Tribal గిరిజనులకు పాడి యూనిట్లు
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:07 AM
Dairy Units for Tribal Communities గిరిజనులకు మంచి రోజులు వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత సబ్సిడీపై వారికి పశు యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సుమారు 451 మంది లబ్ధిదారులకు పాడి పశువుల యూనిట్లను మంజూరు చేయనున్నారు.
ఐటీడీఏ ద్వారా లబ్ధిదారులకు 75 శాతం సబ్సిడీ వర్తింపు
పార్వతీపురం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): గిరిజనులకు మంచి రోజులు వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత సబ్సిడీపై వారికి పశు యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సుమారు 451 మంది లబ్ధిదారులకు పాడి పశువుల యూనిట్లను మంజూరు చేయనున్నారు. ఇప్పటికే గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం, మక్కువ, పాచిపెంట, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల పరిధిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి రూ. లక్షా 30 వేల ఖరీదు చేసే పాడి పశువుల యూనిట్లను మంజూరు చేయనున్నారు. ఇందులో 25 శాతం లబ్ధిదారుని వాటా కాగా.. మిగిలిన 75 శాతం సబ్సిడీ రూపంలో అందించనున్నారు. జిల్లాలోని మొదటి దిశగా కొమరాడ మండలంలో 48 మంది, పార్వతీపురంలో 48 , సాలూరులో 48, పాచిపెంటలో 78, మక్కువలో 78 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. యూనిట్ ఖరీదులో 75 శాతం సబ్సిడీని రిలీజ్ చేయడంతో పాటు 25 శాతం లబ్ధిదారుల వాటాను వెలుగు ద్వారా రుణం కింద అందించే ప్రక్రియ పూర్తి చేశారు. రెండో దశలో మరో 151 మందిని ఎంపిక చేశారు. వీరికి సంబంధించి సబ్సిడీ సొమ్ముతో పాటు వెలుగు ద్వారా రుణాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతు న్నాయి. సుమారు రూ.ఆరు కోట్ల విలువ చేసే పాడి పశువులను పార్వతీపురం ఐటీడీఏ ద్వారా 451 మంది గిరిజన లబ్ధిదారులకు అందిం చనున్నారు. కాగా లబ్ధిదారులు ప్రతి నెలా వాయిదా పద్ధతిలో రుణం తిరిగి చెల్లించుకునే వెసులు బాటును ప్రభుత్వం కల్పించింది. ‘ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐటీడీఏ ద్వారా 451 మంది లబ్ధిదారులకు పాడి పశువుల యూనిట్లను మంజూరు చేస్తాం. పశు సంర్థకశాఖ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తే.. ఐటీడీఏ ద్వారా సబ్సిడీతో పాటు లబ్ధిదారు వాటాను వెలుగు ద్వారా రుణ రూపంలో అందిస్తాం. గిరిజన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.’ అని జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు.