Share News

Danger spot!డేంజర్‌ స్పాట్‌!

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:04 AM

Danger spot! పోలిపల్లి ఎత్తుబ్రిడ్జి డౌన్‌ వైపుగా వెళ్తున్నారా? అయితే అప్రమత్తంగా ఉండండి.. వేగం తగ్గించండి.. నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ ఇది ప్రమాద బాధితులు చెబుతున్న మాట. హైవేపై జరుగుతున్న ప్రమాదాల్లో అక్కడే అధికం. పోలిపల్లి ఎత్తుబ్రిడ్జి డౌన్‌ నుంచి లింగాలవలస పెట్రోల్‌ బంకు మధ్యలో సుమారు 25 మీటర్ల పరిధిలో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ రోడ్డు డౌన్‌లో ఉండడం.. చంద్రాకారంలో తిరిగి ఉండడం.. వాహనదారులు 100 కిమీ పైగా స్పీడుతో వెళ్లడం ప్రమాదాలకు కారణాలని స్థానికులు కూడా చెబుతున్నారు.

Danger spot!డేంజర్‌ స్పాట్‌!
జాతీయ రహదారిపై అధికంగా ప్రమాదాలు జరుగుతున్న పోలిపల్లి గ్రామ సమీప ప్రాంతమిదే

డేంజర్‌ స్పాట్‌!

ఆ 25 మీటర్ల విస్తీర్ణంలోనే అత్యధికంగా ప్రమాదాలు

పోలిపల్లి ఎత్తుబ్రిడ్జి డౌన్‌ వద్ద అప్రమత్తంగా ఉండాల్సిందే

డివైడర్‌ దాటి ఆవలికి దూసుకువెళ్తున్న వాహనాలు

బ్లాక్‌ స్పాట్లను పట్టించుకోని ఎన్‌హెచ్‌ అధికారులు

గాల్లో కలిసిపోతున్న వాహన చోదకుల ప్రాణాలు

రెండున్నరేళ్లలో భోగాపురం పరిధిలో 45 మంది మృతి

పోలిపల్లి ఎత్తుబ్రిడ్జి డౌన్‌ వైపుగా వెళ్తున్నారా? అయితే అప్రమత్తంగా ఉండండి.. వేగం తగ్గించండి.. నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ ఇది ప్రమాద బాధితులు చెబుతున్న మాట. హైవేపై జరుగుతున్న ప్రమాదాల్లో అక్కడే అధికం. పోలిపల్లి ఎత్తుబ్రిడ్జి డౌన్‌ నుంచి లింగాలవలస పెట్రోల్‌ బంకు మధ్యలో సుమారు 25 మీటర్ల పరిధిలో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ రోడ్డు డౌన్‌లో ఉండడం.. చంద్రాకారంలో తిరిగి ఉండడం.. వాహనదారులు 100 కిమీ పైగా స్పీడుతో వెళ్లడం ప్రమాదాలకు కారణాలని స్థానికులు కూడా చెబుతున్నారు.

భోగాపురం/విజయనగరం రింగురోడ్డు, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి):

- ఈ నెల 22న భోగాపురం మండలం పోలిపల్లి వద్ద కారు అదుపుతప్పి పక్క రహదారిపైకి మళ్లింది. అటువైపు నుంచి వస్తున్న లారీని ఢీ కొనడంతో తాత, మనవడు మృతి చెందారు.

- ఏప్రిల్‌ నెలలో బైకుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు భోగాపురం సచివాలయ సమీపానానికి వచ్చేసరికి ఆగిన లారీని ఢీ కొన్నారు. వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు.

- 2025 భోగాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైవేపై నిలిచిన వర్షపు నీరు అద్దాలపైకి తుళ్లడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది.

