Share News

తరతరాలుగా సాగు.. దక్కని హక్కు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:58 AM

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు దశాబ్దాలుగా ఆ భూములే వారి జీవనాధారం. చెట్లు, గుట్టలు, రాళ్లతో నిండిన బీడు భూములను చెమటోడ్చి సాగుయోగ్యంగా మార్చుకు న్నారు.

తరతరాలుగా సాగు..  దక్కని హక్కు
తమ సాగులో ఉన్న భూములను చూపిస్తున్న గిరిజన రైతులు

  • కొండగంగపూడిలో 200 కుటుంబాల సుదీర్ఘ పోరాటం

  • తమ సాగు భూములకు డీపట్టాలు ఇవ్వాలని డిమాండ్‌

  • ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

  • జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనితకు వినతి

ఎస్‌.కోట, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు దశాబ్దాలుగా ఆ భూములే వారి జీవనాధారం. చెట్లు, గుట్టలు, రాళ్లతో నిండిన బీడు భూములను చెమటోడ్చి సాగుయోగ్యంగా మార్చుకు న్నారు. మామిడి, జీడిమామిడి తోటలతో పాటు వరి, రాగులు, జొన్నలు పండిస్తూ ఉపాధి పొందుతున్నారు. కానీ ఆ భూ ములపై వారికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు కల్పించలేదు. ఫలితంగా ప్రభుత్వ పథకాలు అందక, బ్యాంకుల నుంచి రుణాల రాక వేపాడ మండలం కొండగంగుపూడి పరిధిలోని గిరిజన, దళిత, బీసీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ప్రభుత్వ సాయానికి నోచుకోని వైనం

కొండగంగుపైడి పంచాయతీ పరిధిలోని చిట్టివా నిపాలెం, కోటియ్యగురువు, బందవలస, సారవా నిపాలెం, సంఘం వలస, సొంటివారిపాలెం, గంగారయ్యపేట, పాతూరు తదితర గిరిజన గ్రామాల రైతులు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ దాదాపు 200 మంది పేద రైతులు ఒక్కొక్కరు ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల వీరికి డీ పట్టాలు మంజూరు కాలేదు. పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వ వ్యవసాయ సబ్సిడీలు, పంట నష్టపరిహారం, బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం లేకుండా పోయింది. అత్యవసర సమయాల్లో లేదా పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం ఈ భూములను తాకట్టు పెట్టేందుకు కూడా వీలుకాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గత ప్రభుత్వంలో రాజకీయం

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ గ్రామాల పరిధిలోనే సాగులో ఉన్న కొంతమందికి సుమారు 150 మందికి డీ పట్టాలు మంజూరు చేశారు. కేవలం వైసీపీ నాయకులు ఎంపిక చేసిన ఆ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే పట్టాలు ఇచ్చారని, అప్పటి ప్రతిపక్షమైన టీడీపీ మద్దతుదారుల కుటుంబాలకు ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో సుమారు 200 మందికి రైతుకు అన్యాయం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి దృష్టికి..

కూటమి అధికారంలోకి రావడంతో తమకు న్యాయం జరుగుతుందని ఆ రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. హక్కుల సాధన కోసం తరచూ తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తరచూ ఆందోళనలు కూడా చేస్తున్నారు. గత నెలలో రైతు కుటుంబాలన్నీ ఏకమై తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించాయి. అంతేకాకుండా జిందాల్‌ చర్చల సమయంలో విజయనగరానికి వచ్చి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనితకు.. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, డీసీసీబీ చైర్మన్‌ గొంప కృష్ణ, ఆర్డీవో సుధాకర్‌ సమక్షంలో సమస్యను తెలియజేశారు. దీనిపై పరిశీలించి న్యాయం చేస్తామని ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

Updated Date - Jul 25 , 2026 | 12:58 AM