crime nature రెచ్చిపోతున్నారు
ABN , Publish Date - May 21 , 2026 | 11:47 PM
crime nature తాగి వీధుల్లోకి వచ్చి విచ్చలవిడిగా స్వైర విహారం చేయడం.. అల్లర్లకు దిగి ప్రజలను భయపెట్టడం.. టూ వీలర్‌పై వెళ్తూ పెద్దగా హారన్‌లు వేసి జనాన్ని ఆందోళనకు గురిచేయడం.. గంజాయి మత్తు పదార్థాలను రవాణా చేయడం వంటి ఘటనలు జిల్లాలో అధికమవుతున్నాయి. నానాటికీ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. రౌడీ షీట్లు నమోదు చేస్తున్నా కట్టడి కావడం లేదు. తాజాగా పోలీసులు సీరియస్ యాక్షన్‌కు దిగారు. తప్పుదారిలో వెళ్లే వారు ఎంతటి వారైనా ఊరుకునేది లేదంటున్నారు.
రెచ్చిపోతున్నారు
జిల్లాలో ప్రతిఏటా పెరుగుతున్న రౌడీషీట్లు
విజయనగరంలో పెచ్చుమీరుతున్న విష సంస్కృతి
గంజాయి, మద్యం మత్తులో ఆకతాయిల అలజడి
- నగరంలోని శివాలయం వీధికి చెందిన ఓ యువకుడిపై ఇటీవల పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. ఇతనిపై 20కి పైగా కేసులున్నాయి. గంజాయి రవాణా, బెదిరింపులు, అల్లర్లపై కేసులు నడుస్తున్నాయి. పలుమార్లు పోలీసులు హెచ్చరించినా మాటవినకపోవడంతో పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
- విజయనగరంలో ఇటీవల ఓ రౌడీషీటర్ మృతిచెందాడు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న 30 మంది యువకులు అలజడి సృష్టించారు. నడి రోడ్డుపై సర్కస్ ఫీట్లతో దారిన పోయేవారికి తీవ్ర అసౌకర్యం కల్పించారు. రోడ్లపై గంతులేస్తూ స్థానికులను బెదరగొట్టారు. ఆ మరుసటి రోజు ఎస్పీ దామోదర్ రంగంలోకి దిగి తనదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు.
తాగి వీధుల్లోకి వచ్చి విచ్చలవిడిగా స్వైర విహారం చేయడం.. అల్లర్లకు దిగి ప్రజలను భయపెట్టడం.. టూ వీలర్‌పై వెళ్తూ పెద్దగా హారన్‌లు వేసి జనాన్ని ఆందోళనకు గురిచేయడం.. గంజాయి మత్తు పదార్థాలను రవాణా చేయడం వంటి ఘటనలు జిల్లాలో అధికమవుతున్నాయి. నానాటికీ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. రౌడీ షీట్లు నమోదు చేస్తున్నా కట్టడి కావడం లేదు. తాజాగా పోలీసులు సీరియస్ యాక్షన్‌కు దిగారు. తప్పుదారిలో వెళ్లే వారు ఎంతటి వారైనా ఊరుకునేది లేదంటున్నారు.
విజయనగరం, మే 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రౌడీషీటర్ల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఈ సంస్కృతి పెరుగుతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ...పౌర జీవనానికి ఆటంకం కలిగిస్తున్నారు. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా కొత్తవారు పుట్టుకొస్తున్నారు. ప్రధానంగా యువత నేర ప్రవృత్తి వైపు అడుగులు వేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గంజాయి మత్తులో ఎక్కువ మంది గొడవలు సృష్టిస్తున్నారు. ఇళ్లపైకి దూసుకెళుతున్నారు. మహిళలు, బాలికల వెంటపడుతూ వేధిస్తున్నారు.
విజయనగరంలో రౌడీషీట్ కల్చర్ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తరచూ ఆకతాయిల గొడవలు ఉంటున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. కంటోన్మెంట్, ఫూల్‌బాగ్, వైఎస్సార్ నగర్, బాబామెట్ట, జొన్నగుడ్డి, లంకపట్నం, చెల్లూరు-రాయపూర్ హైవే తదితర ప్రాంతాల్లో ఆకతాయిలు, రౌడీషీటర్లు మాటు వేస్తున్నారు. రాత్రి వేళల్లో అయితే గంజాయి, మద్యం తాగి మత్తులో తేలుతున్నారు. అటు వెళ్లేవారిని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఖాళీగా ఉండే భవనాల్లో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
పెరుగుతున్న రౌడీ షీట్లు
ప్రతి సంవత్సరం జిల్లాలో సుమారు వందల్లో రౌడీ షీట్లు నమోదవుతున్నాయి. 2023లో 375, 2024లో 371, 2025లో 286 షీట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది 294 మందిపై షీట్లు ఉన్నట్టు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. గంజాయి రవాణా, ఈవ్‌టీజింగ్, గొడవలు, రెండు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రమైన నేరాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడే వారిపై షీట్లు తెరస్తున్నారు. గంజాయి మత్తులో ఎక్కువగా అనర్థాలు జరుగుతున్నాయి. జిల్లా మీదుగా ఎక్కువగా గంజాయి రవాణా జరుగుతోంది. గత ఆరు నెలల్లో 20 కేసులు నమోదయ్యాయి. 85 మందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 300 కిలోల వరకూ గంజాయి పట్టుబడింది. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ పెద్ద ఎత్తున అమ్మకాలు సాగుతున్నాయి. దీంతో యువతకు మత్తుకు బానిసలవుతున్నారు. అదే మత్తులో గొడవలకు దిగుతున్నారు. రౌడీలుగా ముద్ర వేసుకుంటున్నారు.
