Deceived and Left నమ్మించి.. నట్టేట ముంచింది!
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:05 AM
Deceived and Left in the Lurch! ఓ ప్రైవేట్ సంస్థ తమను నమ్మించి నట్టేట ముంచిందని జిల్లాకు చెందిన కొంతమంది బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు
పార్వతీపురం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేట్ సంస్థ తమను నమ్మించి నట్టేట ముంచిందని జిల్లాకు చెందిన కొంతమంది బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. రూ.లక్ష ఇస్తే.. 500 రోజుల పాటు రోజుకు రూ.444 చొప్పున ఇస్తామని డిపాజిట్లు సేకరించి.. ఆపై బోర్డు తిప్పేసిన సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖలోని గాజువాక ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసి ఏజెంట్ల ద్వారా డిపాజిట్లు సేకరణ చేపట్టింది. కొన్నాళ్ల పాటు ఆన్‌లైన్‌లో డబ్బులు జమ చేసింది. అయితే ఏడాదిగా ఎటువంటి చెల్లింపులు చేయడం లేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లావాసులు కూడా సీతానగరం, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ. పది లక్షల వరకు డిపాజిట్ చేసినట్లు సమాచారం. సంస్థ చేతిలో మోసపోయిన వారిలో ఆటో డ్రైవర్, మాజీ సైనిక ఉద్యోగులు, పలువురు గ్రామీణ ప్రాంతవాసులు ఉన్నారు. బాధితలు ఫిర్యాదు మేరకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్ట కేంద్రీకరించినట్టు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.