Delay... Negligenceఆలస్యం.. నిర్లక్ష్యం
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:32 PM
Delay... Negligence సంపాదనపై సంతృప్తి లేక వివాహాన్ని వాయిదా వేయడం.. పెళ్లి అయిన జంట సంతానంపై కొన్నాళ్లు వేచి చూద్దామని నిర్ణయించుకోవడం.. ఆహారపు అలవాట్లు.. కాలుష్య ప్రభావం వెరసి ఫెర్టిలిటీ రేటుపై ప్రభావం పడుతోంది. జిల్లాలో 2.1 నుంచి 1.58 దిగిజారిపోవడాన్ని కలవరపరుస్తోంది.
ఆలస్యం.. నిర్లక్ష్యం
ముప్పై ఏళ్లు వచ్చినా పెళ్లి వాయిదా
వివాహం అయ్యాక కూడా వేచి చూద్దామన్న ధోరణి
పడిపోతున్న సంతానోత్పత్తి
ఆహారపు అలవాట్ల పట్ల నిర్లిప్తత
గత కొన్నేళ్లుగా జిల్లాలో మందగించిన జనాభా వృద్ధి
1.58కు పడిపోయిన ఫెర్టిలిటీ రేటు
జీవన శైలిలో మార్పులూ కారణమే
సంపాదనపై సంతృప్తి లేక వివాహాన్ని వాయిదా వేయడం.. పెళ్లి అయిన జంట సంతానంపై కొన్నాళ్లు వేచి చూద్దామని నిర్ణయించుకోవడం.. ఆహారపు అలవాట్లు.. కాలుష్య ప్రభావం వెరసి ఫెర్టిలిటీ రేటుపై ప్రభావం పడుతోంది. జిల్లాలో 2.1 నుంచి 1.58 దిగిజారిపోవడాన్ని కలవరపరుస్తోంది. గత కొన్నేళ్లుగా జిల్లాలో జనాభా వృద్ధి మందగిస్తోంది. సంతానోత్పత్తి పడిపోతోంది. దేశంలోని ఉత్తరాధి రాష్ట్రాల్లో సంతానోత్పత్తి కాస్త మెరుగ్గా ఉండగా దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి దిగజారిపోతోంది. మన జిల్లాలోనూ ఇదే స్థితి నెలకొంది. ప్రజల జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలో పెనుమార్పులు వస్తున్నాయి. ఆరోగ్యకరమైన భోజనం తీసుకుంటున్న వారు చాలా తక్కువగా ఉన్నారు. దీనివల్ల కూడా మహిళల్లో సంతానోత్పత్తి తగ్గుతున్నట్లు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు.
విజయనగరం కలెక్టరేట్/ రింగురోడ్డు, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి):
జనాభా పెంచాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిస్తున్నారు. ఒకరు ఇద్దరుతో కాకుండా ముగ్గురు నలుగురిని కనాలంటూ కోరుతున్నారు. పదేళ్ల కిందట ఒకరు చాలు అనేవారు. నిన్నటి వరకూ ఇద్దరైతేనే మేలు అనే ఆలోచనతో సమాజం నడిచింది. అయితే వాతావరణంలో వస్తున్న మార్పులు, జీవనశైలి సాగుతున్న తీరుతో సంతానోత్పత్తి రేటు అనూహ్యంగా పడిపోతోంది. జిల్లాలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు పెట్టింది పేరు. ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మానవ సంబంధాలు, జీవన శైలిలో వస్తున్న మార్పులు కూడా జనాభా పెరుగుదల మందగించడానికి కారణమవుతున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు నుంచి పది మంది వరకూ పిల్లలను కనడం సహజంగా ఉండేది. వారికి తాతయ్యలు, నాన్నామ్మలు, బాబాయిలు,పిన్నిలు ఇలా కుంటుంబమంతా అండగా ఉండేది. పిల్లల పెంపకం పెద్దలకు భారం అనే మాటే వినిపించేది కాదు. ఇంటి పనుల్లో ఆడప్లిల్లలు , పొలం పనుల్లో మగపిల్లలు చిన్నతనం నుంచే సాయం చేసేవారు. విద్యా, వైద్య ఖర్చులు పెద్ద సమస్యగా ఉండేవి కావు. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్ర్తీ,పురుషులు ఇద్దరు పూర్తిగా స్థిరపడిన తరువాత వివాహాలు చేసుకుందామని నిర్ణయించుకుంటున్నారు. అలాగే ఉద్యోగాల పేరిట ఇతర రాష్ట్రాలు, దేశాలు వెళ్లడం వంటి కారణాలు కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తున్నాయి.
