405 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.606 టీఎంసీలే ఉన్నాయి. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవేమోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా వీఆర్‌ఎస్‌ ద్వారా ఏటా మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాల్లో 24,700 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే ఎండల తీవ్రతతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి నీరు రాకపోవడంతో జలాశయం ఇంకిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జైకా నిధులతో ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉన్నందున రబీ సీజన్‌లో పంటలకు సాగునీరు సరఫరా చేయలేదు. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్‌లో పై ప్రాంతం నుంచి ప్రాజెక్టులో చేరిన నీటిని నదులలోకి విడిచిపెట్టేశారు. అప్పట్లో ఇన్‌ఫ్లో విడిచిపెట్టకుండా ఉంటే.. ప్రస్తుతం జలాశయం అడుగంటి పోయే పరిస్థితి ఉండేది కాదని రైతులు చెబుతున్నారు. చెరువులకు నీటిని విడుదల చేయడానికి కూడా వీఆర్‌ఎస్‌లో జలాలు లేకపోవడంతో పరిసర ప్రాంత గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. పంటల సంగతి పక్కన పెడితే మూగజీవాలకు కూడా నీరందించలేని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఆధునికీకరణ పూర్తవ్వలేదు సరికదా... మరోవైపు నీటి నిల్వలు కూడా లేకపోవడంపై మూడు మండలాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఖరీఫ్‌ సాగుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. దీనిపై వీఆర్‌ఎస్‌ డీఈ సురేష్‌ను వివరణ కోరగా.. ప్రాజెక్టులో 161 మీటర్లకు గాను ప్రస్తుతం 155 మీటర్ల వరకే నీటి నిల్వలు ఉన్నాయి. ఎండలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో భారీగా తగ్గింది. రానున్న ఖరీఫ్‌లోగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వీఆర్‌ఎస్‌లో నీటి నిల్వలు మళ్లీ పెరుగుతాయి. దీంతో పంటలకు ఢోకా ఉండదు. తాగునీటి ఇబ్బందలూ ఉండవు. రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవరసరం లేదు.’ అని తెలిపారు.

Updated Date - Apr 11 , 2026 | 11:50 PM