Share News

ఇసుక అక్రమ రవాణాపై కొరడా

ABN , Publish Date - May 14 , 2026 | 11:58 PM

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.

 ఇసుక అక్రమ రవాణాపై కొరడా
బత్తిలిలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్న సబ్‌కలెక్టర్‌

- రంగంలోకి దిగిన సబ్‌కలెక్టర్‌

- బత్తిలిలో రెండు ట్రాక్టర్లు సీజ్‌

పార్వతీపురం/భామిని, మే 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నెల 13న ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘మన్యం టు ఒడిశా’ కథనంపై అధికారులు స్పందించారు. ఈ మేరకు ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతున్న భామిని, కొమరాడ తదితర మండలాలపై దృష్టి సారించారు. బుధవారం కొమరాడ మండలం గుంప తీరం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేశారు. జియ్యమ్మవలస మండలం బిత్రపాడులో కూడా ఇసుక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని చిన్నమేరంగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గురువారం భామిని మండలం బత్తిలి వంశధార నదీ తీరాన్ని పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ పరిశీలించారు. ఇక్కడ నుంచి ఒడిశాకు తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ట్రాక్టర్లను బత్తిలి ఎస్‌ఐ కె.రవీంద్రకు అప్పగించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు సందర్శించి రిజిష్టర్లను పరిశీలించారు. ఎన్ని ఇసుక ట్రాక్టర్లు ఒడిశాకు వెళుతున్నాయని ఆరా తీశారు. ఆంధ్రా నుంచి ఒడిశాకు ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ప్రతిరోజూ సమాచారాన్ని అందజేయాలని ఎస్‌ఐకు ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులశాఖ అధికారి రాము తెలిపారు.

Updated Date - May 14 , 2026 | 11:58 PM