Share News

Crammed into Containers! కంటైనర్లలో కుక్కి!

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:28 AM

Crammed into Containers! జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్థానిక సంతల్లో కొనుగోలు చేస్తున్న పశువులను కంటైనర్లలో కుక్కి.. యథేచ్ఛగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా రాష్ర్టాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా పార్వతీపురం, సాలూరు పట్టణాల్లో ప్రతి వారం జరిగే సంతల నుంచి వందలాది పశువులు కబేళాలకు తరలివెళ్తున్నాయి.

Crammed into Containers!  కంటైనర్లలో కుక్కి!
పశువులను తరలించేందుకు సిద్ధంగా ఉన్న కంటైనర్‌

  • చెక్‌పోస్టులు, పోలీస్‌స్టేషన్లు దాటి వెళ్తున్న కంటైనర్లు

  • ఏఎంసీల నుంచి నేరుగా కబేళాలకు తరలింపు

  • అయినా పట్టుకోలేకపోతున్న అధికారులు, పోలీసులు

పార్వతీపురం, మార్చి31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్థానిక సంతల్లో కొనుగోలు చేస్తున్న పశువులను కంటైనర్లలో కుక్కి.. యథేచ్ఛగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా రాష్ర్టాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా పార్వతీపురం, సాలూరు పట్టణాల్లో ప్రతి వారం జరిగే సంతల నుంచి వందలాది పశువులు కబేళాలకు తరలివెళ్తున్నాయి. ఒడిశా రాష్ట్రం సునాబెడ, సిమిలిగూడ నుంచి సాలూరు, గుమ్మలక్ష్మీపురం మీదుగా పెద్ద ఎత్తున పశువుల అక్రమ రవాణా సాగుతోంది. జిల్లాలో ఉన్న చెక్‌పోస్టులు, పోలీస్‌స్టేషన్లు దాటి ఈ వాహనాలు వెళ్తున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇతర రాష్ర్టాల వ్యాపారులు జిల్లాలో ప్రతినెలా పశువుల కొనుగోలుకు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కొనుగోలు చేసిన పశువులను తొలుత వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయ ప్రాంగణాలకు తరలిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచే నేరుగా ఇతర రాష్ర్టాలకు వాటిని పంపిస్తున్నారు.

చెక్‌పోస్టులు ఉన్నా.. లేనట్టే!

పార్వతీపురం పట్టణ శివారులో వెంకంపేట గోలీలు, విజయనగరం జిల్లా రామభద్రపురం, విజయనగరం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, పోలీస్‌స్టేషన్లు ఉన్నా.. లేనట్టే. వాటిని దాటుకుని పార్వతీపురం నుంచి విజయనగరం, విశాఖ మీదుగా దర్జాగా పశు అక్రమ రవాణా సాగుతోంది. రోజూ కంటైనర్లు, ఇతర వాహనాల్లో పశువుల తరలింపు ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. ఒక్కోసారి అధికారుల దాడుల్లో కంటైనర్లు, ఇతర వాహనాలు పట్టుబడుతున్నా.. పరిస్థితి ఏం మారడం లేదు.

అనుమతులు తప్పనిసరి

పశువుల రవాణాకు ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు మాకు ఎటువంటి ఆన్‌లైన్‌ దరఖాస్తులు రాలేదు. పశువుల అక్రమ రవాణా జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

- మన్మథరావు, జిల్లా పశువైద్యశాఖాధికారి

==========================

బైక్‌ను ఢీకొన్న పశువుల వ్యాన్‌

కొమరాడ, మార్చి31(ఆంధ్రజ్యోతి): పశువులను అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యాన్‌.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం కొమరాడ మండలంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ ఎమ్‌వీ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పశువులతో ఓ వ్యాన్‌ మితిమీరిన వేగంతో ఒడిశా రాష్ట్రం అమలాబడి నుంచి పార్వతీ పురం వైపు వస్తోంది. అయితే కొమరాడ వద్ద కూనేరు నుంచి వస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న సీసాడవలస గ్రామానికి చెందిన పువ్వల రాము, ఉర్ల కామయ్య తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ ఎమ్‌వీ రాజు తెలిపారు. పరారీలో ఉన్న వాహనం వివరాలు సేకరిస్తు న్నామని, త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. కాగా ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రా మీదుగా పశువులు తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి , కోరాడ ఈశ్వరరావు తదితరులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 01 , 2026 | 12:28 AM