Share News

Dealers డీలర్ల నియామకాలకు కసరత్తు

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:51 PM

Dealers Recruitment Underway జిల్లాలోని చౌక ధరల దుకాణాల డీలర్ల నియామ కాలకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఎంపికైన వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

Dealers   డీలర్ల నియామకాలకు కసరత్తు

గరుగుబిల్లి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని చౌక ధరల దుకాణాల డీలర్ల నియామ కాలకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఎంపికైన వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పార్వతీపురం డివిజన్‌ పరిధి సీతానగరం, సాలూరు, పార్వతీపురం, పాచిపెంట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, బలిజిపేట మండలాలకు 36మంది, పాలకొండ డివిజన్‌లో భామిని, జియ్యమ్మవలస, కురుపాం, పాలకొండ, వీరఘట్టం మండలాలకు 21 మంది గతంలో నిర్వహించిన మౌఖిక పరీక్షల్లో అర్హత సాధించారు. అయితే పలు కారణాలతో నియామక పత్రాలు అందించలేదు. ఏదేమైనా 20 నెలల తర్వాత కదలిక రావడంతో డీలర్లుగా ఎంపికైన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో ఖాళీ అయిన డీలర్ల పోస్టులకు 2024, డిసెంబరు 9న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. డిసెంబరు 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 21న హాల్‌ టిక్కెట్లు జారీ చేశారు. 23న రాత పరీక్ష నిర్వహించారు. 26న పరీక్షా ఫలితాలు ప్రకటించారు. 28న మౌఖిక పరీక్ష నిర్వహించిన తర్వాత 30న తుది ఫలితాలు వెల్లడించారు. మొత్తంగా 56 చౌక ధరల దుకాణాలకు సంబంధించి అర్హత పొందిన వారి జాబితాను గతేడాది జనవరి 10న ప్రకటించారు. సంబంధిత మండలాల తహసీల్దార్లకు ఆ జాబితాలను అందించారు. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి నివేదికలు అందించాలని సబ్‌ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ లోపుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడంతో నియామక పత్రాలు అందించలేదు. ఇదిలా ఉండగా విజయ నగరం జిల్లాలో మాత్రం పలువురికి నియామక పత్రాలు అందించారు.దీంతో పార్వతీపురం, పాల కొండ డివిజన్లకు చెందిన వారు నియామక పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే కొద్ది రోజుల కిందట ఎంపికైన వారి సమచార సేకరణలో అధికారులు నిమగ్న మయ్యారు. కొద్ది రోజుల్లో నియామక పత్రాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. చౌక ధరల దుకాణానికి సంబంధించి స్వీయ డిక్లరేషన్‌, ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌తో పాటు పోలీస్‌ కేసులు, న్యాయస్థానాల పరిధిలో శిక్షలు, తదితర సమాచారాన్ని సేకరించే పనిలో అధికా రులు ఉన్నారు. మరోవైపు డీలర్లుగా ఎంపికైన అభ్యర్థులు మండలాల పరిధిలోని పోలీస్‌స్టేషన్ల నుంచి క్యారెక్టర్‌ సర్టిఫికెట్లు పొంది సబ్‌ కలెక్టరేట్‌కు ఇచ్చారు. దీనిపై సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం డీటీ జి.శ్రీనివాసరావును వివరణ కోరగా.. గతంలో రేషన్‌ డీలర్లుగా ఎంపికైన వారికి రెండు, మూడు రోజుల్లో నియామక పత్రాలు అందించనున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 03 , 2026 | 11:51 PM