Share News

సాగు 45 శాతమే

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:09 PM

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఖరీఫ్‌ పనులు ముందుకు సాగడం లేదు. ఆగస్టు పూర్తవుతున్నా ఇంకా 45 శాతమే ఖరీఫ్‌ సాగు జరిగింది.

సాగు 45 శాతమే
బొబ్బిలి రూరల్‌: పిరిడిలో వరి నాట్లు వేయని పొలం

- ఆగస్టు పూర్తయినా సాగని వ్యవసాయ పనులు

-జిల్లాలో 45.83శాతం లోటు వర్షపాతం

- కొన్నిచోట్ల ఎండిపోతున్న నారు

- మరికొన్ని ప్రాంతాల్లో ముదిరిపోతున్న వైనం

- ఖరీఫ్‌పై ఆశలు వదలుకున్న రైతులు

గజపతినగరం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఖరీఫ్‌ పనులు ముందుకు సాగడం లేదు. ఆగస్టు పూర్తవుతున్నా ఇంకా 45 శాతమే ఖరీఫ్‌ సాగు జరిగింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒకపక్క నాట్లు వేసుకునేందుకు నీరు లేక, మరొపక్క ఎండుతున్న వరి నారు, ఎదలను కాపాడుకోలేక తల్లడిల్లుతు న్నారు. నారు కూడా ముదిరిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది లక్షా 250 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా, ఇంతవరకు 46వేల హెక్టార్లలో మాత్రమే సాగు అయినట్లు అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్న 11,315 హెక్టార్లకు గాను 7,745హెక్టార్లలో, పత్తి 2,214 హెక్లార్లకు 2 వేల హెక్టార్లలో సాగు చేపట్టారు. బోరు బావులు, సోలార్‌ మోటార్లు వంటి సదుపాయాలు ఉన్న చోట వరి నాట్లు పడ్డాయి. ఇప్పటికే నాట్లు పూర్తి కావాల్సి ఉన్నప్ప టికీ కేవలం 45శాతం మాత్రమే పడ్డాయి. గజపతినగరం మండలంలో 3,691 హెక్టార్లలో, బొండపల్లి 2,558, దత్తిరాజేరు 3203, మెంటాడ 3422 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా అన్నిచోట్ల కలిపి కేవలం 1615హెక్టార్లలో సాగు జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో సుమారు 45.83 శాతం లోటు వర్షపాతం ఉంది. ఒకపక్క వర్షాలు కురవక, మరొపక్క ఎండల తీవ్రతకు వరి ఎదలు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల నారు కూడా చనిపో తుంది. మరికొన్ని గ్రామాల్లో నారు ముది రిపోతుంది. దీంతో ఉబాలకు పనికి రాకుం డా పోతుందని రైతులు వాపోతున్నారు. ఒక వేళ వర్షాలు అనుకూలించినా నారు ముదిరిపోవడంతో నాట్లువేయలేని పరిస్థితి నెలకొంది. గజపతినగరం, బొండపల్లి దత్తి రాజేరు, మెంటాడను కరువు మండలాలు గా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

రైతులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన ఆదుకోవాలి. వరి సాగు కోసం ఇప్పటికే ఎకరాకు రూ.5వేలు ఖర్చు చేశారు. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. రుణాలు మాఫీ చేయడంతో పాటు కొత్త రుణాలు మంజూరు చేయాలి. తేలిక పాటి పంటలకు సంబందించి విత్తనాలు అందజేయాలి. కౌలు రైతులకు బీమా సౌకర్యం కల్పించాలి.

-రాకోటి రాములు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి

ఆశలు వదులుకున్నాం

ఈ ఏడాది వరి సాగు చేసే పరిస్థితి కనిపించడంలేదు. పూర్తిగా ఆశలు వదులుకున్నాం. గతంలో పడిన చిన్నపాటి వర్షాలకు నారు సిద్ధం చేశాం. ప్రస్తుతం వర్షాలు అనుకూలించక పోవడంతో నారు ముదిరిపోయింది. ఇప్పుడు వానలు పడినా నారు ఉబాలకు పనికి రాదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.

-జి.అప్పలనాయుడు, రైతు, పాతబగ్గాం

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ఎండల తీవ్రత కారణంగా నారు మడులు ఎండిపోయే పరిస్థితి ఉన్నందున రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి. ఉద్యాన వన పంటల సాగుకు సమాయత్తం కావాలి.

-శ్రీనివాసరావు, ఏడీఏ, గజపతినగరం

============

ముదిరిపోతున్న వరినారు

బొబ్బిలి రూరల్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని కలవరాయి, మెట్టవలస, అలజంగి, పిరిడి, ముత్తావలస తదితర గ్రామాల్లో ఇప్పటికీ వరినాట్లు పడలేదు. దమ్ములు చేసేందుకు అవసరమైన నీరు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రెండు నెలల కిందట వేసిన వరినారు కూడా ముదిరిపోతోంది. మరో పదిరోజుల్లో నాట్లు వేయకపోతే నారు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగు సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు అవసరమైన విత్తనాలు కూడా అందు బాటులో లేవని వాపోతున్నారు. నారు, పెట్టబడులు నష్టపోయే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:09 PM