జాతీయ రహదారిపై భోగాపురం పరిధిలో 2024 జనవరి నుంచి ఈనెల 22 వరకు రెండున్నరేళ్లలో 102 ప్రమాదాలు జరగ్గా 45 మంది మృత్యువాత పడ్డారు. 128 మంది ఆసుపత్రులపాలయ్యారు. వీటిలో అధిక ప్రమాదాలు పోలిపల్లి సమీపంలోనే జరిగాయి. 2024 నవంబరు 30న మొన్న జరిగిన మాదిరిగానే ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం వైపునుంచి విశాఖ వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ ఢీకొని పక్కరోడ్డుపైకి వచ్చేసింది. ఆ రహదారిలో వచ్చిన లారీ ఢీకొంది. ఆ ప్రమాదంలో శ్రీకాకుళంకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అదే ఏడాది డిసెంబరు 26న శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తున్న కారు ముందువెళ్తున్న లారీని ఢీకొనడంతో నెల్లూరుకు చెందిన భార్యాభర్త ప్రాణాలు కోల్పోయారు. పోలిపల్లి ఎత్తుబ్రిడ్జి డౌన్‌ నుంచి లింగాలవలస పెట్రోల్‌ బంకు మధ్యలో సుమారు 25 మీటర్ల రోడ్డే అధిక ప్రమాదాలకు కారణమవుతుంది. ప్రమాదాలు జరిగిన వెంటనే అధికారులు రావడం, కారణాలను అన్వేశించడం పరిపాటిగా మారింది. నివారణకు చర్యలు మాత్రం ఉండడం లేదు. బ్లాక్‌ స్పాట్ల వద్ద సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం లేదు.

ప్రమాద స్థలాలను గుర్తించినా..

జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే ఐదు ప్రాంతాలను పోలీసు శాఖ గుర్తించింది. భోగాపురం గ్రామ సమీప అపర్ణహోటల్‌ ప్రాంతం, సవరవల్లి, లింగాలవలస, పోలిపల్లి, మహారాజపేట ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్లుగా నిర్ధారించింది. అక్కడ డాంబర్‌లైన్స్‌, సైన్‌బోర్డులు, రెడ్‌స్టిప్స్‌, లైటింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. హైవే అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ విధంగా ఏ ఒక్క బ్లాక్‌స్పాట్‌ వద్ద సూచికలు కానరావడం లేదు. ప్రస్తుతం జాతీయ రహదారిపై రోజూ సుమారు 35 నుంచి 40 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వచ్చే నెల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగితే ఈ రహదారిపై మరింత రద్దీ పెరగనుంది. రోజూ 50నుంచి 60వేల వాహనాలు తిరిగే అవకాశం ఉంది. రాబోయే వాహన రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీస్‌, హైవే, మోటర్‌ వెహికల్‌ అధికారులు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచర ణ చేపట్టాల్సి ఉంది.

లారీల నిలుపుదలతో..

హైవే షోల్డర్స్‌పై, సర్వీసు రోడ్ల సమీపంలో లారీలను నిలిపివేయడం మరో సమస్యగా మారింది. రాత్రి వేళల్లో ఇవి స్పష్టంగా కన్పించకపోవడం వల్ల వెనుకనుంచి వచ్చే వాహనాలు ఢీ కొడుతున్నాయి. రోడ్డు భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రఽధాన రహదారిపై వాహనాన్ని నిలిపివేయకుండా ప్రత్యేక ట్రక్‌ లేబుల్‌ ఉండాలి. ఎక్కడా ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు.

రోడ్డుపై నీటి నిల్వతో..

వర్షాల సమయంలో హైవేపై నీరు నిల్వ వుండడం ప్రమాదాలకు కారణమౌతోంది. సాధారణంగా రహదారిపై నీరు నిల్వకుండా నిర్మాణం చేపట్టినా, డ్రైనేజీ లోపాలు, పూడిక పేరుకుపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోతోంది. అధిక వేగంతో నీటిలోకి ప్రవేశించిన వాహనాలు రోడ్డుపై పట్టు కోల్పోయి అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి.

