Cultivation of Wealth గిరిశిఖరాల్లో సిరుల సేద్యం
ABN , Publish Date - Sep 28 , 2026 | 10:53 PM
Cultivation of Wealth in the Hilltops గిరిశిఖర గ్రామాల్లో జీవనం.. బండ రాళ్ల మధ్య వ్యవసాయం.. సరైన సాగు పరికరాలు లేవు. ఆధునిక సేద్య పద్ధతులు తెలియవు. అయినా తమదైన శైలిలో ఎన్నో రకాల పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సాలూరు మండల గిరిజన రైతులు. కొండ కోనలు, వాగుల నుంచి వచ్చే నీరే వారికి ఆధారం. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సాగు చేపడుతూ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
వరితో పాటు మొక్కజొన్న, చిరుధాన్యాల సాగు
సంప్రదాయ పద్ధతులనే నమ్ముకున్న గిరిజన రైతులు
ఎలాంటి ఎరువులు లేకుండా వ్యవసాయం
ఆరుగాలం శ్రమిస్తున్నా దక్కని ఫలితం
మార్కెట్ సదుపాయం లేక .. గిట్టుబాటు ధర పొందలేక..
దళారుల దోపిడీతో ఏటా నష్టపోతున్న వైనం
పట్టించుకోని అధికారులు
సాలూరు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల్లో జీవనం.. బండ రాళ్ల మధ్య వ్యవసాయం.. సరైన సాగు పరికరాలు లేవు. ఆధునిక సేద్య పద్ధతులు తెలియవు. అయినా తమదైన శైలిలో ఎన్నో రకాల పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సాలూరు మండల గిరిజన రైతులు. కొండ కోనలు, వాగుల నుంచి వచ్చే నీరే వారికి ఆధారం. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సాగు చేపడుతూ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. డెన్సరాయి, గంజాయిభధ్ర, కొదమ, సంపంగిపాడు, పట్టుచెన్నారు, పగులు చెన్నారు, జిల్లేడువలస, కరడువలస, కురుకూటి, సారిక, తోణాం తదితర పంచాయతీల్లో వందకు పైగా గ్రామాలు కొండలపైనే ఉన్నాయి. ఆయా గ్రామాల్లో అనేక మంది రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో సైతం సాధ్యం కాని విధంగా పెద్ద పెద్ద బండరాళ్లు, కంకర గుట్టల మధ్యలో సహజసిద్ధంగా పసుపును పండిస్తున్నారు. చిరు ధాన్యాల సాగులోనూ వారికి వారే సాటి. వరితో పాటు రాగులు, సజ్జలు, కొర్రలు, మొక్కజొన్న తదితర వాటిని పండిస్తున్నారు.
శ్రమకు దక్కని ఫలితం
- గిరిజన రైతులు ఆరుగాలం ఎంతో కష్టపడి పండిస్తున్న పంటలకు మార్కెట్ సదుపాయం ఉండడం లేదు. పంటలతో కొండ దిగి సమీప సంతలకు చేరుకుంటున్న వారు దళారుల దోపిడీకి గురవుతున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో కొంత మొత్తం నగదు, విత్తనాలతో పాటు ఇతర సామగ్రి ఇస్తూ.. పంట ఎలా ఉన్నా తమకే ఇవ్వాలని దళారులు ముందస్తుగా ఒప్పందం చేసు కుంటున్నారు. తీరా పంట చేతికొచ్చాక.. గిరిజన రైతులకు నామమాత్రం చెల్లించి.. మొత్తం దోచేస్తున్నారు. దీంతో గిరిజనుల శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి.
- వాస్తవంగా గిరిజన రైతులు సహజసిద్ధంగా పండించే పంటలకు మైదాన ప్రాంతాల్లో మంచి గిరాకీ ఉంటుంది. అయితే దీనిపై జీసీసీ, ఐటీడీఏ అధికారులు దృష్టి సారించడం లేదు. గిరిజన రైతులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించి.. వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ఫలితంగా కొండ శిఖర గ్రామాలకు చెందిన రైతులు ఏటా దళారుల చేతుల్లో నష్టపోతున్నారు. వేరే దారి లేక దళారుల చెప్పిన రేట్లకే తమ పంటలను విక్రయించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు.
- దీనిపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని వివరణ కోరగా.. ‘గిరిశిఖర గ్రామాల్లో గిరిజన రైతుల సమస్యలు వినతులు రూపంలో ప్రభుత్వానికి తెలుస్తున్నాయి. వారిని ఆదుకునేలా చర్యలు తీసుకుంటాం. గతంలో ఎన్నడూ లేని గిరిజనులకు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పఽథకాలను అందిస్తుంది. గిరిశిఖర గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తాం. రోడ్లతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తాం’ అని తెలిపారు. ‘గిరిజన రైతులకు అన్ని రకాల రాయితీలను అందిస్తున్నాం. పోడు సాగుకు సంబంధించి గిరి భూమి పోర్టల్‌లో ఆ భూమి వివరాలు నమోదై ఉంటేనే 90 శాతం రాయితీ విత్తనాలు అందిస్తాం. ఎరువులు, పురుగుల మందులు కూడా అందజేస్తాం. మండలంలో డి.వెలగవలస తప్ప అన్ని గ్రామాల్లో గిరిజన రైతులకు వ్యవసాయ, ఐటీడీఏ ద్వారా సేవలు అందిస్తున్నాం. వ్యవసాయ పనిముట్లుకు వచ్చిన దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపించాం’ అని మండల వ్యవసాయాధికారి శిరీష తెలిపారు.