Crop Insurance పంటలకు బీమా తప్పనిసరి
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:43 PM
Crop Insurance Mandatory ఎల్‌నినో నేపథ్యంలో పంటలకు బీమా తప్పనిసరి అని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ హరిబాబు చౌదరి తెలిపారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. తొలుత సీతానగరం మండలం లచ్చయ్య పేట రైతుసేవా కేంద్రంలో రైతులకు పలు సూచనలిచ్చారు.
సీతానగరం/గరుగుబిల్లి, ఆగస్టు12(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో నేపథ్యంలో పంటలకు బీమా తప్పనిసరి అని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ హరిబాబు చౌదరి తెలిపారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. తొలుత సీతానగరం మండలం లచ్చయ్య పేట రైతుసేవా కేంద్రంలో రైతులకు పలు సూచనలిచ్చారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉబాలు పూర్తయిన పంటలకు బీమా చేయించాలన్నారు. ఈ నెల 15 వరకు గడువు ఉన్నందున రైతులు సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాల్లో బీమా నమోదు చేసుకోవాలని తెలిపారు. తక్కువ నీటితో సాగయ్యే రాగులు, జొన్నలు, సజ్జలు, పప్పు, నూనె గింజల పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. నీటి పొదుపు పద్ధతులు పాటిస్తూ పంటలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. వాతావరణశాఖ హెచ్చరికలను గమనించి సాగు నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఆయన గరుగుబిల్లి మండలంలో పలు గ్రామాల్లో వరి ఎద పంటలను పరిశీలించారు. ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. అన్నదాతల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ పరిశీలనలో డీఏవో భవానీ శంకర్, శాస్త్రవేత్త అమృతవీణ తదితరులు ఉన్నారు.