Share News

Defense projects are coming! రక్షణ ప్రాజెక్టులు వస్తున్నాయ్‌!

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:54 PM

Defense projects are coming! బాడంగి మండల కేంద్రంలో చిలకపాలెం-రాయగడ రాష్ర్టీయ రహదారిని ఆనుకుని నిరుపయోగంగా ఉన్న పురాతన విమానాశ్రయ స్థలంలో కొత్త రక్షణ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారా..? నేవల్‌ బేస్‌తో పాటు మరిన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థలను కొలువుదీర్చనున్నారా..? అవసరమైన భూములను సేకరించనున్నారా..? ఈ ప్రశ్నలకు రెవెన్యూ వర్గాలు అవుననే అంటున్నాయి.

Defense projects are coming! రక్షణ ప్రాజెక్టులు వస్తున్నాయ్‌!
ఒకప్పటి బాడంగి విమానాశ్రయ రన్‌వే

రక్షణ ప్రాజెక్టులు వస్తున్నాయ్‌!

బాడంగి ప్రాంతానికి కొత్త కేంద్ర సంస్థల రాక

భూములను గుర్తించే పనిలో అధికారులు

1796 ఎకరాలు అవసరమని ప్రాథమిక అంచనా

కొద్దిరోజుల్లో శ్రీకారం చుట్టే అవకాశం

బాడంగి మండల కేంద్రంలో చిలకపాలెం-రాయగడ రాష్ర్టీయ రహదారిని ఆనుకుని నిరుపయోగంగా ఉన్న పురాతన విమానాశ్రయ స్థలంలో కొత్త రక్షణ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారా..? నేవల్‌ బేస్‌తో పాటు మరిన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థలను కొలువుదీర్చనున్నారా..? అవసరమైన భూములను సేకరించనున్నారా..? ఈ ప్రశ్నలకు రెవెన్యూ వర్గాలు అవుననే అంటున్నాయి. ఇటీవల నేవల్‌ అధికారులతో పాటు స్థానిక అధికారులు ఆయా భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూమి ఎంత.. సేకరించాల్సింది ఎంత అన్న అంశాలపై కసరత్తు ప్రారంభించారు. దీనిపై కొద్దిరోజుల్లో స్పష్టత రానుంది.

బొబ్బిలి/బాడంగి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): బాడంగి ప్రాంతంలో రెండో ప్రపంచయుద్ధ కాలంలో సైనికులకోసం విమానాశ్రయాన్ని నిర్మించారు. యుద్ధం ముగిసిన తరువాత 1946లో విమానాశ్రయం మూతపడింది. ఇక అప్పటి నుంచి ఆ స్థలం నిరుపయోగంగా ఉండిపోయింది. విమానాశ్రయ రన్‌వేలో కొంతభాగం తప్ప మిగిలిన ఆనవాళ్లు ఏవీ కనిపించడం లేదు. గత ఏడాది ఇక్కడ నేవీ ఆయుధ డిపో(నేవల్‌ బేస్‌)ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తాజాగా పైలట్‌ శిక్షణ కేంద్రంతో పాటు మరికొన్ని సంస్థలు కొలువుదీర్చాలని భావిస్తున్నారు. యుద్ధ నౌకల నిర్మాణం, స్టోరేజ్‌ కేంద్రం, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది నియామకం, నేవీ షిప్‌ల స్టోరేజ్‌, ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌, నేవల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఆయుధ భాండాగారం) వంటి వాటికోసం భూములను సేకరించాలని రక్షణ విభాగం ఉన్నతాధికారులు కోరడంతో ఆ మేరకు కసరత్తును ప్రారంభించారు.

మారిన రూపురేఖలు

నాటి బాడంగి విమానాశ్రయ పరిధిలో ఎంతో పటిష్టమైన రాతిగోడలతో భవనాలుండేవి. వాటిని పాతికేళ్ల క్రితం వేలం ద్వారా ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మేశారు. ప్రస్తుత టీడీపీ కార్యాలయంగా వినియోగిస్తున్న భవనంతో పాటు బాడంగి సాంఘికసంక్షేమశాఖ గురుకుల పాఠశాల, పూర్వపు సమితి కార్యాలయ భవనాలున్న స్థలాలు విమానాశ్రయానికి చెందినవే. పాత భవనాలన్నింటినీ కూల్చివేసి నూతన భవనాలను నిర్మించారు. జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో కూడా కొన్ని భవంతులు ఉండేవి. అవన్నీ ఇప్పుడు లేవు. రన్‌వే కూడా చాలా వరకు ఆక్రమణలకు గురై ఉంది.

