curraption in house sites పేదల ఇళ్లు నిల్... పెద్దల జేబులు ఫుల్
ABN , Publish Date - May 04 , 2026 | 12:00 AM
curraption in house sites వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూములు కొనుగోలు చేసిన వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. అక్కడి భూమి ధరకు మించి చెల్లింపులు చేశారు. భూములు ఇచ్చిన రైతులకు సగం సొమ్మునే అందించారు.
పేదల ఇళ్లు నిల్... పెద్దల జేబులు ఫుల్
జగనన్న కాలనీల్లో భూముల కొనుగోలులో అవినీతి
కొండకరకాంలో విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలు
111 మంది నుంచి తిరిగి రూ.2.44 కోట్లు వసూలు
అప్పటి కీలక నేతల అనుచరులే సూత్రధారులు
ప్రభుత్వానికి అందిన విజిలెన్స్ విచారణ నివేదిక
నేటికీ కానరాని ఇళ్ల నిర్మాణం
వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూములు కొనుగోలు చేసిన వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. అక్కడి భూమి ధరకు మించి చెల్లింపులు చేశారు. భూములు ఇచ్చిన రైతులకు సగం సొమ్మునే అందించారు. మిగతాది నేతలు తమ జేబులో వేసుకున్నారు. ఇక లేఅవుట్లలో అభివృద్ధి, చదును పేరుతో మరికొంత సొమ్మును నొక్కేశారు. ఇంత జరిగినా అక్కడ ఇళ్లు మాత్రం నిర్మాణం కాలేదు. పేదలు ఆసక్తి చూపలేదు. విజయనగరం సమీప కొండకరకాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం తన విచారణ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
విజయనగరం, మే 3 (ఆంధ్రజ్యోతి):
వైసీపీ హయాంలో నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్ల పథకం అమలుచేశారు. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో.. ఊరికి దూరంగా, శ్మశానవాటికలు, కొండలు, గుట్టలు చెంత లేఅవుట్లు వేశారు. అక్కడున్న భూమి ధరకు మించి చెల్లింపులు చేశారు. భూములు విక్రయించిన రైతులకు సగం సొమ్మునే అందించారు. మిగతాది నేతలు తమ జేబులో వేసుకున్నారు. ఇక పేరుకే ఇంటిస్థలం, లేఅవుట్. పేదలు ఇళ్లు మాత్రం నిర్మించుకోలేదు. వైసీపీ నేతల జేబులైతే నిండాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ దర్యాప్తు పూర్తయ్యింది. విచారణ నివేదిక ప్రభుత్వానికి అందింది. ఇక ప్రభుత్వ చర్యలే తరువాయి.
జిల్లాకు సంబంధించి చాలా సంచలన అంశాలు విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 812 జగనన్న లేఅవుట్లు ఏర్పాటుచేశారు. 1021.83 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. డీపట్టా భూమి 599 ఎకరాలు, ప్రైవేటు భూమి 37.33 ఎకరాలు సేకరించారు. ఇందులో విజయనగరం మండలం కొండకరకాంలో 70 ఎకరాలను జగనన్న లేఅవుట్ కోసం కేటాయించారు. ఇదంతా డిపట్టా భూమి. 111 మందికి ఎకరా రూ.34.65 లక్షలు చొప్పున చెల్లించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తల ఖాతాల్లో నగదును అప్పట్లో వేయించుకున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని సమాచారం. అప్పట్లో వైసీపీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి అనుచరులు వీరు. భూములపై ఎక్కువ పరిహారం ఇప్పించామని అప్పటి డిపట్టాదారుల నుంచి 15 నుంచి 20 శాతం పరిహారాన్ని తిరిగి లాగేసుకున్నట్టు విజిలెన్స్ విచారణలో స్వయంగా బాధితులు చెప్పినట్టు తెలుస్తోంది.
- డిపట్టాదారులకు పలు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నప్పటికీ ప్రైవేటు బ్యాంకులో కొత్తగా అకౌంట్లు తీయించారు. బ్యాంకు పాసు పుస్తకాలన్నీ స్థానిక నేతల వద్దే ఉంచుకున్నారు. పరిహారం జమైన తరువాత బ్యాంక్ విత్ డ్రా ఓచర్లను తెప్పించి రైతుల సంతకం చేయించి రూ.3.11 లక్షలు చొప్పున తీసుకున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఎందుకని అడిగితే అధికారులకు ఇవ్వాలి కదా అంటూ చెప్పారట. దీంతో భయంతో డీపట్టాదారులు సంతకం చేసినట్టు తెలుస్తోంది.
అధికారుల సహకారం..
కొండకరకాం లేఅవుట్‌కు సంబంధించి అడుగడుగునా అవకతవకలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో వీఆర్వో, ఆర్‌ఐ బాగా సహకరించినట్టు ఆరోపణలున్నాయి. కీలక సూత్రధారిగా మరో వ్యక్తి వ్యవహరించినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు డీపట్టాదారుల బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. రూ.2.44 కోట్లకుపైగా మింగేశారని తేల్చారు. డిపట్టా భూముల కొనుగోలు, చెల్లింపుల విషయంలో డివిజనల్ స్థాయి అధికారులు కనీస నిబంధనలు పాటించలేదని విజిలెన్స్ విచారణలో తేలింది.
- రేగాన రామప్పడు నుంచి రూ.6.60 లక్షలు, లక్కిడాపు రాములప్పడు నుంచి రూ.1.14 లక్షలు, వి.లక్ష్మి నుంచి రూ.10.80 లక్షలు తిరిగి తీసుకున్నట్టు తేలింది. భూ సమస్య పరిష్కరించామని చెప్పి కిడారి అప్పలనాయుడు, బన్నెన రాముల నుంచి మూడు విడతల్లో రూ.14.55 లక్షలు, రూ.21.82 లక్షలు, రూ.4.36 లక్షలు తీసుకున్నారు. అలాగే కె.ప్రసాద్ నుంచి రూ.17 లక్షలు, లక్కిడాపు లక్ష్మి రూ.14.55 లక్షలు, ఉప్పాడ ఆదిలక్ష్మి రూ.1.88 లక్షలు, పాతూరు సూరమ్మ రూ.1.88 లక్షలు, ఎల్.ఎల్లమ్మ రూ.1.70 లక్షలు.. ఇలా 110 మంది నుంచి రూ.2.44 కోట్లు తిరిగి తీసుకున్నారు.