Cries in the bus బస్సులో ఆర్తనాదాలు
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:13 AM
Cries in the bus బస్సులో అంతవరకు ప్రశాంతంగా కూర్చొన్న ప్రయాణికులు ఉన్నట్టుండి భారీ కుదుపుతో ఒకరిపై ఒకరు పడిపోయారు. ఐరన్ రాడ్‌లను గుద్దుకుని గాయాల పాలై ఆర్తనాదాలు చేశారు. ఏం జరిగిందో అర్థంకాక కాపాడాలంటూ కేకలు పెట్టారు. దాదాపు 25 మంది గాయాలపాలయ్యారు.
బస్సులో ఆర్తనాదాలు
కొన్ని నిమిషాల పాటు ఆందోళన
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
నుజ్జునుజ్జయిన బస్సు ముందు భాగం
25 మందికి గాయాలు
ప్రమాదంతో రోడ్డుపై భారీగా నిలిచిపోయిన వాహనాలు
బస్సులో అంతవరకు ప్రశాంతంగా కూర్చొన్న ప్రయాణికులు ఉన్నట్టుండి భారీ కుదుపుతో ఒకరిపై ఒకరు పడిపోయారు. ఐరన్ రాడ్‌లను గుద్దుకుని గాయాల పాలై ఆర్తనాదాలు చేశారు. ఏం జరిగిందో అర్థంకాక కాపాడాలంటూ కేకలు పెట్టారు. దాదాపు 25 మంది గాయాలపాలయ్యారు. పార్వతీపురం నుంచి సాలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రామభద్రపురం వద్ద లారీని ఢీకొనడంతో ఇదంతా జరిగింది. బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది.
రామభద్రపురం, మార్చి 11(ఆంధ్రజ్యోతి):
పార్వతీపురం నుంచి సాలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు, విజయనగరం నుంచి పార్వతీపురం వెళుతున్న లారీ రామభద్రపురం వద్ద పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 25 మందికి గాయాలయ్యాయి. కొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది స్వచ్ఛందంగా రామభద్రపురం, బొబ్బిలి ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందారు. ప్రమాదానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.
కొట్టక్కి గ్రామానికి చెందిన గులిపల్లి ఎర్రమ్మ, బలిజిపేట మండలం బర్లి గ్రామానికి చెందిన ఇజ్జాడ గౌరమ్మ, బొబ్బిలి మండలం నారసింహునిపేటకు చెందిన పి.నాగరాజు, ఎం.బూర్జివలసకు చెందిన గేదెల దాడమ్మ, బొబ్బిలి పట్టణం దే వర వీధికి చెందిన ఆలమూరి యోగిత, సీతానగరం మండలం అంటివలస గ్రామానికి చెందిన పాలకొండ తిరుపతి, రామభద్రపురం మండలం పాడివానివలస గ్రామానికి చెందిన నెక్కల గౌతమి తదితరులకు గాయాలు తగిలాయి. తీవ్రంగా గాయపడినవారిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని బొబ్బిలి రూరల్ సీఐ ఎస్.శ్రీనివాస్ పరిశీలించారు. ఈ ప్రమాదంతో రెండువైపులా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జయిపోవడంతో క్రేన్ సహాయంతో జాతీయ రహదారిపై ఉన్న బస్సును వేరే ప్రదేశానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన బాడంగి సీహెచ్‌సీకి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు.
ఫ ప్రమాదంలో రామభద్రపురం ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని తన పోలీసు వాహనంలో బాడంగి ఆసుపత్రికి తరలించారు.