తుఫాన్ గుబులు
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:46 PM
Cyclone Fears అక్వాన్ ప్రభావంతో బుధవారం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమైంది. అంతటా గాలులు మొదలయ్యాయి. తుఫాన్ ప్రభావంతో మన్యంలో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆకాశం మేఘావృతం.. మొదలైన గాలులు.. ఆందోళనలో రైతులు
పంటలను కాపాడుకునేందుకు అవస్థలు
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
పార్వతీపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అక్వాన్ ప్రభావంతో బుధవారం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమైంది. అంతటా గాలులు మొదలయ్యాయి. తుఫాన్ ప్రభావంతో మన్యంలో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికందొచ్చిన వరి, ఇతర పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వరి పంట కోతదశకు వచ్చిన సమయంలో తీవ్ర గాలులు వీస్తే నష్టమొస్తుందని ఆందోళన చెందుతున్నారు. దేవుడిపై భారం వేస్తున్నారు. ఇటీవల ఆర్నబ్, మురసు తుఫాన్‌లకు వరితోపాటు ఉద్యానపంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. మరోసారి తీవ్రంగా గాలులు వీస్తే వరి పంట నేలకొరిగే ప్రమాదం ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో సుమారు 80 వేల హెక్టార్లలో పంట చివరి దశకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు మొదలు పెట్టగా మరికొన్ని ప్రాంతాల్లో కోతలకు వెనకడుగు వేస్తున్నారు. కూలీలు దొరక్కపోవడం ఒక కారణం కాగా కోతల మధ్యలో వర్షం కురిస్తే వరి పనలు నానిపోతాయనేది వారి ఆందోళన. అక్వాన్ తుఫాన్‌పై వ్యవసాయ అధికారులు స్పందించి రైతులకు సూచనలు ఇస్తున్నారు. కోతలు పూర్తి చేసిన చోట్ల పంటను తక్షణమే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని.. ఎత్తయిన ప్రదేశంలో వరి కుప్పలు పెట్టి టార్పాలిన్లు కప్పాలని.. పంట పొలంలో నీరు నిలువకుండా కాలువ తీసి బయటకు పంపాలని సూచిస్తున్నారు.
అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలి: ఇన్‌చార్జి జేసీ
తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేదుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ వైశాలి అదేశించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. తుఫాన్ సన్నద్ధత, సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లపై సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస కేంద్రాల్లో భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. గర్భిణులు, డయాలసిస్ రోగులకు ముందస్తు వైద్య ఏర్పాట్లు చేయాలన్నారు. అరటి, కొబ్బరి, జీడిపంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్, తాగునీరు, వైద్య సేవలకు అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. తుఫాన్ సమయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలని జేసీ స్పష్టం చేశారు.
- కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ వైశాలి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ వల్ల ఏ సమస్య వచ్చినా జిల్లావాసులు ఈ 08963 450347 నెంబర్‌కు ఫోన్‌చేయొచ్చన్నారు.
పత్తి ఏరివేతలో నిమగ్నమైన రైతులు
భామిని: వాతావరణం మార్పుతో పత్తి రైతులు దిగులు చెందుతున్నారు. పంట నష్టపోకుండా.. ఆదరాబాదరాగా పత్తి ఏరుతున్నారు. ఆర్నాబ్ తుఫాన్ వల్ల కొంతమేర పత్తి పంట దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ వర్షం కురిస్తే చేతికందిన పత్తి పూర్తిగా నాశనమవుతుందని రైతులు వాపోతున్నారు. ఇతర గ్రామాల నుంచి కూలీలను రప్పించి.. పత్తిని ఏరి ఇళ్లకు తరలిస్తున్నారు.
వీఆర్‌ఎస్ నుంచి 300 క్యూసెక్కులు విడుదల
మక్కువ: వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం వీఆర్‌ఎస్ పూర్తిస్థాయి నీటిమట్టం 161 మీటర్లు కాగా బుధవారం 160.22 మీటర్లకు నీటి నిల్వలు చేరుకున్నాయి. మరోవైపు అక్వాన్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టులో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం అధికారులు వీఆర్‌ఎస్ స్పిల్‌వే గేట్లు ద్వారా 300 క్యూసెక్యులను సువర్ణముఖి నదిలోకి విడిచిపెట్టారు.