Share News

Cyclone Tension తుఫాన్‌ టెన్షన్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:22 AM

Cyclone Tension ఆర్నబ్‌ తుఫాన్‌ హెచ్చరికలతో రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది. వరి పంట పొట్టదశలోకి వచ్చిన తరుణంలో తీవ్ర గాలులు వీస్తే నష్టమొస్తుందని ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు వరితో పాటు ఉద్యాన పంటలను ఆశాజనకంగా సాగు చేశారు.

Cyclone Tension తుఫాన్‌ టెన్షన్‌
చింతపల్లిలో తీరంలో లంగరు వేసిన పడవలు

తుఫాన్‌ టెన్షన్‌

రైతుల్లో కలవరం

పొట్ట దశలో వరి పంట

ఈదురుగాలులు వీస్తే తీవ్ర నష్టమంటున్న అన్నదాతలు

గజపతినగరం, అక్టోబరు26 (ఆంధ్రజ్యోతి):

ఆర్నబ్‌ తుఫాన్‌ హెచ్చరికలతో రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది. వరి పంట పొట్టదశలోకి వచ్చిన తరుణంలో తీవ్ర గాలులు వీస్తే నష్టమొస్తుందని ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు వరితో పాటు ఉద్యాన పంటలను ఆశాజనకంగా సాగు చేశారు. ఆ వర్షాలు పంటలకు మేలు చేశాయి. కానీ ఇప్పుడొస్తున్న తుఫాన్‌ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తీవ్ర గాలులు వీస్తే పొట్ట దశలో ఉన్న వరికి ముప్పు అని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో సుమారు 80వేల హెక్టార్లలో వరి పంట సాగులో ఉంది. పంట పొట్టదశకు రావడంతో మరో నెల రోజుల్లో కోతలు ప్రారంభించేందుకు రైతులు సిద్ధం కావాలనుకుంటున్నారు. గాలులకు పంట నేలకొరిగితే ధాన్యం నాణ్యత దెబ్బతిని, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక పోవడంతో ఈఏడాది ఖరీఫ్‌ ప్రారంభం నుంచే రైతులు కష్టాలు చూస్తూ వస్తున్నారు. పొలానికి నీరు పెట్టడం నుంచి ఎరువులు, పురుగు మందుల వినియోగం ఇలా ప్రతీ దశలోనూ వ్యవప్రయాసలకు గురయ్యారు. పంట చేతికి వస్తే రుణభారం తీర్చుకొని కుటుంబ అవసరాలను గట్టెక్కించుకోవచ్చునని ఆశ పడ్డ రైతులు తుఫాన్‌తో కలవరపడుతున్నారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఆర్నబ్‌ తుఫాన్‌ కారణంగా రెండు రోజులు పాటు భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. వరి పంటకు సంబంధించి పొలాల్లో నీరు నిలువ ఉండకుండా చూడాలి. గట్లు తెంచి నీరు బయటకు పోయేలా చూసుకోవాలి. పత్తి పంట పట్ల రైతులు జాగ్రత ్తవహించాలి. ఇంతవరకు పండిన పత్తిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి.

