ఉపాధ్యాయులపై డీఈవో సీరియస్
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:28 AM
పట్టణలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను గురువారం డీఈవో మాణిక్యం నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రెండు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ
బొబ్బిలి, నవం బరు 19 (ఆంధ్రజ్యోతి): పట్టణలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను గురువారం డీఈవో మాణిక్యం నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాల్లో నాణ్యత కొరవడటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై సీరియస్ అయ్యారు. విద్యార్థులు వెనుకబాటతనానికి గల కారణాలేమిటన్న దానిపై ఉపాధ్యాయుల నుంచి విడివిడిగా లిఖితపూర్వక వివరణ కోరారు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు రాతపనిని అప్పగించాలన్నారు వారిలో అభ్యసనాసక్తిని పెంపొందించాలన్నారు. గోడలపై సబ్జక్టులకు సంబంధించిన వాల్ పెయింట్స్ ఏర్పాటు చేయించాలన్నారు. రోజూ ఉదయ, సాయంత్రం వేళల్లో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. 15 రోజుల తర్వాత మళ్లీ విద్యార్థుల్లో ప్రగతిని పరిశీలిస్తానన్నారు. వారిలో విద్యాప్రమాణాలు కచ్చితంగా మెరుగు పడాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఉపాధ్యాయులను డీఈవో హెచ్చరించారు. ఆయన వెంట సీఈ బోర్డు సెక్రటరీ సన్యాసిరాజు, ఎంఈవో-2 గొట్టాపు వాసు ఉన్నారు.