- మహిళలు విద్య, ఉద్యోగాల్లో దూసుకుపోతున్నారు. కెరీర్ ఎదుగుదలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చివరికి పెళ్లి చేసుకున్నా పిల్లలు కనడం వాయిదా వేసుకుంటున్నారు. ఈ పరిణామం సంతానోత్పత్తిపై ప్రభావం పడుతోంది.
- నిత్యావసర ధరలు అదుపులో లేకపోతే కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ దారిద్య్ర రేఖకు దిగువకు వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కేవలం చట్టాలు, నిబంధనలు మార్చడం ద్వారా కాకుండా ఆర్థిక భరోసా కల్పించడం ద్వారానే సంతానాభివృద్ధి సాధ్యమవుతుంది. పెరిగిన ధరల నేపధ్యంలో భవిష్యత్తుపై ధీమా కల్పించకుండా జనాభా పెరగాలని కోరడం ఈశాస్ర్తీయమని కొందరు సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- గత కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది నవ దంపతులకు పిల్లలు పుట్టడంలో జాప్యం జరుగుతోంది. ప్రధానంగా కరోనా తరువాత సంతాన్పోత్పత్తి తగ్గింది. వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయినా పిల్లలు పుట్టడం లేదు. ఎక్కువగా ఫార్మసీ, స్టాఫ్ట్ వేర్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోంది. మరోవైపు సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల కూడా పిల్లలు పుట్టడం లేదన్న భావన ఉంది. గత ఐదు సంవత్సరాలుగా జిల్లాలో నమోదైన జననాలను పరిశీలిస్తే క్రమంగా పిల్లల పుట్టుక రేటు తగ్గుతూ వస్తోంది. మరోవైపు పేద కుటుంబాలకు చెందిన వారు ఎక్కువ మంది పిల్లలను కంటె పెంచే శక్తి ఉండదన్న భయంతో ఉన్నారు.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి.. ప్రైవేటులో దోపిడీ సామాన్యుడి నడ్డి విరుస్తోంది. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకూ ప్రైవేటు ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చు చూసి మధ్యతరగతి దంపతులు హడలిపోతున్నారు. చిన్నపాటి అనారోగ్యం సోకినా వేలల్లో బిల్లులు అవుతున్నాయి. పోషకాహారలోపం వేధిస్తున్న తరుణంలో సంతానం పెరిగితే వారి ఆరోగ్యం కాపాడటం తలకు మించిన భారమవుతోందని కూడా సామాన్య, మధ్యతరగతి వారు అభిప్రాయపడుతున్నారు.
గత మూడు సంవత్సరాల్లో జిల్లాలో జననాల రేటు
సంవత్సరం పుట్టిన పిల్లలు జననాల రేటు టీఎఫ్‌ఆర్
2023-24 24,635 13.53 1.72
2024-25 20,017 12.36 1.71
2025-26 17,881 11,29 1.58
=================
వివాహాలు ఆలస్యంతోనే..
జిల్లాలో కొన్నాళ్లుగా సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. గతంలో ముగ్గురు నుంచి నలుగురు పిల్లలు కనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అటువంటిది లేదు. ప్రధానంగా వివాహాలు ఆలస్యంగా జరగడం కూడా ఈ పరిస్థితికి కారణం. దీంతో పిల్లలు సకాలంలో పుట్టడం లేదు. అలాగే యువతలో జీవన శైలిమారింది. ఆహారపు అలవాట్లు గాడితప్పాయి. ఆహార పద్ధతులను మార్పుచేసుకోవడం చాలా అవసరం. ఫాస్ట్‌ఫుడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. లేదంటే భవిష్యత్‌లో చాలా ఇబ్బంది పడతారు.
జీవనరాణి, జిల్లా వైద్యాధికారి
-----------------------------