Share News

Yet Works Remain Incomplete! గడువు పెంచుతున్నా.. పనులు పూర్తి కావట్లే!

ABN , Publish Date - May 11 , 2026 | 12:22 AM

Deadlines Extended… Yet Works Remain Incomplete! జిల్లాలో ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న రహదారుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. గడువు పెంచినా జోరందుకోవడం లేదు.. చాలాచోట్ల నిర్మాణాల్లో నాణ్యత లోపాలు దర్శనమిస్తున్నాయి.

  Yet Works Remain Incomplete!  గడువు పెంచుతున్నా.. పనులు పూర్తి కావట్లే!
మరుపెంట నుంచి సాంబన్నవలసకు వెళ్లే బీటీ రహదారి ఇలా..

  • పనుల్లో నాణ్యతా లోపాలు

  • బిల్లుల చెల్లింపుల్లోనూ జాప్యం

గరుగుబిల్లి, మే10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న రహదారుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. గడువు పెంచినా జోరందుకోవడం లేదు.. చాలాచోట్ల నిర్మాణాల్లో నాణ్యత లోపాలు దర్శనమిస్తున్నాయి. దీంతో పనుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మార్చి 10లోపు పూర్తయిన సీసీ రహదారుల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదు.

ఇదీ పరిస్థితి..

గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 1937 సీసీ , 406 బీటీ రహదారులు మంజూరయ్యాయి. రూ. 132 కోట్ల ఉపాధి నిధులతో సీసీ, రూ. 157 కోట్లతో బీటీ రోడ్ల పనులకు అంచనాలు తయారు చేశారు. మార్చి 31లోగా పూర్తిస్థాయిలో పనులు నిర్వహించాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలందాయి. అయితే అనుకున్న మేరకు పనులు పూర్తికాకపోవడంతో ఏప్రిల్‌ 10వ తేదీకి గడువు పొడిగించారు. అయినప్పటికీ పనుల్లో పురోగతి లేకపోవడంతో ఏప్రిల్‌ నెలాఖరు వరకు సమయం ఇచ్చారు. కాగా ఇప్పటివరకు 32 బీటీ రోడ్లు పనులు పూర్తయ్యాయి. 303 రహదా రులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రారంభం కాని రహదారులు 70 వరకూ ఉన్నాయి. ఇక 740 వరకు సీసీ రహదారులు పూర్తయ్యాయి. 267 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 909 రహదారులు ప్రారంభం కాలేదు.

సీసీ రోడ్ల పనులు ఇలా..

- పాలకొండ డివిజన్‌లో 965 సీసీ రోడ్ల పనులకు గాను 178 పూర్తయి, 114 రహదారులు పలు దశల్లో ఉన్నాయి. 655 పనులు ప్రారంభం కావల్సి ఉంది. పార్వతీపురం డివిజన్‌లో 972 పనులకు గాను 562 సీసీ రహదారుల పనులు పూర్తయ్యాయి. మరో 153 పలు దశల్లో ఉండగా, 254 పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

- పార్వతీపురం పీఆర్‌ఐ విభాగానికి సంబంధించి ఏప్రిల్‌ నెలాఖరుకు బలిజిపేట, పార్వతీపురం, సీతానగరం మండలాల్లో 546 సీసీ రహదారులకు గాను 324 పూర్తయ్యాయి. మరో 105 పలు దశల్లో ఉండగా, ప్రారంభం కాని రహదారులు 114 వరకు ఉన్నాయి.

- సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలకు 174 రోడ్లు మంజూరు కాగా 118 పూర్తయ్యాయి. 56 రహదారులు ప్రారంభించాల్సి ఉంది.

- గరుగుబిల్లి, కొమరాడ మండలాలకు 252 మంజూరు కాగా, 120 పూర్తయ్యాయి. మరో 48 రోడ్లు పలు దశల్లో ఉన్నాయి. 84 రహదారి పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కురుపాం-2కు సంబంధించి గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం మండలాలకు 671 పనులు మంజూరు కాగా, 101 పూర్తయ్యాయి. మరో 62 పనులు వివిధ దశల్లో ఉండగా, 508 పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

- పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టాం మండలాలకు 294 పనులు మంజూరు కాగా, 77 పూర్తయ్యాయి. మరో 52 పలు దశల్లో ఉండగా, 147 ప్రారంభం కావాల్సి ఉంది.

- ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన సీసీ రహదారులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.

బీటీ రోడ్ల పనులు ఇలా..

