Cracked బీటలు వారి.. కుంగిపోయి!
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:54 PM
Cracked and caved in! తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన వంతెనలు ప్రమాదకరంగా మారాయి. గత కొన్నాళ్లుగా వాటికి మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో వంతెనలపై ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తుండగా.. రక్షణ గోడలు శిథిలావస్ధకు చేరుకున్నాయి.
కనీస మరమ్మతులకు నోచని వైనం
బిక్కుబిక్కుమంటూ రాకపోకలు
గరుగుబిల్లి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన వంతెనలు ప్రమాదకరంగా మారాయి. గత కొన్నాళ్లుగా వాటికి మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో వంతెనలపై ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తుండగా.. రక్షణ గోడలు శిథిలావస్ధకు చేరుకున్నాయి. ప్రధానంగా ప్రాజెక్టు పరిధిలోని ఉల్లిభద్ర కుడి ప్రధాన కాలువపై నిర్మించిన వంతెనకు సంబంధించి దిగువ భాగంలో లైనింగ్‌కు ఒకవైపు బీటలు వారగా.. మరోవైపు కుంగింది. పార్వతీపురం- శ్రీకాకుళం, కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాలతో పాటు సరిహద్దు ప్రాంతాల రాకపోకలకు ఈ వంతెనలే ఆధారం. అయితే భారీ వాహనాలు ప్రయాణించే సమయంలో వంతెన కదులుతోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. మరోవైపు సంతోషపురం సమీపంలో నాగావళి నదిపై నిర్మించిన వంతెన కూడా శిఽథిలావస్థకు చేరుకుంది. రక్షణ గోడల ఇసుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. ఈ వంతెనలు కూలితే జిల్లాతో పాటు శ్రీకాకుళం, ఒడిశాకు రాకపోకలు స్తంభించే అవకాశం ఉంది. దీనిపై ప్రాజెక్టు ఏఈ బి.కిషోర్ కుమార్‌ను వివరణ కోరగా.. ‘వంతెనల మరమ్మతు పనులకు ప్రతిపాదనలను పంపించాం. ఉల్లిభద్ర, సంతోషపురం ప్రాంతాల్లో పరిశీలించి ప్రత్యేక చర్యలు చేపడతాం. ఉల్లిభద్ర వంతెన లైనింగ్ కూలే స్థితికి చేరింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తాం.’ అని తెలిపారు.