Share News

‘కట్‌’కటా

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:09 AM

ఎల్‌నినో ప్రభావం విద్యుత్‌ సరఫరాపై కూడా పడింది. వేసవిని తలపించేలా ఎండలు మండుతుండటంతో వేళాపాళా లేకుండా అధికారులు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు.

‘కట్‌’కటా
పార్వతీపురం సబ్‌స్టేషన్‌ వద్ద మరమ్మతులు చేపడుతున్న సిబ్బంది

- జిల్లాలో పెరిగిన విద్యుత్‌ వినియోగం

- ఈఎల్‌ఆర్‌ పేరిట తరచూ కోతలు

- అవస్థలు పడుతున్న ప్రజలు

పార్వతీపురం/గరుగుబిల్లి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం విద్యుత్‌ సరఫరాపై కూడా పడింది. వేసవిని తలపించేలా ఎండలు మండుతుండటంతో వేళాపాళా లేకుండా అధికారులు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. విద్యుత్‌ కేంద్రాల్లో సరఫరా సామర్థ్యం తగ్గడంతో కోతలు విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత కొన్నిరోజులుగా పగటి ఉష్ణోగత్రలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రభావంతో కూలర్లు, ఫ్రిజ్‌లు, ఏసీల వినియోగం తప్పనిసరైంది. దీంతో చాలా కుటుంబాల్లో పరిమితికి మించిన కరెంట్‌ అవసరం పడుతోంది. చేసేది లేక అధికారులు ఈఎల్‌ఆర్‌ పేరిట సరఫరాను నిలిపేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఫళంగా విద్యుత్‌ వినియోగం పెరిగి సబ్‌స్టేషన్‌న్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ట్రిప్‌ అవుతోంది. దీంతో విద్యుత్‌ కోతలు తప్పనిసరి అవుతున్నాయని అధికారుల చెబుతున్నారు. ఇదేపరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో కరెంట్‌ వేళలు తగ్గిపోతాయని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో సుమారు 3 గంటల పాటు ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌)ను అమలు చేస్తున్నారు. పగలు సైతం కోతలు విధిస్తున్నారు. విద్యుత్‌ సరఫరా అంతంతమాత్రంగానే ఉండడంతో తమ వ్యాపారాలు సాగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఒకపక్క ఉక్కబోత, మరోపక్క విద్యుత్‌ కోతలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది. జిల్లాకు వంద మెగా వాట్స్‌ విద్యుత్‌ సరఫరా అవసరం. కానీ ఆ స్థాయిలో విద్యుత్‌ సరఫరా జరగడం లేదు. సప్లయ్‌ కంటే డిమాండ్‌ అధికంగా ఉండంతో ఈఎల్‌ఆర్‌ పేరిట సరఫరాను నిలిపి వేస్తున్నారు. అదనంగా విద్యుత్‌ సరఫరా లేకుంటే కరెంట్‌ సమస్యలు తప్పవు.

విద్యుత్‌ ఉత్పత్తి తగ్గుతుంది

వాతావరణ మార్పుల కారణంగా పవన, జల విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. డిమాండ్‌ను తట్టుకునేందుకు పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేశాం. రాత్రి సమయాల్లో గ్రిడ్‌ ప్రీక్వెన్సీ వేగంగా తగ్గుతుంది. కుప్పకూలకుండా ఉండేందుకు అత్యవసర పరిస్థితుల్లో గృహాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపేయాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేద్దామన్నా తగినంత విద్యుత్‌ లభ్యత కావడంలేదు. గ్రామాల్లో విద్యుత్‌ వినియోగాన్ని పొదుపు చేసుకోవాలి. సమస్య పరిష్కారానికి విద్యుత్‌ సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. అంతరాయానికై ప్రజలు సహకరించాలి.

-పి.త్రినాథరావు, ఎస్‌ఈ, విద్యుత్‌శాఖ, పార్వతీపురం

Updated Date - Sep 07 , 2026 | 12:09 AM