Share News

Darkness in the streets of Bobbiliబొబ్బిలి వీధుల్లో చీకట్లు

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:03 AM

Darkness in the streets of Bobbili బొబ్బిలి వీధుల్లోకి రాత్రి వేళ బయటవారు వెళ్లలేకపోతున్నారు. స్థానికులు ఇళ్లను వీడి రాలేకపోతున్నారు. వర్షాకాలం కావడంతో పాము పుట్ర తిరుగుతాయని, వాటిని గుర్తించలేకపోతే అపాయమని భయపడుతున్నారు.

Darkness in the streets of Bobbiliబొబ్బిలి వీధుల్లో   చీకట్లు
బొబ్బిలిలోని ఓ వీధిలో వెలగని వీధి దీపాలు

బొబ్బిలి వీధుల్లో

చీకట్లు

లైట్లు వెలగక పది రోజులుగా ఇబ్బందులు

నిర్వహణ థర్డ్‌పార్టీకి ఇవ్వడంతో కానరాని పరిష్కారం

విసిగిపోతున్న స్థానికులు

వర్షాకాలం కావడంతో బయటకు వెళ్లాలంటే భయం

అయోమయంలో స్థానిక అధికారులు

ఆస్పత్రికీ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతున్న వైనం

బొబ్బిలి వీధుల్లోకి రాత్రి వేళ బయటవారు వెళ్లలేకపోతున్నారు. స్థానికులు ఇళ్లను వీడి రాలేకపోతున్నారు. వర్షాకాలం కావడంతో పాము పుట్ర తిరుగుతాయని, వాటిని గుర్తించలేకపోతే అపాయమని భయపడుతున్నారు. ఈ పరిస్థితికి కారణం వీధి దీపాలు వెలగకపోవడమే. పది రోజులుగా ఆయా వీధుల్లో చీకట్లు అలముకున్నాయి. విదుత్‌శాఖ అధికారులకు, నేతలకు సమస్య విన్నవిస్తున్నా పరిష్కారం కావడంతో లేదు. ఆ వీధి దీపాల నిర్వహణ థర్డ్‌పార్టీ చూస్తోందని, విశాఖ నుంచి వారు రావాల్సి ఉందని చెబుతున్న స్థానిక అధికారులు వరుసగా వస్తున్న ఫిర్యాదులకు స్పందించలేక అయోమయంలో పడుతున్నారు.

బొబ్బిలి, జూలై 14(ఆంధ్రజ్యోతి):

బొబ్బిలిలో కొన్ని వీధి దీపాలకు విద్యుత్‌ శాఖ స్మార్ట్‌ మీటర్లను అమర్చింది. వీటిని థర్డ్‌పార్టీ వారు విశాఖ నుంచి ఆపరేట్‌ చేస్తున్నారు. అవి ప్రతీ రోజూ సాయంత్రం 6 గంటలకు వెలిగి, తెల్లవారి 6 గంటలకు ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా సెట్‌ చేశారు. వీటి నిర్వహణలో మున్సిపాలిటీ ప్రమేయం లేదు. అంతా థర్డ్‌ఫార్టీయే చూసుకుంటుంది. ఆ వీధిదీపాలు మరమ్మతులకు గురైతే వారే రావాలి. ఇప్పుడు బొబ్బిలి ప్రజలను వేధిస్తున్న సమస్య ఇదే. పది రోజులుగా వీధి దీపాలు వెలగక నానా పాట్లు పడుతున్నారు. అధికారులకు, నేతలకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ పరిష్కారం కావడం లేదు. విశాఖ నుంచి వారు రావడం లేదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగితే సమస్యలు తగ్గాల్సింది పోయి మరింతగా పెరగడమేంటని బొబ్బిలి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వీధిదీపాల ఏర్పాటు, నిర్వహణ మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటుంది. మున్సిపాలిటీనే ప్రజలు నిందిస్తున్నారు. ప్రజలకు సమాఽధానం చెప్పలేక, సమస్యను పరిష్కరించ లేక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎమ్మెల్యే బేబీనాయన కూడా విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడారు. అయినా పరిష్కారం కావడం లేదు. పాతబొబ్బిలి, కోరాడవీధి, ఐటీఐ కాలనీ, ఇందిరమ్మకాలనీ, గొల్లపల్లి, మల్లమ్మపేట, పూల్‌బాగ్‌, రావువారివీధి, గొల్లవీధి తదితర ప్రాంతాలలో వీధి దీపాలు వెలగడం లేదు. దొంగల భయంతో పాటు విషసర్పాలు, కుక్కల సంచారంతో హాని కలుగుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఫ మరోవైపు బొబ్బిలి మున్సిపాలిటీలో బ్యూటిఫికేషన్‌ ప్రక్రియలో భాగంగా ముఖ్యమైన కూడళ్లలో, ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నుంచి పార్వతీపురం వెళ్లే స్టేట్‌ హైవేలో రోప్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వర్షాలు కురిసిన ప్రతిసారీ విద్యుత్‌ అంతరాయం ఏర్పడి వీధిదీపాలతో పాటు రోప్‌ లైటింగ్‌కు అనుసంధానంగా ఉన్నవి కూడా వెలగడం లేదు.

