Share News

Counting నేడు కౌంటింగ్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:54 PM

Counting Today కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరికొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. నేడు పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. 15 జడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో శనివారం ఓట్లు లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Counting   నేడు కౌంటింగ్‌
సాలూరులో కౌంటింగ్‌ కేంద్రం ఇలా..

  • నాలుగు కేంద్రాల్లో నేడు ఓట్ల లెక్కింపు..

పార్వతీపురం/ బెలగాం/ సాలూరు/పాలకొండ/గరుగుబిల్లి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరికొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. నేడు పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. 15 జడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో శనివారం ఓట్లు లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులను తెరిచి.. ప్రాదేశికాలవారీగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లును విభజించి లెక్కింపు చేపట్టనున్నారు. అయితే కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కావడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. జిల్లాలో 6,43,875 మంది ఓటర్లు ఉండగా .. ఈనెల 5న జరిగిన ఎన్నికల్లో 4,32,161 ఓట్లు పోలయ్యాయి. 67.12 శాతం ఓటింగ్‌ నమోదైంది.

లెక్కింపు కేంద్రాలివే..

- పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, ఉల్లిభద్ర వద్ద ఉన్న ఉద్యాన కళాశాలలో గుమ్మలక్ష్మీపురం, కురు పాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ మండలాలకు సంబంధించి ఓట్లు లెక్కించనున్నారు. పాచిపెంట, మక్కువ, సాలూరు మండలాలకు సంబంధించి సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, పాలకొండ డిగ్రీ కళాశాలలో భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాలకు సంబంధించి ఓట్లు లెక్కింపు జరగనుంది. కేంద్రాల్లోకి అభ్యర్థితోపాటు పోలింగ్‌ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు.

- పాలకొండలో వెబ్‌కాస్టింగ్‌ మధ్య ఓట్లు లెక్కింపు చేపడుతున్నట్లు డీఎస్పీ ఎం.రాంబాబు తెలిపారు. ఓట్లు లెక్కింపు కేంద్రం సమీపంలో పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గుంపులుగా సంచరించరాదని వెల్లడించారు. అభ్యర్థులు, మీడియా కోసం కళాశాల మైదానంలో ప్రత్యేక టెంట్‌ ఏర్పాటు చేశామన్నారు.

భారీ పోలీస్‌ బందోబస్తు...

పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 2,019 మంది కానిస్టేబుళ్లు 123 మంది హోంగార్డులను నియమించారు. మూడెంచల భద్రత చర్యలు చేపడుతున్నారు. 400 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందితో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ భ ద్రతా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. కౌంటింగ్‌ కేంద్రాల భవనాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పరిసర ప్రాంతాలను ముందుగానే పరిశీలించామన్నారు. ప్రధాన రహదారులు, సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్‌ మొబైల్‌ బృందాలతో నిరంతర గస్తీ కొనసాగుతుందని తెలిపారు.

ఎన్నికల సిబ్బంది నిరసన

గరుగుబిల్లి: ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల ఆవరణలో శుక్రవారం ఎన్నికల సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పనలో విఫలమవ్వడంపై ఐదు మండలాలకు చెందిన పలు శాఖల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు లెక్కింపు కోసం 300లకు పైగా పలు శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తదితర సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. అయితే సక్రమంగా భోజన ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటితో పాటు సమయానికి అనుగుణంగా సామగ్రి అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుపాం ఆర్‌వోలు కనకదుర్గ, నాగభూషణరావు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు.

Updated Date - Nov 06 , 2026 | 11:54 PM