ఉక్కుపాదం మోపుతాం
రౌడీయిజం చెలాయిస్తామంటే కుదరదు. మీం ఇలాగే ఉంటాం..మా తీరే అంతే అంటే జిల్లాను విడిచి వెళ్లండి. లేకుంటే పోలీస్ మార్కు ట్రీట్‌మెంట్ ఉంటుంది. ముందుగా కౌన్సిలింగ్, తరువాత బైండోవర్, చివరకు రౌడీషీట్ నమోదు చేస్తున్నాం. నిత్యం నిఘా ఉంటుంది. ముఖ్యంగా విజయనగరంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం.
- దామోదర్, ఎస్పీ, విజయనగరం
రైలులో గంజాయి తరలిస్తూ..
ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
14 కిలోలు స్వాధీనం
చీపురుపల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మపుర్ నుంచి విశాఖ వెళుతున్న రైలులో సోదాలు నిర్వహించిన చీపురుపల్లి పోలీసులు ఇద్దరు వ్యక్తుల నుంచి 14 కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కేరళకు చెందిన కొడవలం దేవీనాధ్, పటమాటు జోసెఫ్‌లుగా గుర్తించారు. చీపురుపల్లి సీఐ జి.శంకరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కేరళ రాష్ట్రంలోని కసర్‌గాడ్ జిల్లా కొడవలం గ్రామానికి చెందిన దేవీనాధ్, యర్నాకుళం జిల్లా వట్టటుపరకు చెందిన పటమాటు జోసెఫ్‌లు చెడు అలవాట్లకు బానిసలయ్యారు. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలో ఒడిశాలోని బరంపురానికి చెందిన రాహుల్‌తో మాట్లాడి అతని వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేశారు. అమ్మకం ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్నారు. గంజాయిని బ్రహ్మపుర్ నుంచి విశాఖ వెళ్లే పాసింజర్ రైలు (నంబరు.58531)లో తరలిస్తున్నారు. ఆపై యర్నాకులం తీసుకువెళ్లడానికి ప్రణాళిక వేసుకున్నారు. అయితే మాదక ద్రవ్యాల రవాణాపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బ్రహ్మపూర్ పాసింజర్‌లో సోదాలు చేపట్టేందుకు చీపురుపల్లి స్టేషన్‌లో రైలు ఎక్కారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నడుస్తున్న రైలులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ బోగీలో అనుమానితుల బ్యాగులు తనిఖీ చేయగా 14 కిలోల గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకొని రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు సైబర్ ఫోరెన్సిక్, కంప్యూటర్ సైన్సు డిగ్రీ విద్యార్థులని సీఐ తెలిపారు. విచారణ కోసం వీరిని పలాస జీఆర్పీకి అప్పగిస్తామన్నారు. చీపురుపల్లి డీయస్పీ ఎస్. రాఘవులు ఆధ్వరం్యలో జరిగిన ఈ తనిఖీల్లో గరివిడి, గుర్ల, బుదరాయవలస ఎస్సైలు బి. లోకేశ్వరరావు, నారాయణరావు, బి.లోకేష్, మధుసూధనరావు, ఆర్‌పీఎఫ్, ఈగల్, ఎస్టీఎఫ్, బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి.
గంజాయిని గుర్తించిన డాగ్
విజయనగరం, మే 21(ఆంధ్రజ్యోతి): రైల్లో గురువారం చేపట్టిన తనిఖీల్లో నార్కోటిక్ డాగ్ రుద్రా కీలక పాత్ర పోషించింది. గంజాయి తరలిస్తున్న వ్యక్తులను గుర్తించింది. రుద్రా అనుమానంతో ఆగిన చోట తనిఖీలు చేయగా నిందితుల బ్యాగుల్లో 14 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. ఇందుకు గాను రుద్రాను ఎస్పీ దామోదర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయిని నియంత్రించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక నార్కోటిక్ డాగ్‌ను మంజూరు చేసిందన్నారు. రుద్రా మంగళగిరిలో శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవల జిల్లాకు వచ్చిందని తెలిపారు.
-----------------