Share News

డీలిమిటేషన్‌.. సరికొత్త ఆశలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:59 PM

“Delimitation: New Hopes and Possibilities” లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ అమలు కోసం కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పడంతో మన్యం రాజకీయ నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. డీలిమిటేషన్‌ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభిస్తే... లోక్‌సభ స్థానాలు, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెరుగుతాయి. దీంతో జిల్లా రాజకీయ ముఖచిత్ర మారనుంది.

డీలిమిటేషన్‌.. సరికొత్త ఆశలు

  • పునర్విభజన జరిగితే మారనున్న మన్యం రూపురేఖలు

  • పెరగనున్న నియోజకవర్గాల సంఖ్య

  • మన్యంలో ప్రత్యేక ఎంపీ స్థానానికీ అవకాశం

  • రాజకీయ నేతల్లో జోష్‌

పార్వతీపురం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ అమలు కోసం కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పడంతో మన్యం రాజకీయ నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. డీలిమిటేషన్‌ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభిస్తే... లోక్‌సభ స్థానాలు, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెరుగుతాయి. దీంతో జిల్లా రాజకీయ ముఖచిత్ర మారనుంది. నియోజకవర్గ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మన్యంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, 15 మండలాలు ఉన్నాయి. సాలూరు, కురుపాం, పాలకొండ ఎస్టీ, పార్వతీపురం ఎస్సీ సామాజిక వర్గాలకు రిజర్వ్‌ అయ్యింది. ఇక భవిష్యత్‌లో పెరగనున్న రెండు నియోజక వర్గాలు బీసీలకు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

మండలాల విభజనపై చర్చ

- పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం పురపాలక సంఘంతో పాటు బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం మండలాలు ఉన్నాయి. పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గ పరిధిలో ఏయే మండలాలు బయటకు వెళతాయి, ఏవేవి కలుస్తాయన్నది? ఇప్పుడు చర్చనీ యాంశంగా మారింది.

- ప్రధానంగా బలిజిపేట, సీతానగరంతో పాటు కురుపాం నియోజకవర్గంలో ఉన్న గరుగుబిల్లి మండలం కలిసి ఒక నియోజకవర్గంగా ఏర్పడి అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణం, పార్వతీపురం మండలంతో పాటు కొమరాడ మండలం కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా బలిజిపేట మండలాన్ని కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలో విలీనం చేసే అవకాశం ఉందని సమచాచారం.

- పాలకొండ నియోజకవర్గంలో భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాలతో పాటు పాలకొండ నగర పంచాయతీ ఉంది. కాగా వీరఘట్టం, పాలకొండ నగర పంచాయతీ, పాలకొండ మండలం కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పడే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న ఒక మండలాన్ని సీతంపేట, భామిని మండలాలతో కలిపి మరో కొత్త నియోజకవర్గంగా ఏర్పడొచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు.

- సాలూరు నియోజకవర్గంలో సాలూరు పట్టణంతో పాటు విజయనగరం జిల్లా మెంటాడ , సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాలున్నాయి. అయితే మెంటాడ మండలాన్ని గజపతినగరం నియోజకవర్గంలో కలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే మక్కువ, పాచిపెంట, సాలూరు మండలాలతో పాటు సాలూరు పట్టణాన్ని ఒక నియోజకవర్గం పరిధిలోకి తెస్తారనే ప్రచారం జరుగుతోంది. మక్కువ మండలాన్ని పార్వతీపురం నియోజకవర్గంలో విలీనం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- కురుపాం నియోజకవర్గం పరిధిలో ఉన్న గరుగుబిల్లి మండలాన్ని కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలో విలీనం చేయకుంటే.. మక్కువ, సీతానగరం, బలిజిపేట మండలాలతో కొత్తగా పార్వతీపురం నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. . అదే జరిగితే గరుగుబిల్లి మండలం విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

మన్యానికి ప్రత్యేక పార్లమెంట్‌ స్థానం...

పార్వతీపురం పేరుతో గతంలో పార్లమెంట్‌ నియోజకవర్గం ఉండేది. గత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ పేరు లేకుండాపోయింది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న నాలుగు నియోజకవర్గాలు అరకు పార్లమెంట్‌లోకి వెళ్లిపోయాయి. కాగా ప్రస్తుతం జిల్లాను యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపడితే.. పెరిగే అసెంబ్లీ స్థానాలతో కలిపి పార్వతీపురం మన్యం జిల్లా ఒక పార్లమెంట్‌ స్థానంగా ఏర్పడే అవకాశం ఉంది. ఏదేమైనా పార్వతీపురానికి తిరిగి ఆ స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - Nov 28 , 2026 | 11:59 PM