Share News

Danger… Danger! డేంజర్‌.. డేంజర్‌

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:02 AM

Danger… Danger! పాలకొండ మండలంలోని నాగావళి నదిలో ఇసుక తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా లేకుండా పోతోంది. ఏ మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయో పరిశీలించకుండా.. ప్రజాప్రతినిధుల సిఫారసులకు తలొగ్గి.. ఎడాపెడా అధికార యంత్రాంగం అనుమతులు మంజూరు చేస్తుండడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.

Danger… Danger! డేంజర్‌.. డేంజర్‌
బొడ్డవలస వద్ద నాగావళి నదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న దృశ్యం

  • అధికారుల మధ్య సమన్వయ లోపం

  • ఇన్‌ఫిల్టర్‌ బావులకు పొంచి ఉన్న ముప్పు

  • పిల్లర్లు కోతకు గురైతే వంతెనకూ ప్రమాదం

  • సాగు, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం

పాలకొండ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): పాలకొండ మండలంలోని నాగావళి నదిలో ఇసుక తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా లేకుండా పోతోంది. ఏ మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయో పరిశీలించకుండా.. ప్రజాప్రతినిధుల సిఫారసులకు తలొగ్గి.. ఎడాపెడా అధికార యంత్రాంగం అనుమతులు మంజూరు చేస్తుండడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. దీంతో ఓపెన్‌హెడ్‌ చానల్‌ ద్వారా సాగునీరు, ఇన్‌ఫిల్టర్‌ బావుల ద్వారా తాగునీరు అందని పరిస్థితి నెలకొంది.

ఇదీ పరిస్థితి..

పాలకొండ మండలం గొట్ట మంగళాపురం, గోపాలపురం వద్ద నాగావళి నదిలో ఇసుక తవ్వకాలకు ఇటీవల మన్యం జిల్లా అధికార యంత్రాంగం అనుమతులు మంజూరు చేసింది. ఆరు నెలల కిందటే నాగావళి నదికి అవతల ఉన్న బొడ్డవలస వద్ద విజయనగరం జిల్లా అధికారులు ఇసుక నిల్వలు తరలింపునకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో రాత్రి, పగలని తేడా లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో నది లోతుగా మారుతోది. కాగా పాల కొండ మండలం యరకారాయపురం నుంచి గోపాలపురంవరకు వెంకన్న , సీడీ నాయుడు , సాయన్న తదితర ఓపెన్‌హెడ్‌ చానళ్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 20 నుంచి 30 గ్రామాలకు సాగునీరు సరఫరా కావాల్సి ఉంది. అయితే బొడ్డవలస వద్ద గత ఆరు నెలలుగా ఇసుక తవ్వకాలు కొనసాగుతుండడంతో నదిలో ఇసుక గణనీయంగా తగ్గి ఓపెన్‌హెడ్‌ చానళ్లకు సాగునీరందడం లేదు.

గడిచిన పది రోజులుగా సీడీనాయుడు చానల్‌ ద్వారా రబీ పంటకు అవసరమైన సాగునీటిను తరలించేందుకు రైతులు ఎకరాకు రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. యరకారాయపురం వద్ద ఉన్న సీడీ నాయడు చానల్‌ ఓపెన్‌హెడ్‌ ఎత్తుగా మారడం, ఇసుక తవ్వకాలతో కింది భాగంలో జారి వెళ్లడంతో సాగునీరు మళ్లించడం సాధ్యం కావడం లేదు. దీంతో పంటలను వేయలేకపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీడీ నాయుడు చానల్‌ ద్వారా మంగళాపురం, గోపాలపురం, అన్నవరం, అంపిలి, వడమ, కొండా పురంవరకు సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీరు సరఫరా కావల్సి ఉంది.

మంగళాపురం, బుక్కూరు, తంపటాపల్లి గ్రామాలకు సాగునీరు అందించే వెంకన్న చానల్‌కు కూడా నీరు మళ్లించడం కష్టమవుతుందని రైతులు వాపోతున్నారు. కాగా విజయనగరం జిల్లాలోని రేగిడి ఆమదాలవలస మండలం పరిధిలో సంకిలి, చిన్న పుర్లి, దేవుదల, కొమెర, ఆడవరం, లక్ష్మీపురం, ఖండ్యాం తదితర ప్రాంతాలకు నీరందించే సాయన్నచానల్‌ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇసుకను ఇష్టానుసారంగా తరలిస్తుండడంతో నదీ గర్భం లోతుగా మారి కాలువలు ఎత్తుగా మారుతుండడంతో సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు.

తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం...

పాలకొండ, రాజాం, చీపురుపల్లి, విజయనగరంతో పాటు పలు నియోజకవర్గాలకు తాగునీరు అందించే ఇన్‌ఫిల్టర్‌ బావులన్నీ నాగావళి నదిలోని ఒకేచోట కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే వాటి సమీపంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో ఇన్‌ఫిల్టర్‌ బావుల ద్వారా నీటిని శుద్ధి చేసి.. పూర్తిస్థాయిలో సరఫరా చేయడం కష్టతరమవుతోంది. వేసవిలో తాగునీటి ఇక్కట్లు నెలకొనే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిషిద్ధమైనప్పటికీ స్పందించేవారే కరువయ్యారు. మరోవైపు ఇసుక తరలింపుతో సంకిలి, మంగళాపురం వద్ద ఉన్న వంతెనకు ముప్పు పొంచి ఉంది. పిల్లర్లు కోతకు గురై వంతెన కూలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది తెలిసి కూడా ఇసుక తవ్వకాలు ఆపకపోవడం గమనార్హం.

నీటిపారుదలశాఖ సిఫారసులతోనే..

నీటిపారుదలశాఖ అధికారులు ఇసుక నిల్వలు ఉన్నాయని సిఫారసు చేయడంతోనే ఇటీవల పాలకొండ మండలం మంగళాపురం, గోపాలపురం ర్యాంప్‌లకు అనుమతులు ఇచ్చాం. విజయ నగరం జిల్లాలో బొడ్డవలస వద్ద కొన్ని నెలలుగా ఇసుక తరలింపు చేపడుతున్నారు.

- శ్రీనివాసరావు, ఏడీ, జిల్లా మైనింగ్‌ శాఖ

========================

కోర్టును ఆశ్రయిస్తాం

నాగావళి నది నుంచి యథేచ్ఛగా ఇసుక తరలింపుతో ఓపెన్‌హెడ్‌ చానల్‌ ద్వారా సాగునీరు అందడం లేదు. అధికార యంత్రాంగం తీరుపై కోర్టును ఆశ్రయిస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.

- ఎం.జయశంకర్‌, రైతు, గోపాలపురం

================================

ఇసుక తరలింపుతోనే..

నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో నది గమనం మారి ఓపెన్‌హెడ్‌ చానల్‌కు సాగునీరు అందడం లేదు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సాగునీరు మళ్లింపునకు ప్రయత్నం చేసినా ప్రయోజనం దక్కడం లేదు. దీంతో రైతులు రబీ పంటను వేయలేని పరిస్థితి తలెత్తింది.

- పి.జగన్నాథంనాయుడు, రైతు, గోపాలపురం

Updated Date - Feb 11 , 2026 | 12:02 AM