Dengue Scare డెంగ్యూ కలకలం
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:59 PM
Dengue Scare జిల్లాలో ఇప్పటికే మలేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా గ్రామాల్లో జనం మంచాన పడ్డారు. ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సీతంపేట ఆసుపత్రి ఐపీవో రెండొందలు దాటుతోంది. బెడ్లు చాలక ఇద్దరు చొప్పున చికిత్స తీసుకోవాల్సి వస్తోంది
క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసిన వైద్యాధికారులు
విజయనగరం ఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స
ఇప్పటికే ఏజెన్సీలో మలేరియా కేసుల విజృంభణ
ముగ్గురు విద్యార్థుల మృతితో సర్వత్రా ఆందోళన
సాలూరు, జూలై1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటికే మలేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా గ్రామాల్లో జనం మంచాన పడ్డారు. ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సీతంపేట ఆసుపత్రి ఐపీవో రెండొందలు దాటుతోంది. బెడ్లు చాలక ఇద్దరు చొప్పున చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవల కురుపాం సీహెచ్‌సీ ఎక్స్‌రే యూనిట్‌లో బెడ్లు వేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డెంగ్యూ కేసులు కనిపించడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు ప్రబలుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్న విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ముఖ్యంగా ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.
సాలూరు పట్టణంలో డెంగ్యూ కలకలం రేగింది. ఒకే రోజు ఇద్దరిలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి సుస్మితా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మెంటాడ వీధికి చెంధిన మామిడి రామారావు లారీ కార్మికుడుగా పని చేస్తున్నాడు. అయితే కొద్దిరోజుల కిందట నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందినా ప్రయోజనం లేకపోయింది. జ్వరం తగ్గకపోవడంతో సాలూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో ఉండాలని సూచించారు. అయినా మాట వినకుండా ఇంటికి చేరుకున్నాడు. రెండు రోజుల తర్వాత జ్వరం మరింత ఎక్కువవడంతో విజయనగరం మహారాజా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించి ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సాలూరు పట్టణంలోని నాలుగేళ్ల బాలిక పి.ప్రియాంక డెంగ్యూ వ్యాధి లక్షణాలతోనే మహారాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే బాలిక పట్టణానికి చెందినట్టు అంగన్‌వాడీ రికార్డులలో ఎక్కడా లేదని వైద్యులు తెలిపారు. మరొవైపు దిగువ స్థాయి సిబ్బందిని వైద్యాధికారులు అప్రమత్తం చేశారు. మున్సిపల్ అధికారులు కూడా మెంటాడ వీధిలో పారిశుధ్య పనులతోపాటు దోమల నియంత్రణ చర్యలు చేపట్టారు.
వ్యాధుల విజృంభణ
జిల్లాలో వ్యాధుల విజృంభణ ప్రజలను కలవరపరుస్తోంది. ఇప్పటికే మలేరియా చాపకింద నీరులా ప్రబలుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంతోమంది విష జ్వరాలతో మంచం పడుతున్నారు. ఒళ్లు నొప్పులు, జ్వరాలతో ఇంకొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ సీజనల్ వ్యాధులతో వణుకుతున్నారు. మలేరియా కారణంగా ఇప్పటికే జొనగ జగ్గడుగూడకి చెందిన సవర దివాకర్ , నౌగూడకు చెందిన సవర పూర్ణచంద్ర, గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుకళ్లుకు చెందిన పాలక జస్టిన్ అనే ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. తాజాగా జిల్లాలో రెండు డెంగ్యూ కేసులు నమోదు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తేవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
నిరంతరం వైద్య శిబిరాల తనిఖీ: కలెక్టర్
పార్వతీపురం, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సమస్యాత్మక, హైరిస్క్ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాలం నేపఽథ్యంలో జిల్లాలో సీజనల్ జ్వరాలు ప్రబలకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నామన్నారు. కాగా క్షేత్ర స్థాయిలో ఈ వైద్య సేవల పర్యవేక్షణ బాధ్యతలను డివిజనల్ అధికా రులకు అప్పగించామన్నారు. పార్వతీపురం మండలానికి డీఏవో టి.భవానీ శంకర్, బలిజిపేటకు ఆర్డీవో మాధురి, సీతానగరానికి డీఏహెచ్‌వో దీన కుమార్, సాలూరుకు డీసీవో ఎం.వాణిశైలజ, పాచిపెంటకు డీహెచ్‌వో కె.సత్యనారాయణరెడ్డి, మక్కువకు కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ ధర్మరాజులను నియమించామన్నారు. గుమ్మలక్ష్మీపురానికి ఐటీడీఏ ఏపీవో మురళీ, కురు పాం మండలానికి డీఎంవోఐవో రాధాకృష్ణ, జియ్యమ్మవలసకు డీఏటీఎంవో సల్మన్‌రాజు, గరుగుబిల్లికి ఏడీఏ రత్నకుమారి, కొమరాడకు గ్రౌండ్‌వాటర్ డీడీ రమణమూర్తి, పాలకొండకు మార్క్‌ఫెడ్ డీఎం వై.విమల, వీరఘట్టానికి నీటిపారుదలశాఖ ఈఈ ప్రదీప్, సీతంపేటకు జిల్లా మత్స్యశాఖాధికారి సంతోష్‌కుమార్, భామినికి సీతంపేట ఐటీడీఏ పీహెచ్‌వో గణేష్‌లను తనిఖీ అధికారులుగా నియమించామని వెల్లడించారు. కాగా వారంతా మెడికల్ క్యాంప్‌లను నిరంతరం తనిఖీ చేయనున్నారని పేర్కొన్నారు.