Danda is not 'normal' దందా ‘మామూలు’గా లేదు
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:06 AM
Danda is not 'normal'కార్పొరేషన్‌లో ఏ పనికైనా ఓ రేటు నిర్ణయించేశారు. మామూళ్ల దందా నడుస్తోంది. నగరంలో ఇల్లు నిర్మించుకుందామంటే ముందుగా సచివాలయంలోని ప్లానింగ్ కార్యదర్శిని కాలవాలి. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది.
దందా ‘మామూలు’గా లేదు
అవినీతికి కేరాఫ్‌గా టౌన్ ప్లానింగ్ విభాగం
చేయితడపందే అనుమతులు రావు
కార్పొరేషన్‌లో భవనానికో రేటు
వసూల్ రాజాలుగా ప్లానింగ్ సెక్రటరీలు
ఏసీబీ అధికారుల సోదాలతో ఉలిక్కిపాటు
కార్పొరేషన్‌లో ఏ పనికైనా ఓ రేటు నిర్ణయించేశారు. మామూళ్ల దందా నడుస్తోంది. నగరంలో ఇల్లు నిర్మించుకుందామంటే ముందుగా సచివాలయంలోని ప్లానింగ్ కార్యదర్శిని కాలవాలి. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఇంటి యజమాని నుంచి వివరాలను సేకరించాక ఉన్నతాధికారి వద్దకు ప్రతిపాదనను పంపుతూ బేరానికి దిగుతున్నారు. యజమాని తలూపితే ఇక ఆయన ఎన్ని అంతస్థులు నిర్మించినా పట్టించుకునే నాథుడే ఉండడు. లేదంటే పనిమీద ఆశలు వదులుకోవాల్సిందే అన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ పట్టంచుకోనివారంతా తాజాగా ఏసీబీ సోదాలతో ఉలిక్కిపాటుకు గురయ్యారు.
విజయనగరం టౌన్, మార్చి10(ఆంధ్రజ్యోతి):
విజయనగరం వేగంగా విస్తరిస్తోంది. భవంతుల నగరంగా మారుతోంది. ఐదేళ్లలో ఐదు వేలకు పైగా నూతన భవనాలు నిర్మితమయ్యాయని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులే చెబుతున్నారు. ఈ అభివృద్ధిని కొందరు అధికారులు స్వప్రయోజనాలకు మలుచుకుంటున్నారు. ప్రధానంగా ప్లానింగ్ విభాగం అనేక ఆరోపణలను మూటగట్టుకుంటోంది. నగరంలో ఎక్కడ ఇల్లు నిర్మించాలన్నా నగర ప్రణాళికా విభాగం అధికారుల అనుమతులు తీసుకోవాలి.ముందుగా సచివాలయంలోని ప్లానింగ్ కార్యదర్శుల దృష్టిలో పెట్టాలి. వీరు ఇంటి యజమాని నుంచి వివరాలను సేకరించి సంబంధిత ఉన్నతాధికారి వద్దకు ఫైల్‌ను పంపుతారు. ఇక్కడ మొదలయ్యే బేరం అంచెలంచెలుగా నడుస్తోంది. అన్నింటికీ యజమాని తలూపితే ఆయన ఎలాగైనా భవనాన్ని నిర్మించుకోవచ్చు.
కొన్ని ఉదాహరణలు
- నగరంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఇరువైపులా ఉన్న షాపుల యజమానులు నుంచి ఇటీవల అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
- అంబటిసత్రం కూడలి వద్ద ఓ షాపింగ్ మాల్ యజమాని కాలువపైనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసేసుకున్నాడు.
- కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఐనాక్స్ షాపింగ్ మాల్ వెనుకభాగాన నిర్మించిన ఓ ఆసుపత్రి భవనాలలో పార్కింగ్ స్థలం లేకుండానే అనుమతులు ఇచ్చేశారు. అలాగే ఽధర్మపురి కూడలిలోని ఓ ఆసుపత్రికి సెల్లార్‌లో పార్కింగ్ లేకుండా అనుమతి ఇచ్చేశారు.
- 45వ డివిజన్ పరిధిలోని ఎస్‌సీ,ఎస్‌టీ కాలనీలో డీపట్టాలో ఓ ఇంటి యజమాని రెండంతస్తుల భవన నిర్మాణం చేపట్టగా మొదట అభ్యంతరం చెప్పిన ప్రణాళిక అధికారులు డబ్బులు తీసుకుని వదిలేశారు.
- కెఎల్‌పురంలోని ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్ నిర్మాణం విషయమై డబ్బులు చేతులు మారాయి.
- తోటపాలెంలోని మూడంతస్తుల భవనంలో నాలుగో అంతస్తు నిర్మాణానికి మామూలు తీసుకుని అనుమతి ఇచ్చేశారు.
- అయ్యన్నపేటలో అనుమతులు లేకుండా చేపట్టిన ప్రైవేటు ఫంక్షన్ హాలు నిర్మాణాన్ని అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. తరువాత బీపీఎస్‌లో పెట్టుకోమని సలహాలను కూడా ప్రణాళికా విభాగం అధికారులే ఇచ్చారట.
- పావనీనగర్‌లో డీపట్టా భూమిలో రెండంతస్తుల ఇంటిని రెండేళ్లక్రితం కల్యాణ మండపం చేసి అద్దెలకు ఇస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్న యజమానికి ఒక్క నోటీసు కూడా పంపలేదు.
అన్నింటికీ ఒకటే పంథా
నగరంలో నచ్చినట్లు కల్యాణ మండపాలు కట్టాలనుకున్నా, లెక్కకు మిక్కిలి అంతస్తుల్లో కళాశాల భవనాలు నిర్మించాలన్నా, బహుళ అంతస్తులు చేపట్టాలనుకున్నా, రహదారిని నచ్చినట్లు వెడల్పు చేయాలన్నా, పార్కింగ్ లేకుండా అపార్టుమెంట్లు చేపట్టాలన్నా ప్లానింగ్ అధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిందేనన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వాటిపై కనీస చర్యలు లేవు.
ప్రైవేటు సర్వేయర్లతో కుమ్మక్కు
నగరంలోని కొంతమంది ప్రైవేటు సర్వేయర్లతో పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది కుమ్మకై జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది రాకుండా అడ్డు తప్పుకుంటామని సంబంధిత పట్టణ ప్రణాళికా విభాగంలోని ఉద్యోగులే భవన యజమానులకు సలహాలు ఇస్తున్నారట.
అంతా ప్లానింగ్
నగరంలో 50 డివిజన్లలో 61 సచివాలయాలు ఉండగా ఇందులో సుమారు 32మంది ప్లానింగ్ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. నగరంలో ఎక్కడ శంకుస్థాపన జరిగినా వీరు తక్షణమే వాలిపోతారు. భవన నిర్మాణానికి అనుమతులు చూపించండి అంటూ వారిని బెదిరించడంతో నిర్మాణదారులు స్థానిక నాయకులను కలుస్తున్నారు. నాయకులు వీరితో ఒక రేటు మాట్లాడి తలో ఇంతా అనుకుని భవన యజమాని నుంచి వసూలుకు సహకరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
అక్కడి నుంచే మొదలు
సచివాలయం పరిధిలో పనిచేస్తున్న ప్లానింగ్ సెక్రటరీలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారన్న విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. సచివాలయం పరిధిలో ఎక్కడ ఇటుక బెడ్డ వేసినా అక్కడకు వెళ్లి దందా చేస్తున్నట్లు భవన యజమానులు గగ్గోలు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా రహదారిపై షాపుల నిర్మాణం జరిగినా నూతనంగా షాపులు ప్రారంభించినా అక్కడ ప్రత్యక్షమైపోతున్నారట. తమకు అందిన దానిలో ఉన్నతాధికారులకు ఇవ్వాలని వారు పంపితేనే వచ్చామంటూ చెబుతూ వసూళ్లు చేస్తున్నారు.
అంతస్థుకో రేటు
నగరంలో నిర్మాణం జరుగుతున్న భవనాల స్టేజ్‌ను బట్టి మాముళ్ల వసూళ్లు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రెండవ అంతస్థుకు ఒక రేటు, మూడు, నాలుగు, ఐదు, ఆరు ఏడు అంతస్థుల్లో నిర్మిస్తే మరో రేటు వసూలు చేస్తున్నారు. కాలువపై కటితే ఇంకో రేటు, పార్కింగ్ లేకుండా సెల్లార్‌ను మూసేస్తే మరో రేటు చెబుతున్నారు.
చర్యలు శూన్యం
నగరంలో ప్లానింగ్ కార్యదర్శులపై పలుమార్లు కౌన్సిల్‌లో కార్పొరేటర్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కనీసం వారిని పిలిచి మందలించడం కూడా లేదని పలువురు కార్పొరేటర్లు చెబుతున్నారు. మంగళవారం పట్టణ ప్రణాళికా విభాగం కార్యాలయంలోకి ఏసీబీ అధికారులు సోదాలకు రావడంతో అధికారులు, సిబ్బంది షాక్ అయ్యారు.
------------------------------
ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
కీలక ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు
విజయనగరం క్రైం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థ కార్యాలయాల్లోని టౌన్ ప్లానింగు విభాగంపై మంగళవారం ఏసీబీ అధికారులు, సిబ్బంది ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో సీఐ మహేష్, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంట నుంచి ఒక్కో అంశంపై ఆరా తీశారు. టౌన్ ప్లానింగు ఏసీపీలు, టీపీఓలు, టీపీఎస్‌లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ప్లానింగు సెక్రటరీలు, కార్యాలయ సిబ్బంది, టౌన్ సర్వేయర్‌లను పిలిచారు. భవన నిర్మాణ అనుమతులపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రతి ఫైలును అనువణువూ పరిశీలించారు. నగరంలో ఏయే ప్రాంతాల్లో ఏయే భవనాలకు ఎటువంటి అనుమతులు ఇచ్చారు? నిబంధనలు పాటించారా? లేదా అన్న వాటిపై లోతుగా ఆరా తీస్తున్నారు. తనిఖీలు కొనసాగుతాయని డీఎస్పీ రమ్య తెలిపారు.