Share News

Property Tax ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ గడువు పెంపు

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:49 PM

Deadline Extended for Waiver of Interest on Property Tax Arrears ఆస్తి పన్ను చెల్లింపుదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని పన్ను బకాయిలపై అమలు చేస్తున్న 50 శాతం వడ్డీ మాఫీని ఈనెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఏక మొత్తంలో చెల్లించేవారికి ఐదు శాతం మేర రాయితీ కల్పిస్తున్నట్టు కూడా వెల్లడించింది

 Property Tax   ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ గడువు పెంపు
పన్ను రాయితీపై అవగాహన కల్పిస్తున్న కమిషనర్‌

  • ఆదేశాలిచ్చిన ప్రభుత్వం

పాలకొండ, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్ను చెల్లింపుదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని పన్ను బకాయిలపై అమలు చేస్తున్న 50 శాతం వడ్డీ మాఫీని ఈనెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఏక మొత్తంలో చెల్లించేవారికి ఐదు శాతం మేర రాయితీ కల్పిస్తున్నట్టు కూడా వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్వతీపురం మున్సిపాలిటీలో ఇంటి, వాణిజ్య సముదాయాల నుంచి రూ.7.72 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా మార్చి నెలాఖరు నాటికి రూ.3.38 కోట్లు వసూలు చేశారు. దీంతో పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన మున్సిపాలిటీగా పార్వతీపురం రికార్డు సొంతం చేసుకుంది. ఇక సాలూరు పురపాలక సంఘంలో రూ.5.28 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా మార్చి నెలాఖరు నాటికి రూ.2.46 కోట్లు వసూలు చేశారు. పాలకొండ నగర పంచాయతీలో రూ.3 కోట్లు మేర పన్ను బకాయిలు ఉండగా మార్చి నెలాఖరు నాటికి 1.73 కోట్లు వసూలు చేశారు. తాజాగా ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై అమలు చేస్తున్న 50 శాతం మేర వడ్డీ రాయితీ ఈ నెలాఖరు వరకు పొడిగించడంతో అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీలోగా పార్వతీపురంలో రూ.3.97 లక్షలు వసూలైంది. సాలూరులో రూ. 2.55 లక్షలు , పాలకొండలో రూ.3.86 లక్షలు వసూలైంది. అయితే మరో 20 రోజుల వరకు గడువు ఉండడంతో జిల్లావ్యాప్తంగా అధిక మొత్తంలో పన్నులు వసూలయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ‘పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలు ఈ నెలాఖరులోగా చెల్లించేవారికి వడ్డీలో 50 శాతం రాయితీ పొందొచ్చు. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఏక మొత్తంలో చెల్లించేవారికి ఐదు శాతం మేర రాయితీ వర్తించనుంది.’ అని కమిషనర్‌ రత్నంరాజు తెలిపారు.

Updated Date - Apr 11 , 2026 | 11:49 PM