Share News

Incomplete! గడువు పెంచుతున్నా.. పనులు పూర్తవట్లే!

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:27 AM

Deadline Extended, But Work Remains Incomplete! ప్రతి ఇంటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంలో రెండేళ్ల కిందట మంజూరైన జల్‌జీవన్‌మిషన్‌(జేజేఎం) పనులు కొలిక్కి రావడం లేదు. గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోవడంతో భామిని మండల వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు.

 Incomplete!  గడువు పెంచుతున్నా.. పనులు పూర్తవట్లే!
సింగిడి వంశధార నదీతీరంలో నత్తనడకన సాగుతున్న బావి పనులు

  • తాజాగా మరోసారి గడువు పెంపు

  • భామిని మండలవాసులకు తప్పని ఇక్కట్లు

  • తాగునీటి కోసం మరో ఏడాది ఎదురుచూడాల్సిందేనా?

భామిని, జూలై27(ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంలో రెండేళ్ల కిందట మంజూరైన జల్‌జీవన్‌మిషన్‌(జేజేఎం) పనులు కొలిక్కి రావడం లేదు. గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోవడంతో భామిని మండల వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. సుమారు రూ.60 కోట్లతో చేపట్టిన ఈ పనులు గతేడాది జూలైలోనే పూర్తి చేయాల్సి ఉంది. అయితే జూన్‌ మొదటి వారంలో వంశధారకు వరద రావడంతో సింగిడి వద్ద నదీ గర్భంలో చేపడుతున్న నిర్మాణాలకు బ్రేక్‌ పడింది. దీంతో ఈ ఏడాది జూలై వరకు గడువు పెంచినా.. పనుల్లో మాత్రం ఆశించిన పురోగతి లేదు. వేసవిలో కాకుండా ఏటా వర్షాకాలంలో పనులు చేపట్టడం, తరచూ సబ్‌ కాంట్రాక్టర్లు మారడమే ఈ పరిస్థితి కారణంగా తెలుస్తోంది. మొత్తంగా పనుల పూర్తికి ఉన్నతాధికారులు 2027, మార్చి వరకు మళ్లీ గడువు పెంచారు. అయితే ఈ గడువులోగానైనా నిర్మాణాలు పూర్తవుతాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ పరిస్థితి..

- జల్‌జీవన్‌మిషన్‌లో భాగంగా పసుకుడి కొండపైన రక్షిత నీటి పథకం ట్యాంకు ఏర్పాటు చేసి.. భామిని మండలానికి తాగునీరందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట రూ. 60 కోట్ల మంజూరు చేసింది. ఈ మేరకు సింగిడి గ్రామ సమీపంలో వంశధార నదిలో బావులను నిర్మించి మెగా మోటార్ల ద్వారా పసుకుడి కొండపైన 90 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకుకు నీటిని మళ్లించాల్సి ఉంది. దాని నుంచి అటు బత్తిలి, ఇటు కొరమ వరకు పైపులైన్‌ గ్రావిటీ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించాల్సి ఉంది.

- మండలంలోని 54 గ్రామాలకు 40 వాటర్‌ ట్యాంక్‌లను నిర్మించి వాటి ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. కాగా సింగిడి వద్ద వంశధార నదీ గర్భంలో బావి, అండర్‌ గ్రౌండ్‌ పైప్‌లైన్‌ పనులు ఇటీవల కాలంలో పూర్తి చేశారు. అయితే పలుకారణాలతో నదీ ఒడ్డున వాటర్‌ ట్యాంక్‌, పైపులైన్‌ పనులు పూర్తిచేయలేకపోతున్నారు. మండల వ్యాప్తంగా 782 కిలోమీటర్లు మేర పైపులైన్లు వేయాల్సి ఉండగా.. అరకొరగానే పనులు జరుగుతున్నాయి. మరోవైపు గ్రామాల్లో పైప్‌లైన్‌ల కోసం సీసీ రోడ్డులు, కాలువలు తవ్వి వదిలే యండంతో గ్రామస్థులు పెదవి విరుస్తున్నారు.

పనులు ఇలా..

సింగిడి వద్ద వంశధార నదీ తీరంలో ఏర్పాటు చేసిన బావిలో విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. బావికి ఫుట్‌ బ్రిడ్జ్‌ కనెక్షన్‌, రిటర్నింగ్‌ వాల్‌ నిర్మించాలి. 40 వాటర్‌ ట్యాంక్‌లకు గాను 25 పూర్తి కాగా, 15 ప్రోగ్రస్‌లో ఉన్నాయి. గ్రామాల్లో పైపులైన్‌ , ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు తదితర పనులు చేయాల్సి ఉంది. నేరడి, బిల్లుమడ, బొడ్డగూడ, యాతంగూడ, కొరమ, చిన్నదిమిలి వరకు పైపులైన్‌లు వేశారు. నులకజోడులో వర్షాకాలంలో పనులు ప్రారంభించారు. అయితే పైపులైన్‌ కోసం గోతులు తవ్వగా .. వాటిల్లో వర్షపు నీరు చేరి బురదమయంగా మారడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏదేమైనా జేజేఎం తాగునీటి కోసం భామిని మండల వాసులు మరో ఏడాది వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ఎ.సందీప్‌కుమార్‌ను వివరణ కోరగా.. ‘వంశధారకు వరద రాకముందే నదీ గర్భంలో మేజర్‌ పనులు పూర్తయ్యాయి. వాటర్‌ కలెక్షన్‌ బావిలో 95 హెచ్‌పీ సామర్థ్యంతో కూడిన రెండు మోటార్లు ఏర్పాటు చేసి.. పసుకుడి కొండపై ఉన్న ట్యాంక్‌కు నీటిని పంపిస్తాం. ఈ ఏడాది డిసెంబరులో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Jul 28 , 2026 | 12:27 AM