Share News

మృత్యు పిడుగులు

ABN , Publish Date - May 06 , 2026 | 11:41 PM

మేఘం కమ్మిందా.. పిడుగు పడిందే అన్నట్టు వాతావరణం మారిపోయింది. పిడుగు పడాలంటే ఒకప్పుడు ముందు అతి భారీ వర్షం కురిసేది. వర్షం మొదలయ్యాక చాలా సేపటి వరకూ పిడుగు జాడ ఉండేది కాదు. నేడులా లేదు. మేఘాలు కనిపించిన మరుక్షణమే పిడుగులు పడుతున్నాయి.

మృత్యు పిడుగులు

  • వాతావరణంలో ప్రమాదకర మార్పులు

  • నెల వ్యవధిలో 8 మంది మృత్యువాత

  • నడి వేసవిలోనూ తప్పని విపత్తులు

  • ముందు జాగ్రత్తలే శరణ్యం

- ఈ నెల 6న జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం పాలయ్యారు. రాజాం మండలం గెడ్డవలసకు చెందిన మజ్జి సత్తెమ్మ, అప్పలనరసమ్మ, పైల రాము అనే ముగ్గురు మహిళలు పంటపొలంలో ఉండగా పిడుగు పడి ప్రాణాలు కోల్పోయారు. తెర్లాం మండల కేంద్రంలో జమ్ముల సూర్యనారాయణ అనే ఉపాధి వేతనదారుడు పిడుగు పాటుతో చనిపోయాడు.

- ఏప్రిల్‌ 10న లక్కవరపుకోట మండలం రేగ గ్రామంలో పిడుగుపడి బసవబోని చరణ్‌ అనే 13 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. చెరువులో బహిర్భూమికి స్నేహితులతో వెళ్లగా ఒక్కసారిగా పిడుగుపడి చనిపోయాడు.


- ఏప్రిల్‌ 7న వంగరకు చెందిన ఇనుమల నరసమ్మ పిడుగుపాటుకు మృతిచెందింది. పొలం పనులు చేస్తుండగా పిడుగుపడడంతో మృత్యువాతపడింది.

- ఏప్రిల్‌ 7న బలిజిపేట మండలం శ్రీరంగరాజపురానికి చెందిన డొప్ప సింహాచలం, వంతరాం గ్రామానికి చెందిన వాండ్రాసి పార్వతి పిడుగుపాటుతో మృతిచెందారు. పొలం పనుల్లో ఉండగా ఈ ఘటన జరిగింది.

మేఘం కమ్మిందా.. పిడుగు పడిందే అన్నట్టు వాతావరణం మారిపోయింది. పిడుగు పడాలంటే ఒకప్పుడు ముందు అతి భారీ వర్షం కురిసేది. వర్షం మొదలయ్యాక చాలా సేపటి వరకూ పిడుగు జాడ ఉండేది కాదు. నేడులా లేదు. మేఘాలు కనిపించిన మరుక్షణమే పిడుగులు పడుతున్నాయి. వాతావరణంలో వచ్చిన ప్రమాదకరమైన మార్పులతో పాపం సామాన్యులు, పేద మహిళలు, పిల్లలు బలి అవుతున్నారు. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో చనిపోయిన ఎనిమిది మంది ఇటువంటివారే. నడి వేసవిలో దాపురిస్తున్న ఈ విపత్తులను ముందు జాగ్రత్తలతోనే ఎదుర్కోగలమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.


విజయనగరం, మే 6(ఆంధ్రజ్యోతి): మేఘాలు కమ్మి.. చిరు జల్లులు పడుతున్నా కొందరు చూద్దాంలే అన్న ధోరణిలో ఉంటున్నారు. వర్షం మొదలైతే కాని భవనాల కిందకు వెళ్లడం లేదు. ఈ ఆలోచనే ప్రాణాపాయానికి దారితీస్తోంది. కారు మబ్బులు కమ్మినప్పుడే అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అపాయం పొంచి ఉంటోంది. పిడుగు పాటుకు మృతిచెందిన వారందరి పరిస్థితి దాదాపు ఇంతే. వాతావరణంలో మార్పు వచ్చిన వెంటనే అప్రమత్తం కాకుంటే ప్రమాదమని వాతావరణ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. జిల్లాలో నెలరోజుల వ్యవధిలో పిడుగుపాటుకు 8 మంది మృత్యువాత పడ్డారు. వర్షాకాలం ప్రారంభం కాలేదు. నడి వేసవిలో పిడుగులు బడుగులపై ప్రతాపం చూపుతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో పిడుగులు పడతాయి. ఇప్పుడు అన్ని కాలాల్లోనూ భయపెడుతున్నాయి. అయితే పిడుగులకు ఎక్కువగా రైతులు, కూలీలు, పశువుల పెంపకందారులు బలి అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.


పనుల్లో ఉండగా..

జిల్లా వ్యవసాయాధారితం. ఈ సమయంలో నీటి సదుపాయం ఉన్నచోట అపరాలు, కూరగాయలను సాగు చేస్తుంటారు. మరోవైపు ఖరీఫ్‌కు పొలాలను సన్నద్ధం చేస్తుంటారు. అందుకే రైతులు, రైతు కూలీలు ఎక్కువగా పొలాల్లో ఉంటున్నారు. ఈ సమయంలోనే పిడుగులు పడుతుండడంతో వారు మూల్యం చెల్లించుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో 777 పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో పిడుగులతో కూడిన వానతో వేతనదారులు అపాయంలో పడుతున్నారు. జాగ్రత్తలే శరణ్యమని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మేఘాలు కనిపించిన మరుక్షణమే సమీపంలోని భవనాల్లోకి వెళ్లి తలదాచుకోవాలని చెబుతున్నారు. చెట్ల కింద కాని పంట పొలాల్లో కాని ఉండకూడదని సూచిస్తున్నారు.


హెచ్చరిక మెసేజ్‌లను గమనించండి - చందక సత్తిబాబు, డీఆర్‌వో

ముఖ్యంగా ఉరుములతో కూడిన వర్షం పడినప్పుడు వీలైనంత వరకూ ఇళ్లల్లోనే ఉండాలి. బయటకు రాకూడదు. పొలాల్లో పనిచేస్తున్నవారు వర్షం పడే ముందు వాతావరణాన్ని గమనించి త్వరితగతిన ఇంటికి చేరుకోవాలి. చెట్లు, విద్యుత్‌ స్తంభాల వద్ద ఉండకూడదు. వర్షాలు పడే సందర్భంలో ప్రతి ఒక్కరి ఫోన్లకు హెచ్చరిక మేసేజ్‌లు వస్తున్నాయి. వాటిని పాటించాలి. అప్రమత్తంతోనే పిడుగుల నుంచి తప్పించుకోగలం.

Updated Date - May 07 , 2026 | 07:05 AM