Share News

crap insurance పశు బీమాతో రైతుకు ధీమా

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:16 AM

crap insurance పశు బీమాతో రైతుకు ధీమా

crap insurance పశు బీమాతో రైతుకు ధీమా

పశు బీమాతో రైతుకు ధీమా

ప్రీమియంలో 85 శాతం రాయితీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం

నేటి నుంచి నమోదు

ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన పశు బీమా పథకం తిరిగి ప్రారంభం కాబోతోంది. గత ప్రభుత్వం మృతి చెందిన పశువులకు కేవలం నష్టపరిహారం మాత్రమే ఇవ్వగా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బీమా పథకం ప్రారంభానికి చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో రైతులకు ఆర్థికంగా భారం కాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85 శాతం రాయితీతో ఈ బీమా పథకాన్ని వర్తింప చేయనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి ప్రారంభం కాబోతున్న పశు వైద్య శిబిరాల్లో ఈ బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం వసూలు చేయనున్నారు.

చీపురుపల్లి/ఎస్‌.కోట రూరల్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి):

ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి మూగ జీవాలు మరణిస్తే రైతులు నష్టపోకుండా కాపాడేది ఈ బీమా పథకమే. కేంద్ర, రాష్ట్ర సంయుక్త నిర్వహణలో ఈ పథకం అమలుకానుంది. అయితే గతానికి భిన్నంగా 85 శాతం రాయితీ ఉంటుంది. రైతులు ప్రీమియం మొత్తంలో కేవలం 15 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఈ నెల 19 నుంచి 31 వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉచిత పశు వైద్య శిబిరాల్లో అర్హత ఉన్న అన్ని పశువులకు బీమా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ పథకంలో ఇంకా నమోదు కాని పశుపోషకుల వివరాలను ఈ శిబిరాల్లో నమోదు చేస్తారు.

ప్రీమియం చెల్లింపు వివరాలివే

ఉత్పాదక దశలో ఉన్న, ఒకసారి ఈనిన 2-10 సంవత్సరాల ఆవులు, 3-10 సంవత్సరాల మేలు జాతి(సంకర జాతి/దేశీయ) గేదెలకు రూ.30వేల, నాటు పశువులకు ఒక్కొక్కదానికి రూ.15 వేలు పశు బీమా చెల్లిస్తారు. ఒకటిన్నర సంవత్సరాలు పైబడిన మేలు జాతి (సంకరజాతి/దేశీయ) ఎద్దులు, దున్నలకు రూ.30 వేలు, 2 సంవత్సరాలు పైబడిన నాటు ఎద్దులు, దున్నలకు ఒక్కొక్కదానికి రూ.15 వేలు బీమాను చెల్లిస్తారు. రూ.30 వేలు విలువైన పశువుకు బీమా ప్రీమియం 1920 చెల్లించాలి. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85 శాతం వాటాగా రూ.1632లు భరిస్తాయి. మిగిలిన కేవలం రూ.288 (15 శాతం రైతు వాటా) పశుపోషకులు చెల్లించాల్సి ఉంటుంది.

- గత ప్రభుత్వంలో బీమా ప్రీమియంగా రూ.384లు రైతుల నంచి వసూలు చేసేవారు. ఇప్పుడు దేశవాళీ రకం పశువులకు రూ.15వేల బీమాకు ప్రీమియం మొత్తం రూ.960లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తుండగా, మిగిలిన రూ.144లు పశుపోషకులు చెల్లించాల్సి ఉంది. సన్న జాతి జీవాలకు వరుసగా 1,2,3 యేళ్ల కాలానికి బీమా చేస్తారు. తొలి ఏడాది రూ.6వేల బీమాకు 3 శాతం ప్రీమియం కింద రూ.153లు రాయితీ లభించనుండగా, లబ్ధిదారుడు రూ.27లు చెల్లిస్తే సరిపోతుంది. ఈ బీమా ఒక రేషన్‌ కార్డు కలిగి ఉన్న లేదా ఒక కుటుంబానికి గరిష్టంగా 10 ఆవులు లేదా గేదెలు, 100 జీవాలు, 50 పందులకు మాత్రమే వర్తిస్తుంది.

శిబిరాలకు సర్వం సిద్ధం

ఈ నెల 19 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నాం. ఈ శిబిరాలు 31వ తేదీ వరకూ జరుగుతాయి. శిబిరాల ద్వారా బీమా ప్రీమియం చెల్లింపునకు సంబంధించి జిల్లాకు ప్రభుత్వం బడ్జెట్‌ను కేటాయించింది. ఈ బడ్జెట్‌ పరిధిలో సుమారు 1500 నుంచి 2000 గొర్రెలు, 500 ఆవులు లేదా గేదెలకు ప్రభత్వ వాటా కింద ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. పశువుల బీమా మొత్తం, ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలు పశు వైద్య అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి.

- డా.మురళీకృష్ణ, సంయుక్త సంచాలకుడు,

పశు సంవర్ధక శాఖ, విజయనగరం జిల్లా

=---------

Updated Date - Jan 19 , 2026 | 12:16 AM