Share News

cow worry గోవుల ఘోష

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:35 AM

cow worry అదో పల్లెటూరు. అక్కడి వారికి గోవులను ఆదరించడమే తెలుసు. వ్యవసాయంతో పాటు పశువుల పెంపకాన్ని జీవనాధారంగా చేసుకుని ఎంతో మంది బతుకుతున్నారు. అటువంటి గ్రామంలో అర్ధరాత్రి వేళ అటుగా వచ్చిన కొందరు యువకులకు గోవుల ఆర్తనాదాలు చెవున పడ్డాయి. గోవుల ఘోషను విన్న వారికి మనసు చివుక్కుమంది. ఏం జరుగుతోందో తెలుసుకుందామని వెళ్లారు. గోవులను నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోపాలపల్లిలోని యాతపేటలో జరుగుతున్న ఈ దారుణంతో ఎస్‌.కోట మండలమంతా కలకలం రేగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

cow worry గోవుల ఘోష
పశు కబేళా నిర్వహిస్తున్న షెడ్‌ ఇదే

గోవుల ఘోష

గుట్టుగా కబేళా నిర్వహణ

గోపాలపల్లిలో అర్ధరాత్రి వేళ మూగజీవుల ఆర్తనాదాలు

చలించిపోయిన యువత

నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

గొర్రెల పెంపకం షెడ్‌ పేరుతో పశువధ

అదో పల్లెటూరు. అక్కడి వారికి గోవులను ఆదరించడమే తెలుసు. వ్యవసాయంతో పాటు పశువుల పెంపకాన్ని జీవనాధారంగా చేసుకుని ఎంతో మంది బతుకుతున్నారు. అటువంటి గ్రామంలో అర్ధరాత్రి వేళ అటుగా వచ్చిన కొందరు యువకులకు గోవుల ఆర్తనాదాలు చెవున పడ్డాయి. గోవుల ఘోషను విన్న వారికి మనసు చివుక్కుమంది. ఏం జరుగుతోందో తెలుసుకుందామని వెళ్లారు. గోవులను నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోపాలపల్లిలోని యాతపేటలో జరుగుతున్న ఈ దారుణంతో ఎస్‌.కోట మండలమంతా కలకలం రేగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఎస్‌.కోట రూరల్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి):

ఎస్‌.కోట మండలంలోని గోపాలపల్లి యాతపేటలో కొందరు గొర్రెల పెంపకం పేరుతో షెడ్‌ నిర్వహిస్తున్నారు. ఐదునెలల కిందట పంచాయతీ కార్యదర్శి వద్ద ఇంటికోసం అనుమతులు తీసుకున్నారు. ఆపై గొర్రెల పెంపకం పేరుతో ఒక షెడ్‌ కట్టారు. ప్రతిరోజు వ్యాన్‌లతో మాంసం పట్టుకెళ్తుంటే గొర్రెల మాంసం అనుకుని ఎవరూ పట్టించుకోలేదు. పశువుల కబేళా నిర్వహిస్తున్నట్లు బయటకు పొక్కడంతో అందరూ విస్తుపోయారు. శనివారం రాత్రి లక్కవరపుకోట మండలంలోని కొట్యాడ గ్రామానికి తీర్థానికి వెళ్లిన కొందరు యువకులు రాత్రి 12గంటల తరువాత గోపాలపల్లి వస్తుండగా యాతపేట వద్ద పశువుల ఆర్తనాదాలు వినిపించాయి. తెలుసుకుందామని వెళ్లి చూశారు. లోపల ఐదుగురు వ్యక్తులు ఆవులను నిర్దాక్షిణ్యంగా చంపడం చూసి ఆశ్చర్య పోయారు. వెంటనే డయల్‌ 112కు ఫోన్‌ చేయడంతో ఎస్‌.కోట ఏఎస్‌ఐ గోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావడాన్ని గమనించిన పలువురు పారిపోయారు. విశాఖపట్నం రైల్వేన్యూకాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గడిచిన ఐదునెలలుగా గుట్టుచప్పుడుకాకుండా ఇక్కడ పశువులను వధించి విజయనగరం, విశాఖపట్నం, ఎస్‌.కోట పట్టణంలోని పలు హోటళ్లకు మాంసం విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈవిషయంపై గ్రామ ఉపసర్పంచ్‌ గణేష్‌, యువకులు మల్లా రమేష్‌, అల్లూరి కిశోర్‌రాజు, ఇప్పిలి నాయుడు, మల్లా సూరిబాబు, తగరంపూడి రమణ, ఎంపీటీసీ సభ్యుడు గుమ్మడి సన్యాసప్పడు ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. గొర్రెల మాంసం పేరుతో ప్రతిరోజు వ్యాన్‌లతో మాంసం పట్టుకెళ్తుంటే మాములే అనుకున్నామని, అయితే జామి మండలం లోట్లపల్లి సంతనుంచి జబ్బుపడిన ఆవులను తెచ్చి ఇక్కడ వధించడం గుర్తించామన్నారు. చాలామంది ఇంట్లో శుభకార్యాలకు ఇక్కడి నుంచే కిలో మటన్‌ రూ.270కు పట్టుకెళ్లేవారని, మార్కెట్లో రూ.700 ఉంటే వీరు రూ.270కు ఎలా అమ్ముతున్నారో ఇన్నాళ్లూ అర్థంకాలేదన్నారు. సర్పంచ్‌ మహేశ్వరరావు మాట్లాడుతూ ఐదునెలల క్రితం ఇక్కడ షెడ్‌ నిర్మించినప్పుడు అడ్డుకున్నామని, వారు గుట్టుచప్పుడు కాకుండా నిర్మించి ఈ వ్యాపారం చేయడం దారుణమన్నారు. ఇదే విషయంపై కార్యదర్శి గౌరమ్మ వివరణ కోరగా ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని షెడ్‌కట్టిన విషయం తనకు తెలియదన్నారు. కాగా కబేళా వద్ద వధించిన ఆవుల కళేబరాలకు మండల పశువైద్యాధికారి రామ్‌కుమార్‌, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ఆద్వర్యంలో పంచనామా నిర్వహించారు. ఇక్కడ పశువుల కబేళా బయటపడటంతో గ్రామ మహిళలు భయాందోళన చెందారు. ఆవులను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:35 AM