- శ్రీనివాస్‌, ఏడీఏ, గజపతినగరం

-----------------------

వేటకు వెళ్లవద్దని ఆదేశాలు

పూసపాటిరేగ/ భోగాపురం, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): ఆర్నాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో మత్స్యకారులెవ్వరూ చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. ప్రతిగ్రామంలో దండోరా కూడా వేయించారు. రెండురోజులపాటు ఇళ్లలోంచి బయటకు రావొద్దని కోరారు. తీరప్రాంత గ్రామాలతోపాటు ముంపునకు అవకాశం ఉండే ప్రాంతాల్లోనూ అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సోమవారం భోగాపురం తహసీల్దార్‌ పి.రమేష్‌ తీర ప్రాంత గ్రామాల్లోకి వెళ్లి సముద్రంపైకి ఎవరూ వేటకెళ్లరాదని హెచ్చరించారు. మరోవైపు మత్స్యకారులు పడవలు, వలలు, వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించుకొంటున్నారు. చాలా వరకు ఇంజన్‌ పడవలు ఉండడంతో ఇంజన్లను తొలగించి గృహాలకు చేర్చుకొంటున్నారు. కాగా తుఫాన్‌ వచ్చిందంటే చాలు మత్స్యకారుల జీవనం అయోమయంగా మారుతుందని వారంతా వాపోతున్నారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో చేపలవేటపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మంది వరకు బతుకుతున్నారు. అత్యవసర సమయాల్లో మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భోగాపురం మండలంలో ఐదు పునరావాస కేంద్రాలను గుర్తించి సిద్ధం చేశారు.

-----------------

ముంచుకొస్తున్న తుఫాన్‌

రానున్న రెండు రోజుల్లో అతిభారీ వర్షాలకు అవకాశం

100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

విద్యా సంస్థలకు నేడు, రేపు సెలవు

కంట్రోల్‌ రూం ఏర్పాటు

జిల్లాకు రూ.కోటి కేటాయించిన ప్రభుత్వం

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ వస్తోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ కేంద్రం ఆదేశాలతో జిల్లా అధికారులు అలెర్ట్‌ అయ్యారు. అన్నదాతలకు సూచనలు ఇచ్చారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేశారు. పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. మరోవైపు తుఫాన్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కోటి రూపాయలను జిల్లాకు కేటాయించింది. ఈ నిధులను మంచి నీటి సరఫరా, పునరావాస కేంద్రాల ఏర్పాటు, వైద్య శిబిరాల ఏర్పాటు, పారిశుధ్య పనుల కోసం కేటాయించాలి. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, చెరువులకు గండ్లు పూడ్చడానికి కూడా కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 నుంచి తుఫాన్‌ ప్రభావంతో ఈదురుగాలులతోపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనిపై కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి జిల్లా అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు.

- తుఫాన్‌ వల్ల జిల్లాలో రెండు రోజుల్లో 30 సెంటమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు.

- ఆర్నబ్‌ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు కంట్రోల్‌ రూంలు ఏర్పాటుచేశారు. కలెక్టరేట్‌లో 08922-236947, విజయనగరం ఆర్‌డీవో కార్యాలయంలో 7997081549, బొబ్బిలి ఆర్‌డీవో కార్యాలయంలో 8179624212, చీపురుపల్లి ఆర్‌డీవో కార్యాలయంలో 9701641979, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో (విజయనగరం) 9849906486, బొబ్బిలి మున్సిపాల్టీలో 994661120, రాజాం మున్సిపాల్టీలో 08941251016,నెల్లిమర్ల నగర పంచాయతీలో 08922-244248 నంబర్లతో కంట్రోల్‌ రూంలు నడుస్తాయి.

ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకూడదు

అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలి. అన్ని శాఖలూ ముందస్తు చర్యలు చేపట్టాలి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలి. అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలి. తాగునీటికి ఇబ్బంది లేకుండా మంచినీటి ట్యాంకులు సిద్ధం చేయాలి. ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులను ముందుగానే ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాలి. సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో ఉండాలి.

ఎస్‌.రామసుందర్‌ రెడ్డి, కలెక్టర్‌

కోతలను వాయిదా వేసుకోవాలి

వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న చోట్ల రైతులు వాయిదా వేసుకోవాలి. నీరు నిల్వ లేకుండా డ్రైనేజీ సదుపాయం కల్పించుకోవాలి. అధిక నీరంతా బయటకు పోయేలా చూడాలి. పురుగు ముందు పిచికారీ, ఎరువులు వేయడాన్ని వాయిదా వేసుకోవాలి.

ఎం.రామారావు, జేడీ, వ్యవసాయ శాఖ

Updated Date - Oct 27 , 2026 | 12:22 AM