ట్రామాకేర్‌ లేక.. గాల్లోనే ప్రాణాలు

జిల్లా పరిధిలో పూర్తిస్థాయి ట్రామాకేర్‌ సెంటర్‌ అందుబాటులో లేక రోడ్డు ప్రమాద బాధితులను ముందుగా భోగాపురం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)కి తరలిస్తున్నారు. పరిస్థితి విషమంగా వున్న బాధితులను విజయనగరం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలిస్తున్నారు. 22 కిలోమీటర్లు ప్రయాణం చేసి విజయనగరం చేరుకోవడానికి సాధారణంగా 40 నుంచి 45 నిమిషాలు పడుతుంది. గోల్డెన్‌ అవర్‌లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిన వారున్నారు.

నిఫుణులు సూచించిన పరిష్కారాలు

- ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో బ్లాక్‌ స్పాట్‌లు గుర్తించి ప్రత్యేక భద్రతా ప్రణాళిక అమలు చేయాలి

- రహదారిపైకి నీరొచ్చే ప్రాంతాలను గుర్తించి శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి

- ప్రమాదకర ప్రాంతాలకు ముందు రంబుల్‌ స్ట్రీప్స్‌ ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని తగ్గించాలి

- డివైడర్ల వద్ద క్రాష్‌ గ్యారీయర్లు నిర్మించాలి

- రాత్రి వేళల్లో హైమాస్ట్‌,ఎల్‌ఈడీ లైటింగ్‌ ఏర్పాటు చేయాలి

- రిప్లెక్టివ్‌ హెచ్చరిక బోర్డులు, క్యాటైస్‌ మార్కింగ్‌లు పెంచాలి

- ట్రక్‌ పార్కింగ్‌ బేలను నిర్మించి లారీల నిలుపుదలను నిషేధించాలి

- ప్రతి ఆరు నెలలకు ఒకసారి రోడ్డు సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలి

- భోగాపురం ఎయిర్‌పోర్టు సెంటర్లో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి

తనిఖీలు ముమ్మరం: ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించాం. అతి వేగాన్ని నియంత్రించేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాల వివరాలను సంబంధిత శాఖలకు తెలియజేసి భద్రతా చర్యలు చేపట్టేలా ప్రయత్నిస్తున్నాం. వాహనదారులు కూడా వేగ నియంత్రణ పాటించాలి.

హైవే అధికారులకు చెప్పాం

భోగాపురం జాతీయరహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో లైటింగ్‌ సైన్‌ బోర్డులు, సూచికలు ఎన్‌హెచ్‌వారు ఏర్పాటు చేయాల్సి ఉంది. వారికి ఇప్పటికే చెప్పాం.

- కె.దుర్గాప్రసాదరావు, సీఐ, భోగాపురం.

అధిక వేగమూ కారణమే

వాహన చోదకులు మితిమీరిన సుమారు 100 నుంచి 120 కిమీ వేగంతో వెళ్తున్నారు. దీనివల్ల వాహనాన్ని కంట్రోల్‌ చేయలేం. అలాగే వాహనాల నిర్వహణ, టైర్లు బాగున్నాయా..లేదా అని కూడా కొందరు చూడడం లేదు. ఈనెల 22న జరిగిన ప్రమాదంలోని కారు పదేళ్ల కిందట కొనుగోలు చేసింది. వేగంగా వెళ్లడంతో అదుపు చేయలేకపోయారని తెలుస్తోంది.

- వెంకటరావు, మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, విజయనగరం.

బ్లాక్‌స్పాట్లను గుర్తించేలా చర్యలు

జాతీయ రహదారిపై స్పీడ్‌ లిమిట్‌ 100కిమీ. అయితే వాహన చోదకులు అంతకు మించిన వేగంతో వాహనాలు నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాక్‌ స్పాట్ల వద్ద లైటింగు, సైన్‌ బోర్డులు తదితర వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు చెప్పాం. ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం.

మహేష్‌బాబు, రోడ్డు ఇంజినీర్‌(ఎఈ) ఎన్‌హెచ్‌ 16.

Updated Date - Jun 24 , 2026 | 12:04 AM