Cooperative employees' strike సహకార ఉద్యోగుల సమ్మె
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:05 AM
Cooperative employees' strike ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ( పీఏసీఎస్) పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఏడాది నవంబరు నుంచే దశలవారీగా నిరసన తెలియజేస్తున్నారు.
సహకార ఉద్యోగుల సమ్మె
మూసేసిన పీఏసీఎస్‌లు
ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు
ఉమ్మడి జిల్లాలో 325 మంది ఉద్యోగులు
విజయనగరం రూరల్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ( పీఏసీఎస్) పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఏడాది నవంబరు నుంచే దశలవారీగా నిరసన తెలియజేస్తున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళన, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాల సమర్పణ, నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు, కలెక్టరేట్ ఎదుట ధర్నా వంటి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సహకార సంఘ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించింది. ఆ నోటీసులో పేర్కొన్న విధంగా ఈ నెల 16 నుంచి సమ్మెకు దిగారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 95 పీఏసీఎస్‌లు ఉండగా, సీఈఓ స్థాయి నుంచి అటెండర్ స్థాయి వరకూ 325 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో పీఏసీఎస్‌లన్నీ మూతపడ్డాయి. ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు ప్రభుత్వం సహకార ఉద్యోగులతో సోమవారం ఉదయం చర్చలు జరిపింది. ఇంకా స్పష్టత రాలేదు.
డిమాండ్లు ఇవీ
- వేతన సవరణ చేయాలి
- గ్రాడ్యూటీని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి
- జీవిత బీమా మొత్తం పెంచాలి
- పదవీ విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలి
ఏం చేద్దాం?
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో డీసీసీబీ, సహకార అధికారులు
18న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం
విజయనగరం రూరల్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగులు ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ( డీసీసీబీ) సమావేశ హాలులో జిల్లా సహకార అఽఽధికారి పి.రమేష్, సహకార శాఖ జిల్లా రిజిస్ట్రార్ ఈశ్వరరావు, డీసీసీబీ సీఈఓ సీహెచ్ ఉమామహేశ్వరరావు, డీసీసీబీ జీఎం ప్రసాద్‌తో పాటు డీసీసీబీ ఉన్నతాధికారులు సోమవారం సమీక్షించారు. కార్యకలాపాలు జరగకపోవడం వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేశారు. ఏమి చేయాలన్న దానిపై చర్చించారు. కలెక్టర్ రామసుందర్‌రెడ్డితో పాటు సహకార శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రాజధాని అమరావతిలో సోమవారం సహకార ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో వేచి చుద్దామన్న విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 18న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కోసం ఆలోచన చేద్దామని నిర్ణయించారు.