ఫ త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో వీధిదీపాలు, తాగునీటి సమస్యలు తీవ్రతరం అయితే ప్రజల దగ్గరకు ఓట్ల కోసం ఎలా వెళ్లగలమని కూటమి పార్టీల నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద సమస్యగా తయారైంది

బొబ్బిలిలో 157 విద్యుత్‌ స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 31 వార్డులలో సుమారు ఐదువేల వీధిదీపాలు వెలుగుతున్నాయి. థర్డ్‌పార్టీ ఆధ్వర్యంలో వాటి నిర్వహణ జరుగుతుండడంతో మరమ్మతులు వచ్చినప్పుడు పెద్ద సమస్యగా తయారైంది. వీధిదీపాలు, రోప్‌ లైటింగ్స్‌ వెలగకపోవడంతో ప్రజలు మమ్మల్ని నిందిస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారా విద్యుత్‌ ఎస్‌ఈకి సమస్య నివేదించాం.

- లాలం రామలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌, బొబ్బిలి

ఆస్పత్రికీ కరెంట్‌ కట్‌

బొబ్బిలి ఇందిరమ్మకాలనీలో ఉన్న అర్బన్‌ప్రైమరీ హెల్త్‌ సెంటరు (యూపీహెచ్‌సీ)కి రెండు వారాలుగా పగటిపూట విద్యుత్‌ సరఫరా ఉండడం లేదు. ముఖ్యమైన మందులను, వ్యాక్సిన్లను ఫ్రిజ్‌లో ఉంచాలి. అలాగే రోగులకు పలు రకాల పరీక్షలకు విద్యుత్‌ అవసరం. స్మార్ట్‌ మీటర్లను అమర్చాలంటూ యూపీహెచ్‌సీలకు కూడా వీధి దీపాల మాదిరిగానే రాత్రి వేళ మాత్రమే విద్యుత్‌ సరఫరా చేస్తూ పగటిపూట నిలిపేస్తున్నారు. దీంతో వైద్యులు, రోగులు చాలా ఇక్కట్లకు గురవుతు న్నారు. ఇన్వర్టరు కెపాసిటీ ఉన్నంతవరకు పనిచేస్తున్నాయి. ఆ తరువాత ఆగిపోతున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసులకు విద్యుత్‌ సరఫరా విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులను కోరామని, కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకువెళ్తామని కమిషనర్‌ లాలం రామలక్ష్మి తెలిపారు.

రెండు వారాలుగా విద్యుత్‌ ఉండడం లేదు

డాక్టర్‌ గొంగాడ సాయికుమార్‌, యూపీహెచ్‌సీ వైద్యాధికారి

రెండు వారాలుగా ఇందిరమ్మకాలనీ యూపీహెచ్‌సీకి విద్యుత్‌ సరఫరా పగటిపూట నిలిచిపోతోంది. ఇన్వెర్టర్లతో నెట్టుకొస్తున్నాం. ఎమర్జెన్సీ సర్వీసు కాబట్టి విద్యుత్‌ సరఫరాను నిరంతరాయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనరు ద్వారా విద్యుత్‌ అధికారులను కోరాం.

Updated Date - Jul 15 , 2026 | 12:03 AM