Cyclone దూసుకొస్తున్న తుఫాన్
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:18 AM
Cyclone Approaching జిల్లాకు ఆర్నాబ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూంలకు ఫోన్ చేయాలని సూచించారు.
నేడు, రేపు పాఠశాలలకు సెలవు
ఈదురుగాలులు వీస్తే వరికి తీవ్ర నష్టమంటున్న రైతులు
పార్వతీపురం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు ఆర్నాబ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూంలకు ఫోన్ చేయాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పనడిన తీవ్ర వాయుగుండం.. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా, సాయంత్రానికి అతి తీవ్ర తుఫాన్‌గా మారనుందని వెల్లడించారు. జిల్లావాసులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా తుఫాన్ కారణంగా జిల్లాలో పాఠశాలలకు ఈ నెల 27, 28వ తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్టు డీఈవో బ్రహ్మాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
రైతుల్లో కలవరం
ఆర్నబ్ తుఫాన్ హెచ్చరికలతో రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది. వరి పంట పొట్టదశలోకి వచ్చిన తరుణంలో తీవ్ర గాలులు వీస్తే నష్టమొస్తుందని ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు వరితో పాటు ఉద్యాన పంటలను ఆశాజనకంగా సాగు చేశారు. ఆ వర్షాలు పంటలకు మేలు చేశాయి. కానీ ఇప్పుడొస్తున్న తుఫాన్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తీవ్ర గాలులు వీస్తే పొట్ట దశలో ఉన్న వరికి ముప్పు అని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో సుమారు 72 వేల హెక్టార్లలో వరి పంట సాగులో ఉంది. పంట పొట్టదశకు రావడంతో మరో నెల రోజుల్లో కోతలు ప్రారంభించేందుకు రైతులు సిద్ధం కావాలనుకుంటున్నారు. గాలులకు పంట నేలకొరిగితే ధాన్యం నాణ్యత దెబ్బతిని, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక పోవడంతో ఈఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచే రైతులు కష్టాలు చూస్తూ వస్తున్నారు. పొలానికి నీరు పెట్టడం నుంచి ఎరువులు, పురుగు మందుల వినియోగం ఇలా ప్రతీ దశలోనూ వ్యవప్రయాసలకు గురయ్యారు. పంట చేతికి వస్తే రుణభారం తీర్చుకొని కుటుంబ అవసరాలను గట్టెక్కించుకోవచ్చునని ఆశ పడ్డ రైతులు తుఫాన్‌తో కలవరపడుతున్నారు.
- భామిని: సాగునీరు లేక భామిని తదితర మండలాల్లో ఎండుతున్న 2వేల ఎకరాల్లో వరి పంటకు మాత్రం ఈ వర్షాలు ఊపిరిపోయనున్నాయి. ఆర్నాబ్ తుఫాన్‌తో వర్షాధార పంటలకు ఊరట లభిస్తుందని పలువురు రైతులు భావిస్తున్నారు.