Share News

Daga in branded name బ్రాండెడ్‌ పేరిట దగా

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:13 AM

Daga in branded name

Daga in branded name బ్రాండెడ్‌ పేరిట దగా
విజయనగరంలోని ఓ దుకాణంలో విక్రయానికి సిద్ధంగా బియ్యం

బ్రాండెడ్‌ పేరిట దగా

పైకి సన్న బియ్యం.. లోపల నాసిరకం

రేషన్‌ బియ్యాన్ని రీపాలిష్‌ చేసి విక్రయం

జిల్లాలో వ్యాపారుల మాయాజాలం

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

ఏడాదిన్నర కిందట విజయనగరం పీడబ్ల్యూసీ మార్కెట్‌లో బ్రాండెడ్‌ బియ్యం పేరిట నాసిరకం బియ్యాన్ని అమ్ముతుండడాన్ని అధికారులే స్వయంగా గుర్తించారు. అప్పట్లో 17 వేల కిలోల బియ్యాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు వ్యాపారులు భయపడ్డారు. ఇప్పుడు మళ్లీ అదే తీరు. నాసిరకం బియ్యాన్ని బ్రాండెడ్‌ బియ్యం బస్తాల్లో నింపి విక్రయాలు జరుపుతున్నారు. దొరికితే దొంగ.. దొరకకపోతే దొర అన్నట్టుంది ఈ బియ్యం మాఫియా వ్యవహారం. జిల్లాలో చాలా చోట్ల ఈ దందా కొనసాగుతోంది. ప్రజలు మోసపోతూనే ఉన్నారు.

విజయనగరం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో 10 లక్షల కుటుంబాలు సన్నబియ్యం వినియోగిస్తున్నట్టు అంచనా. నెలకు సగటున 12 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. పేదలకు ఆహారం అందించాలని ప్రభుత్వం చౌక ధరల దుకాణం ద్వారా రేషన్‌ బియ్యం అందిస్తోంది కానీ ఆ బియ్యాన్ని తింటోంది 10 శాతం ప్రజలే. వ్యవసాయ భూములు లేనివారు, నిరుపేదలు మాత్రమే రేషన్‌ బియ్యం తింటున్నారు. మిగతా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు బియ్యాన్ని బయట మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా మార్చుకొని సన్నబియ్యం పేరిట ముదక బియ్యాన్ని అంటగట్టి కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్‌లో పేరుమోసిన బ్రాండ్ల పేరుతో ఉన్న సంచుల్లో బియ్యాన్ని నింపి విక్రయిస్తున్నారు. అది మోసమని గుర్తించలేకపోతున్న ప్రజలు వాటినే వినియోగిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ రేషన్‌ బియ్యాన్ని సేకరించే చిరు వ్యాపారుల వద్ద పెద్ద వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని కొని రీపాలిష్‌ చేస్తున్నారు. స్టీమ్‌లైజ్‌ యంత్రాలతో సన్నబియ్యంగా మార్చేసి.. పేరుమోసిన బ్రాండెడ్‌ బ్యాగుల్లో నింపేసి విక్రయిస్తున్నారు. రూ.500 పెట్టి కొనుగోలు చేసిన బియ్యాన్ని రీపాలిష్‌ చేసి. రూ.1000కుపైగా అందిస్తున్నారు. అంటే శతశాతం లాభమన్నమాట.

లాభసాటి వ్యాపారంగా..

సన్నబియ్యం ధరలు జిల్లాలో పరుగులుపెడుతున్నాయి. 26 కిలోల బస్తా రూ.1400, రూ.1500, రూ.1600గా ఉన్నాయి. సాధారణంగా పాత ధాన్యం మిల్లింగ్‌ చేసిన బియ్యం ఎంతో బాగుంటాయి. తినేందుకు సౌకర్యంగా ఉంటాయి కానీ ఎక్కువ మంది సన్నబియ్యం తినేందుకు ఇష్టపడుతున్నారు. ప్రజల ఆసక్తిని వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. రేషన్‌బియ్యాన్ని రీ పాలిష్‌ చేసి వాటినే అందంగా ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఇదో లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. పుట్టగొడుగుల్లా రైస్‌స్టోర్లు సైతం వెలుస్తున్నాయి. రైస్‌ డిపోల ఏర్పాటుకు ప్యాకేజ్డ్‌ కమోడిటీస్‌ యాక్టు కింద తప్పనిసరిగా తూనికలు, కొలతల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. బియ్యం సంచులపై బ్రాండ్‌ పేరు, ఎన్ని కిలోలు, ఎమ్మార్పీ, తయారీ సంస్థ, చిరునామా, ప్యాకింగ్‌ తేదీ, ఫోన్‌ నంబరు తప్పనిసరిగా వేయాలి. బియ్యం అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం పన్ను విధించిన నేపథ్యంలో తప్పనిసరిగా జీఎస్టీ లైసెన్స్‌ తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలను వ్యాపారులు అనుసరించడం లేదు. ఉమ్మడి జిల్లాలో వందల రైస్‌ డిపోలు ఉండగా.. ఇలా అనుమతులు పొందినవి వేళ్లతో లెక్కపెట్టవచ్చు.

ఇలా గుర్తించవచ్చు

నాణ్యత తక్కువగా ఉన్న బియ్యం పాతవే అయినప్పటికీ వండితే మాత్రం అన్నం ముద్దగా మారిపోతుంది. మెతుకు ఒకవైపు పగులుగా మారి.. వండిన కొన్ని గంటలకే చెడిపోతుంది. స్టీం బియ్యం అయితే వండిన తరువాత ఎనిమిది గంటలు దాటితే అన్నం అడుగు భాగంలో పదును ప్రారంభం అవుతుంది. కొత్త బియ్యాన్ని పాత బియ్యంగా మారిస్తే ఎదుగుదల తక్కువగా ఉంటుంది. పాత బియ్యం కిలో వండితే ఎనిమిది మంది వరకూ తినే అవకాశం ఉంటుంది. కొత్త బియ్యంలో నాణ్యత లేనివి 5 కిలోలు వండితే ఐదుగురు తినేందుకు కూడా చాలదు.

Updated Date - Jan 29 , 2026 | 12:13 AM