మామి‘డీలా’
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:28 PM
ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా మామిడి పూత పూసింది. ఆ పూతను చూసి రైతులు మురిసిపోయారు.
-గాలివానలకు రాలిపోతున్న కాయలు
- దిగుబడిపై తీవ్ర ప్రభావం
- నష్టాలు తప్పవంటున్న రైతులు
సాలూరు రూరల్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా మామిడి పూత పూసింది. ఆ పూతను చూసి రైతులు మురిసిపోయారు. అయితే, తేనే మంచు కారణంగా చాలా వరకూ పూత మాడిపోయింది. మిగిలి ఉన్న పూత పిందెలుగా మారగా.. తెగుళ్లతో అవి కూడా చాలావరకూ రాలిపోయాయి. ప్రస్తుతం అరకొరగా ఉన్న కాయలు సైతం అకాల వర్షాలు, ఈదురుగాలులకు రాలిపోతుండడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 35 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మన్యం జిల్లాకు సంబంధించి సాలూరు, పాచిపెంట, వీరఘట్టం, పాలకొండ, పార్వతీపురం తదితర మండలాల్లో 3 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఉమ్మడి జిల్లా నుంచి బంగినపల్లి, సువర్ణరేఖ తదితర రకాలు బిలాయి, బరంపురం, కోల్‌కతా, ఢిల్లీ, కర్ణాటక వంటి ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే, ఈ ఏడాది మామిడి చెట్లకు పెద్దగా కాయలు లేకపోవడంతో దిగుబడి పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. గతేడాది ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి రాగా, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం టన్నున్నర వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల తమకు నష్టాలు తప్పవని వాపోతున్నారు. మరోపక్క ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశాలకు మామిడి ఎగుమతులపై అనిశ్చితి ఏర్పడింది. ప్రస్తుతం పణుకుల రకాలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి టన్ను రూ.40 వేలు పలుకుతున్నాయి. ఒకపక్క దిగుబడి తగ్గడం, మరోపక్క ధరలో అనిశ్చితి వల్ల ఈ ఏడాది పెట్టుబడులు సైతం రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడులు రావు
ప్రస్తుతం మామిడి తోటల్లో కాడలు తప్ప కాయల్లేవు. గతేడాది కంటే కేవలం 40 శాతం దిగుబడి వస్తుంది. దీంతో పూత, కాయలు నిలవడానికి, తెగుళ్లు రాకుండా సస్యరక్షణకు, ఇతర పనులకు పెట్టిన పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడింది. బంగినపల్లి, సువర్ణరేఖ రకాల ధర ఎలా ఉంటుందో తెలియదు. యుద్ధ పరిస్థితులు సైతం ధరపై ప్రభావం చూపుతాయి. తోటల వల్ల ఈ ఏడాది నష్టాలే మిగిలాయి.
-కోలా ఆనంద్, మామిడిరైతు, పాచిపెంట
దిగుబడి తగ్గే అవకాశం
ఈ ఏడాది ఎకరాకు టన్నున్నర దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతేడాది 4 టన్నులు దిగుబడి వచ్చింది. వాతావరణ పరిస్థితులు వల్ల పూత రాలిపోయింది. ధర ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పలేం. మామిడి దిగుబడిని పరిశీలిస్తున్నాం.
- కె.సత్యనారాయణ రెడ్డి, ఉద్యానవన అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా