Climbing Hills రాళ్లు రప్పలు దాటాలి.. కొండ దిగి ఎక్కాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:11 AM
Crossing Rocky Terrain and Climbing Hills ఏజెన్సీలో గిరిబిడ్డలకు రేషన్ కష్టాలు వెంటాడు తున్నాయి. ప్రధానంగా గిరిశిఖర గ్రామస్థులు.. ప్రతినెలా నిత్యావసర సరుకులు పొందడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కొండ దిగి కిలోమీటర్ల మేర నడిచి జీసీసీ డిపోలు, సబ్‌డిపోలకు చేరుకోవాల్సి వస్తోంది. సరుకులు విడిపించుకుని తిరిగి తమ గ్రామాలకు చేరుకునే సరికి ఒకరోజు పడుతుంది. రేషన్ సరుకులు ఉచితంగా ఇస్తున్నా.. వాటిని తీసుకువెళ్లేందుకు రవాణా చార్జీలు తడిసిమోపెడు అవుతున్నాయి. రహదారి సౌకర్యం పూర్తిగా లేని గిరిశిఖర గ్రామాల గిరిజనుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
కిలోమీటర్ల మేర నడిచి డీఆర్ డిపోలకు చేరుతున్న వైనం
తిరిగి ఇళ్లకు చేరుకోవాలంటే మరింత కష్టం
తడిసిమోపెడవుతున్న రవాణా చార్జీలు
కొన్నిచోట్ల సకాలంలో పంపిణీ కాని సరుకులు
యథేచ్ఛగా సాగుతున్న బియ్యం దందా
పట్టించుకోని అధికారులు
సీతంపేట, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో గిరిబిడ్డలకు రేషన్ కష్టాలు వెంటాడు తున్నాయి. ప్రధానంగా గిరిశిఖర గ్రామస్థులు.. ప్రతినెలా నిత్యావసర సరుకులు పొందడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కొండ దిగి కిలోమీటర్ల మేర నడిచి జీసీసీ డిపోలు, సబ్‌డిపోలకు చేరుకోవాల్సి వస్తోంది. సరుకులు విడిపించుకుని తిరిగి తమ గ్రామాలకు చేరుకునే సరికి ఒకరోజు పడుతుంది. రేషన్ సరుకులు ఉచితంగా ఇస్తున్నా.. వాటిని తీసుకువెళ్లేందుకు రవాణా చార్జీలు తడిసిమోపెడు అవుతున్నాయి. రహదారి సౌకర్యం పూర్తిగా లేని గిరిశిఖర గ్రామాల గిరిజనుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మరోవైపు జీసీసీ డీఆర్ డిపోలు, సబ్‌డిపోలను సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో సకాలంలో సరుకులు పంపిణీ జరగడం లేదనే విమర్శలున్నాయి. మొత్తంగా వ్యయ ప్రయాసలకోర్చి జీసీసీ డీఆర్ డిపోలకు వెళ్లి రేషన్ సరుకులు తీసుకెళ్లడం భారంగా మారిందని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా ఏజెన్సీలో రేషన్ సరుకుల పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులు బియ్యం వ్యాపారులకు కలిసొస్తోంది. అమాయక గిరిజనులకు డబ్బు ఆశచూపి యథేచ్ఛగా తమ దందా సాగిస్తున్నారు. యథేచ్ఛగా పీడీఎస్ బియ్యం దందా జరుగుతున్నా రెవెన్యు, సివిల్‌సప్లైస్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
గత వైసీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసినా.. గిరిశిఖర గ్రామాల గిరిజనులు రేషన్ సరుకుల కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో జీసీసీ డీఆర్ డిపోల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. సరుకుల పంపిణీ పారదర్శకంగా జరుగుతున్నా.. గిరిశిఖర గ్రామాల గిరిజనులకు మాత్రం రేషన్ కష్టాలు తప్పడం లేదు. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
జీసీసీ డీఆర్ డిపోలు ఇలా..
సీతంపేట, పాతపట్నం మండలాల్లో జీసీసీ బ్రాంచ్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో సీతంపేట, హిరమండలం, భామిని, కొత్తూరు వీరఘట్టం, పాటపట్నం, మెళియాపుట్టి, మందస మండలాల్లో జీసీసీ డీఆర్ డిపోల ద్వారా కార్డుదారులకు రేషన్ సరుకులు అందిస్తున్నారు. సీతంపేట మండలంలో 36 డీఆర్ డిపోల పరిధిలో 16,736 రేషన్‌కార్డులు ఉన్నాయి. భామిని మండలంలో 3,489, కొత్తూరు 2039, హిరమండలం 269, వీరఘట్టం మండలంలో 323 రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుదారులకు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఆయా డిపోల్లో సరుకులు పంపిణిచేస్తున్నారు. అయితే జీసీసీ సేల్స్‌మన్‌లు తక్కువ మంది ఉండడం, డీఆర్ డిపోలు ఎక్కువగా ఉండడంతో కార్డుదారులకు అనుకున్న సమయానికి సరుకుల పంపిణీ జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత
గిరిశిఖర గ్రామాల్లో ఉంటున్న గిరిజనుల కోసం సీతంపేట, భామిని, పాలకొండ, కొత్తూరు మండలాల్లో మొత్తంగా 33 సబ్‌డిపోలు ఏర్పాటుచేశారు. సిబ్బంది కొరత కారణంగా వాటి ద్వారా కూడా సక్రమంగా రేషన్ సరుకుల పంపిణీ జరగడం లేదు. ప్రస్తుతం 21మంది సేల్స్‌మన్‌లు ఉండగా.. ఒక్కొక్కరు రెండు లేక మూడు డీఆర్ డిపోలు, సబ్‌డిపోలు నిర్వహిస్తున్నారు. వీరిలో ముగ్గురు రెగ్యులర్ సేల్స్‌మన్‌లు ఉన్నారు. మిగిలిన 18మందిలో 10మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. మరో 10మంది గిరిజన యువత డీలర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల సీతంపేట మండలంలో 24 సబ్‌డిపోలను కూడా ఏర్పాటుచేశారు. ఈ సబ్‌డిపోలకు కూడా డీఆర్ డిపో సేల్స్‌మన్‌లే నిర్వహిస్తున్నారు. దీంతో వారు ఎప్పడు అందుబాటులో ఉంటారో ఎప్పుడు ఉండరో తెలియని పరిస్థితి నెలకొంది.
అంగట్లో పీడీఎస్ బియ్యం
డిపోల్లో గిరిజనులకు ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని కిలో రూ.10కి బహిరంగంగా కొంతమంది వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పీడీఎస్ బియ్యాన్ని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న మరికొందరు గిరిజనులు చేసేది లేక డిపోల వద్ద, గ్రామంలోనే వ్యాపారులకు కారుచౌకగా వాటిని విక్రయిస్తున్నారు. అయితే ఈ బియ్యాన్నే వ్యాపారులు మైదాన ప్రాంతాల్లోనే రైస్ మిల్లులకు అమ్ముకుంటున్నారు. వాటినే పాలిష్ చేసి బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పీడీఎస్ బియ్యం క్రయ విక్రయాలు నేరమైనప్పటికీ.. అధికారులు పర్యవేక్షణ కొరవడింది. దీంతో వ్యాపారుల దందా మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.
అబాసి ఫలితమిచ్చేనా?
జిల్లాలో రేషన్ పంపిణీపై ప్రత్యేక పర్యవేక్షణ కోసం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి రూపొందించిన అబాసి(ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ) విధానం ఎంత వరకు ఫలితమిస్తుందో వేచి చూడాల్సి ఉంది. రేషన్ పంపిణీలో పారదర్శకత, సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతన విధానం దోహదపడుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎంతవరకు పర్యవేక్షణ ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవంగా జిల్లాలోని 15 మండలాల్లోని 576 రేషన్ దుకాణాల్లో ప్రతి నెలా 26 నుంచి తదుపరి నెల 15వరకు జరిగే రేషన్ పంపిణీ జరుగుతుంది. అయితే సీతంపేట ఏజెన్సీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, యథేచ్ఛగా విక్రయాలు వంటి దందాకు ‘అబాసి’ ఏమేరకు అడ్డుకట్ట వేస్తుందో వేచిచూడాల్సి ఉంది.
ఇబ్బందులు పడుతున్నాం
ప్రతి నెలా డీఆర్ డిపోలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. రేషన్ సరుకుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో నడిచివెళ్తున్నాం. అనుకున్న సమయానికి డిపోల ద్వారా సరుకులు అందేలా చూడాలి.
- సవర అనిత, మొగదారగూడ
==============================
డీఎస్‌వో, జీసీసీ డీఎం ఏమన్నారంటే..
‘ఏజెన్సీ ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్, రెవెన్యు, సివిల్‌సప్లైస్ అధికారుల నిఘా ఉంటుంది. అక్రమ కొనుగోళ్లు, నిల్వ, రవాణా వంటి అంశాలపై దృష్టి సారించాం. మరోవైపు డీఆర్ డిపోల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం.’ అని జిల్లా సివిల్‌సప్లైస్ అధికారి బి.అశోక్ తెలిపారు. ‘గిరిజనులకు జీసీసీ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నాం. జీసీసీలో సిబ్బంది కొరత ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కో సేల్స్‌మన్ రెండేసి డీఆర్ డిపోలు, సబ్ డిపోలు చూస్తున్నారు.’ అని జీసీసీ డీఎం బి.కృష్ణారావు తెలిపారు.