- బలిజిపేట, పార్వతీపురం, సీతానగరం మండలాల్లో 73 బీటీ రహదారులకు గాను 19 పూర్తయ్యాయి. మరో 46 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఏడు బీటీ రహదారుల పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

- సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో 8 రహదారులకు గాను రెండు పూర్తయ్యాయి. మరో నాలుగు రహదారులు పలు దశల్లో ఉండగా, రెండు రహదారుల పనులు ప్రారంభం కావల్సి ఉంది.

- కురుపాం సెక్షన్‌-1లోని గరుగుబిల్లి, కొమరాడ మండలాల్లో 139 పనులకు గాను మూడు పూర్తికాగా, మరో 101 రహదారులు పలు దశల్లో ఉన్నాయి. 35 రహదారి పనులు ప్రారంభం కావాల్సి ఉంది. సెక్షన్‌-2 పరిధిలో గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో 166 బీటీ రహదారులకు గాను నాలుగు పూర్తయ్యాయి. 136 రహదారి పనులు పలు దశల్లో ఉండగా, మరో 26 పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

- పార్వతీపురం డివిజన్‌ మొత్తానికి 220 రహదారులకు గాను 24 పూర్తయ్యాయి. మరో 151 బీటీ రహదారులు పలు దశల్లో ఉన్నాయి. 44 రహదారి పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

- పాలకొండ సెక్షన్‌లో పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో 20 రహదారులకు గాను నాలుగు పూర్తయ్యాయి. 16 రహదారులు వివిధ దశల్లో ఉన్నాయి.

నాణ్యతా లోపాలు

జిల్లాలో చేపడుతున్న బీటీ రహదారుల పనుల్లో అధికంగా నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. రహదారులకు ఇరువైపులా బెర్మ్‌లు ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సంబంధిత రహదారులకు ఉపయోగించే వెట్‌ మిక్స్‌లో ప్రమాణాలు తక్కువగా ఉండడంతో రాతి బుగ్గి దర్శనమిస్తోంది. అదేవిధంగా మెటీరియల్‌లో కూడా లోపాలు నెలకొన్నట్లు పలు గ్రామాలకు వారు విమర్శిస్తున్నారు.

చెల్లింపుల కోసం ఎదురు చూపులు

అధికారుల సూచనల మేరకు మార్చి 10 లోగా జిల్లాలోని పలు మండలాల్లో అధికంగా సీసీ రహదారుల నిర్మాణం పూర్తి చేశారు. అయితే రెండు నెలలు గడుస్తున్నా .. నేటికీ బిల్లులు చెల్లింపులు కాలేదు. అధికారుల హామీతో రాత్రి, పగలు తేడా లేకుండా పంచాయతీల్లో పనులు పూర్తి చేసిన వారు ప్రస్తుతం బిల్లుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అప్పులు చేసి పనులు పూర్తి చేసిన కొంతమంది నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏదేమైనా చెల్లింపుల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో వారికి చెమటలు పడుతున్నాయి.

చెల్లింపులకు చర్యలు

జిల్లాలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనుల మేరకు బిల్లుల చెల్లింపులకు చర్యలు చేపడుతున్నాం. మార్చి 31లోగా పూర్తి చేసిన పనులకు సంబంధించి బిల్లుల అప్‌లోడ్‌ అయ్యాయి. ఆ తర్వాత జరిగిన నిర్మాణాలకు కమిషనర్‌ అనుమతులు అవసరం. ఈ నెలాఖరుకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. మార్చి నెలాఖరు వరకు పూర్తయిన పనుల ప్రాప్తికి చెల్లింపులు జరుగుతాయి. పనుల్లో నాణ్యతా లోపాలుంటే చెల్లింపుల్లో కోత తప్పదు.

- పి.త్రివిక్రమరావు, ఏపీడీ, ఉపాధి హామీ పథకం, పార్వతీపురం డివిజన్‌

ఆదేశాలు రావల్సి ఉంది..

జిల్లాలో సీసీ, బీటీ రహదారుల పనుల నిర్వహణకు ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావాల్సి ఉంది. మార్చి నెలాఖరుకు పనులు పూర్తికాకపోవడంతో ఏప్రిల్‌ 10వరకు గడువు పొడి గించారు. అయినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా పనులు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించి ఉన్న తాధికారుల నుంచి ఆదేశాలు రావల్సి ఉంది. చేపడుతున్న పనులకు గాను రికార్డింగ్‌ చేస్తాం. నిర్మాణాల నాణ్యతా ప్రమాణాలపై క్వాలిటీ కంట్రోల్‌, విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అం దించాం. లోపాలు ఉన్నట్లయితే చెల్లింపుల్లో రికవరీ తప్పదు.

- శర్మ, ఈఈ, పీఆర్‌ఐ డివిజన్‌, పార్వతీపురం

Updated Date - May 11 , 2026 | 12:22 AM