- విమానాశ్రయానికి 183 ఎకరాలుందని, 1796.079 ఎకరాలు అవసరమని బొబ్బిలి ఆర్డీవో జిల్లెల వెంకట సత్యసాయి రామ్మోహనరావు తెలిపారు. బాడంగి మండలంలో ముగడ, కోడూరు, రామచంద్రపురం, పూడివలస, పాల్తేరు, మల్లమ్మపేట గ్రామాలకు చెందిన భూములు కొత్త ప్రతిపాదనల్లో ఉన్నాయన్నారు. గ్రామాలేవీ పోవడం లేదని, వాటిని ఆనుకొని ప్రహరీ వచ్చే అవకాశముందన్నారు. భూముల విలువకు సంబంధించి నివేదిక ఇవ్వాలని జిల్లా రిజిస్ర్టార్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. నిధులు వస్తే గాని ఈ కార్యకలాపాలు ఏవీ చేపట్టలేమన్నారు. భూముల ధరల వివరాలు అందిన తరువాత అవసరమైన ప్రతిపాదనలను తయారు చేసి కేంద్రప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

- ప్రస్తుత విమానాశ్రయానికి 183 ఎకరాలుండగా ఇంకా అవసరమైన భూములను సేకరించాల్సి ఉంది. వీటిలో 112 ఎకరాల్లో నీటి వనరులు ఉన్నాయి. 58 ఎకరాల్లో ఇతర భూములతో పాటు డిపట్టా భూములు 59 ఎకరాలున్నాయి. మెట్టుభూములు 826 ఎకరాలు, పల్లపు భూములు 55 ఎకరాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. భూసేకరణ చట్టం సెక్షన్‌ 36 ప్రకారం భూముల విలువను నిర్ధారించి, నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు పంపించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.

పూర్వ కళ తెస్తే సంతోషమే: తెంటు కృష్ణంనాయుడు, ముగడ గ్రామం

బ్రిటీషు కాలం నాటి బాడంగి విమానాశ్రయానికి పూర్వకళ తీసుకొస్తే చాలా సంతోషం. ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు లభిస్తుంది. మా చిన్నప్పుడు విమానాల మోత, జవానుల కవాతు, పౌరుల సంచారంపై ఆంక్షలు వంటివి ఉండేవి. విమానాశ్రయానికి నాలుగుదిక్కులా ఉక్కుకవచం లాంటి భవనాలు, రక్షణ గోడలు ఉండేవి. స్విమ్మింగ్‌ పూల్స్‌, సినిమా హాలు ఉండేది. అప్పటి విమానాశ్రయం నేటి వరకు ఉండి ఉంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసికట్టుగా ఉండేదనడంలో సందేహం లేదు. నాటి భవంతులను వేలంలో అమ్మేశారు. మరికొన్ని పోయాయి. ఇప్పుడు మళ్లీ నేవీ వారు అక్కడ ఏవైనా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతానికి మహర్దశ కలుగుతుంది.

మా ఊళ్లు బాగుపడతాయ్‌: కొల్లి సింహాచలం, రామచంద్రపురం

బాడంగిలో విమానాశ్రయం ఉండేటప్పుడు ఇప్పుడు ఉండే రాజాం రోడ్డును మూసివేశారు. బాడంగి నుంచి పిన్నవలస, కోడూరు మీదుగా డైవర్షన్‌ రోడ్డు ఉండేది. విమానాలు నడిచే ప్రాంతమంతా చాలా కట్టుదిట్టమైన బందోబస్తుతో ఉండేది. ఈ చుట్టపక్కల గ్రామాలవారిని ఆ దరిదాపులకు రానిచ్చేవారు కాదు. ‘ టి‘ ఆకారంలో ఉండే విమానాశ్రయం రన్‌వే నాలుగువైపులా ఈతకొలనులు లాంటివి ఉండేవి. బ్రిటీషు అధికారులు అక్కడకు వచ్చినప్పుడు ముందుగా దండోరా వేసేవారు. అప్పుడు అందరమూ భయపడి ఇళ్లల్లో దాక్కునేవారం. విమానాల సందడి ఎక్కువగా ఉండేది. విమానాశ్రయాన్ని మళ్లీ డెవలప్‌ చేస్తే మా ఊళ్లు బాగుపడతాయి.

Updated Date - Sep 28 , 2026 | 11:54 PM