సాగు 35 శాతమే
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:15 PM
జిల్లాలో చినుకు జాడలేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి.
- ఆగస్టు వచ్చినా సాగని వ్యవసాయ పనులు
- జూన్, జూలై నెలల్లో తీవ్ర వర్షాభావం
- జిల్లాలో ఖరీఫ్ సీజన్ పరిస్థితి ఇదీ
- ఆందోళన చెందుతున్న రైతులు
జిల్లాలో చినుకు జాడలేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. మేఘాలు కమ్ముతున్నా చినుకు రాలడం లేదు. మరొపక్క సాగునీటి కాలువల ద్వారా చుక్క నీరు రావడం లేదు. ఫలితంగా వ్యవసాయ పనులు ముందుకు కదలడం లేదు. ఆగస్టు మొదటివారం పూర్తవుతున్నా ఇంకా 35 శాతమే ఖరీఫ్ సాగు జరిగింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒకపక్క నాట్లు వేసుకునేందుకు నీరు లేక, మరొపక్క ఎండుతున్న వరి నారు, ఎదలను కాపాడుకోలేక తల్లడిల్లుతున్నారు.
పాలకొండ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఖరీఫ్ పనులు ముందుకు సాగడం లేదు. గతంతో పోల్చు చూసుకుంటే వర్షాభావ పరిస్థితులు రైతన్నను వేధిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ కింద వరి, మొక్కజొన్న, పత్తి, చిరు ధాన్యాలు కలిపి మొత్తంగా 88,883 హెక్టార్లలో సాగు అవ్వాల్సి ఉంది. అయితే, ఆగస్టు మొదటి వారం వరకు కేవలం 36,534 హెక్టార్లలో మాత్రమే సాగు అయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ కింద 72,829 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 23,552 హెక్టార్లలో మాత్రమే పంటను వేశారు. గత ఏడాది ఇదే సమయానికి 59 వేల హెక్టార్లలో వరి సాగులోకి వచ్చింది. పత్తి గత ఏడాది ఆగస్టు మొదటి వారానికి 7,328 హెక్టార్లలో సాగు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 5,305 హెక్టార్లలో సాగు చేశారు. మొక్కజొన్న 5,883 హెక్టార్లకు గాను 5,573 హెక్టార్లలో, రాగులు, ఇతర చిరు ధాన్యాలు గత ఏడాది ఆగస్టు మొదటి వారంలో 811 హెక్టార్లలో సాగు అవ్వగా, ఈ ఏడాది 1313 హెక్టార్లలో వేశారు. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 35 శాతం మేర మాత్రమే ఖరీఫ్ పనులు జరిగాయి. ఈ నెలాఖరు వరకు వరి పంట వేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. నాట్లు వేసేందుకు అవసరమైన వర్షాలు కురవకపోవడం, ప్రాజెక్టుల ద్వారా కూడా శివారు ప్రాంతాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెలాఖరు వరకూ నాట్లు వేసుకోవచ్చు..
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. నాట్లు వేసేందుకు సరిపడా వర్షం కురవడం లేదు. రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరు వరకు వరినాట్లు వేసుకునేందుకు అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతలతో వరి నారుకు చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. స్థానిక వ్యవసాయ సిబ్బంది సూచనలతో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
-భవానీశంకర్, జిల్లా వ్యవసాయాధికారి
ఎండుతున్న వరి ఎదలు
గరుగుబిల్లి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలో వర్షాలు కురవక పలు గ్రామాల్లో వరి ఎదలు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు వరి ఎదలు జల్లారు. ఆ తరువాత వర్షాలు ముఖంచాటేయడంతో కేఆర్‌ఎన్ వలస తదితర గ్రామాల్లో ఎదలు ఎండిపోతున్నాయి. అలాగే జంఝావతి కాలువ నుంచి సాగునీరు సరఫరా కాకపోవడంతో తులసిరామినాయుడువలస తదితర గ్రామాల్లో వరి నాట్లు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
40 శాతం లోటు వర్షపాతం
పార్వతీపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షపాతం నెలకొంది. గత ఏడాది జూలైలో కురిసిన వర్షాలకు, ఈ ఏడాది పడిన వానలకు ఎంతో తేడా ఉంది. గత ఏడాది జూలైలో సాధారణ వర్షపాతం 208.5మి.మీ కాగా, 177.8 మి.మీ కురిసింది. ఈ ఏడాది జూలైలో సాధారణ వర్షపాతం 208.5 మి.మీ కాగా, కేవలం 93.7 మి.మీ మాత్రమే నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకు 350.06 మిల్లీమీటర్ల వాన కురవాల్సి ఉండగా జూన్ చివరి నాటికి 250.4 మిల్లీమీటర్ల మేర వర్షపాతమే నమోదైంది. మొత్తంగా మన్యంలో జూలై వరకు 40 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది అన్నదాతలు పంటల సాగుకు అష్టకష్టాలు పడుతున్నారు.
- సీతానగరం, సీతంపేట, కురుపాం, బలిజిపేట, సాలూరు, గరుగుబిల్లి, భామిని, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వర్షపాతం లోటు ఉండగా,. గుమ్మలక్ష్మీపురంలో అధిక వర్షపాతం నమోదైంది.