Deadline for Re-Survey రీ సర్వేకు డెడ్‌లైన్
ABN , Publish Date - May 13 , 2026 | 11:51 PM
Deadline for Re-Survey జిల్లాలో చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 12న అమరావతిలో జాయింట్ కలెక్టర్లు, భూ సర్వే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రీ సర్వేపై అధికారులకు దిశా నిర్దేశం చేసింది.
పార్వతీపురం, మే13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 12న అమరావతిలో జాయింట్ కలెక్టర్లు, భూ సర్వే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రీ సర్వేపై అధికారులకు దిశా నిర్దేశం చేసింది. దీంతో గడువులోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లాలో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వాస్తవంగా మన్యంలోని 965 రెవెన్యూ గ్రామాల్లో భూముల రీసర్వే ప్రారంభమైంది. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో 317 రెవెన్యూ గ్రామాల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు విడతల్లో రీసర్వే నిర్వహించారు. మొదట విడతగా 15 రెవెన్యూ గ్రామాల్లో, రెండో విడతలో 32, మూడో విడతలో 43, నాలుగో విడతలో 83 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. తాజాగా ఐదో విడతలో 73 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమ వుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో 326 నాన్ సిగ్నల్ గ్రామాల్లోనూ రీసర్వే పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసకుంటున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అధికారి (డీఎస్‌ఎల్‌వో) శ్రీనివాసరావును సరెండ్ చేశారు. ఆ స్థానంలో ఎవర్నీ నియమించలేదు. దీంతో గడువులోగా రీ సర్వే ప్రక్రియ పూర్తవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ‘ఏదేమైనా 2027, మార్చి నాటికి జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేస్తాం. త్వరలోనే పూర్తిస్థాయి జిల్లా సర్వే అధికారి నియామకం జరుగుతుంది. ’ అని జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు.