Share News

Down the Hill! 5 కిలోమీటర్లు రాళ్లు రప్పలు దాటి.. కొండ దిగి!

ABN , Publish Date - May 19 , 2026 | 11:25 PM

Crossing Rocks for 5 Kilometres… Down the Hill! గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. అత్యవసర వేళల్లో వైద్య సేవల కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సాలూరు మండలం కొదమ పంచాయతీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 Down the Hill! 5 కిలోమీటర్లు రాళ్లు రప్పలు దాటి.. కొండ దిగి!
డోలీతో కొండ‌ దిగుతున్న‌ గిరిజనులు

  • కడుపునొప్పితో బాధపడుతున్న మహిళను పార్వతీపురం ఆసుపత్రికి తరలింపు

సాలూరు, మే19(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. అత్యవసర వేళల్లో వైద్య సేవల కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సాలూరు మండలం కొదమ పంచాయతీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బందపాయి గ్రామానికి చెందిన సోడిపిల్లి టీటమ్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం సాయంత్రం కడుపునొప్పి ఎక్కువవడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు డోలీ కట్టారు. ఆమెను మోసుకుంటూ.. బందపాయి నుంచి సుమారు 5 కిలోమీటర్లు రాళ్లు రప్పలు దాటి.. కొండ దిగి లోద్ద గ్రామం వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి బైకులో మక్కువ మండలం దుగ్గేరు వరకు వెళ్లారు. ఆ గ్రామం నుంచి ఆటో ద్వారా పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి టీటమ్మను తీసుకెళ్లారు. వైద్యులు సత్వరం చికిత్స అం దించడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. మంగళవారం ఉదయం ఆమెను డిశ్చార్జి చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కాగా తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో వైద్యసేవల కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోందని ఆ ప్రాంతవాసులు వాపోయారు. గ్రామంలో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా... డోలీ మోతలు తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

- ఈ విషయం తెలుసుకున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. టీటమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రూ.1400 కోట్లతో అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే.. గిరిజనులకు శాపంగా మారిందని ఆరోపించారు.

Updated Date - May 19 , 2026 | 11:25 PM